సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మానవ హక్కుల కమీషన్‌లు ఏర్పాటు చేయకపోవడంపై సుప్రీంకోర్టు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లోనూ మానవ హక్కుల కమిషన్లను ఏర్పాటు చేయకపోవడం వల్ల పౌరుల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు బాధితులు న్యాయం పొందలేక పోతున్నారని జమ్ముల చౌదరయ్య అనే వ్యక్తి పిటీషన్ దాఖలు చేశారు.
రెండు రాష్ట్రాల్లో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘనల ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, దీనివల్ల బాధితులకు సరైన సమయంలో న్యాయం దక్కడం లేదని పిటీషనర్ తన పిటీషన్‌లో పేర్కొన్నారు. ఏపీలోని పురుషోత్తపట్నం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన వారి హక్కులకు భంగం వాటిల్లుతోందని, న్యాయం కోసం అభ్యర్థిస్తున్న మహిళలు, రైతులపై పోలీసులు దాడులకు పాల్పడిన ఘటనలను పిటిషనర్ ఈ సందర్భంగా ఉదహరించారు.
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఏపీ, తెలంగాణలతో మానవ హక్కుల కమీషన్‌లలో చైర్మెన్, సభ్యుల నియామకాలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీల ఏర్పాటుపై వైఖరి తెలియాజేయాలని ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment