సస్పెన్షన్ ఊహించలేదు: ఎంపీ అనంత
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాటం చేస్తున్నామని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. లోక్సభ నుంచి సస్పెండయిన తర్వాత మిగతా ఎంపీలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సస్పెన్షన్ ఊహించలేదన్నారు.
తమకు పదవులు ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగా సమైక్యానికి అనుకూలంగా కేంద్రం నుంచి ప్రకటనచేయించుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు నాయుడు యాత్ర చేపట్టారని ఆయన విమర్శించారు. జాతీయ నాయకురాలైన సోనియా గాంధీని విమర్శించడం తగదని అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు.
రాష్ట్ర విభజనకు అనుకూలంగా తమ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మార్పించేందుకు ప్రత్నిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ.. ఇప్పుడు 'సమైక్యం' పాట పాడుతుండడం హాస్యాస్పదమని అన్నారు.