తమ్ముళ్లలో ‘అన్న’ భయం
► ‘అన్న’ అరాచకాలు దెబ్బతీస్తాయా?
► అన్నింటా తానై దోపిడీ
► ఆదిలోనే అడ్డుకట్ట వేయడంలో విఫలం
► టీడీపీ, బీజేపీ అభ్యర్థుల్లో ఆందోళన
సాక్షి, కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం కార్పొరేటర్ అభ్యర్థులకు ఆది నుంచీ అన‘కొండ’ ‘అన్న’ భయం వెంటాడుతోంది. గత మూడున్నరేళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజా ప్రతినిధి అన్న చేసిన దందాలు, సెటిల్‌మెంట్లు తమ విజయావకాశాలపై ప్రభావం చూపిస్తాయన్న ఆందోళనలో అభ్యర్థులున్నారు. వీరితోపాటు ఎన్నికలను పర్యవేక్షిస్తున్న మంత్రులు, ఇన్‌చార్జీలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థులు, నాయకులతోపాటు టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థుల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రజాప్రతినిధి తన అన్నతో నగరంలో లెక్కలేనన్ని సెటిల్‌మెంట్లు, దందాలు, కబ్జాలకు పాల్పడ్డారని నగర ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
గుట్కా, మద్యం మాఫీయాకు డాన్‌గా వ్యవహరిస్తుండడంతోపాటు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే ఆస్తి, భూ తగాదాలను రాజీ పేరుతో ‘అన్న’ పరిష్కరిస్తూ ఇరు వైపులా దండుకునేవాడని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఆయా స్టేషన్లలో నమోదయ్యే ఇలాంటి కేసులను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక బృందం పని చేస్తోంది. ఫిర్యాదు స్వభావం, ఆస్తి విలువ, వ్యక్తుల పూర్వాపరాలు ఈ బృందం సేకరించి ‘అన్న’కు అందజేస్తుంది.
అద్దెకున్న వారితోనే సమాచారం అందజేత...
ఇంటికి దొంగ రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత ఆ ఇల్లు తాము కొన్నామంటూ ఖాళీ చేయాలని ‘అన్న’ తరఫున వ్యక్తులు ఆ ఇంట్లో అద్దెకుంటున్న వారికి తాఫీగా చెబుతారు. దీంతో వారు ఇప్పటి వరకు తాము అద్దె చెల్లిస్తున్న వారికి ఓ మాట చెప్పి ఖాళీ చేసేందుకు అద్దెకుంటున్న వారు ఇతర ప్రాంతంలో ఉంటున్న వారికి ఫోన్ చేసి విషయం చెబుతారు. తాము తమ ఇంటిని ఎవరికీ అమ్మకపోయినా ఇలాంటిది ఎందుకు వచ్చిందని వారు కంగారుతో నగరానికి చేరుకుంటారు. ముందుగా సిద్ధం చేసిన ప్లాన్ ప్రకారం సామాన్యులైన వారితో ఆ ఇల్లు తాము కొన్నామంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ రాజీకి వచ్చేలా చూస్తారు. అప్పుడు ‘అన్న’ రంగంలోకి దిగుతారు.
ఇరువురినీ పిలిపించి ‘గొడవ ఎందుకు’ అంటూ కొంత మొత్తం అసలు యజమానుల చేత దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తన అనుచరులకు ఇప్పిస్తారు. ఇలా నగరంలో చాపకింద నీరులా అనేక దందాలు, సెటిల్‌మెంట్లు జరిగాయి. ఎన్నికల నేపథ్యంలో అన్న అరాచకాలు ఎక్కడ తమ కొంప ముంచుతాయోనన్న భయంతో టీడీపీ, బీజేపీ అభ్యర్థులున్నారు. ‘ఖచ్చితంగా ఆ ప్రభావం ఎంతో కొంత పడుతందని’ ఓ బీజేపీ అభ్యర్థి వ్యాఖ్యానించడం అన్న అరాచకాలపై వారు ఎంత ఆందోళనతో ఉన్నారో అర్థమవుతోంది. ఇప్పటి వరకు కష్టపడిదంతా తమ తప్పు లేకపోయినా వృథా అవుతుందేమోనన్న భయం వెంటాడుతోంది.
సృష్టించేది.. పరిష్కరించేదీ ఒక్కరే...
ప్రజాప్రతినిధి అన్న ఒకే ఆస్తికి పలు రకాల నికిలీ దస్తావేజులు సృష్టించి డబుల్, త్రిబుల్ రిజిస్ట్రేషన్ చేయించి సమస్య సృష్టించి తిరిగి తానే పరిష్కరిస్తూ సెటిల్‌మెంట్లను కాకినాడ నగరంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారని చర్చ జరుగుతోంది. దీనికి కూడా ప్రత్యేకంగా ఓ బృందం ఎల్లప్పుడూ పని చేస్తోంది. నగరంలో ఇళ్లు, స్థలం ఉండి యజమానులు విదేశాలు, లేదా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా ఉంటే ఆ ఆస్తి చిక్కుల్లో ఇరుక్కున్నేట్లే. ‘అన్న’ బృందం ఇలాంటి ఇళ్లు, స్థలాలను, వాటి యజమానులు, వారి పూర్వాపరాల వివరాలు సేకరిస్తారు. మధ్యతరగతి, ఉద్యోగ, రాజకీయ నేపథ్యం లేని వారి ఆస్తికి ‘అన్న’ బృందంలోని వారితోనే నకిలీ పత్రాలతో డబుల్ రిజిస్ట్రేషన్ చేయిస్తారు.