కోటివ్వండి.. కొట్టుకెళ్లండి | TDP leader sand syndicates in Eluru | Sakshi
Sakshi News home page

కోటివ్వండి.. కొట్టుకెళ్లండి

Published Sun, Oct 26 2014 12:59 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

కోటివ్వండి.. కొట్టుకెళ్లండి - Sakshi

కోటివ్వండి.. కొట్టుకెళ్లండి

 ‘తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు..’ అన్న వేమన శతకంలోని వాక్యాన్ని అధికార పార్టీ నేతలు అక్షరాలా నిజం చేసి చూపిస్తున్నారు. ఏలూరు సమీపంలో ఓ నాయకుడు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వించి అమ్మేస్తుండగా.. మెట్ట ప్రాంతానికి  చెందిన ఓ నాయకుడు ఇసుక సిండికేట్లకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. నల్లజర్ల ప్రాంతంలోని నబీపేట ఇసుక ర్యాంపు నుంచి తవ్వకాలు చేసుకునేందుకు ప్రభుత్వ అనుమతి ఉంది. కానీ.. ఇదే ప్రాంతంలోని పోతినీడుపాలెం, కవులూరు,  అనంతపల్లి ర్యాంపులకు సర్కారు అనుమతి లేదు. అధికారం  దన్నుతో జిల్లా అంతటా ఇటీవల బాగా హడావుడి చేస్తున్న ఆ ప్రాంత  టీడీపీ నేత ఇసుక సిండికేట్లను పిలిపించి ఈ మధ్యనే బేరమాడారట. ‘ర్యాంపుల నుంచి ఇష్టమొచ్చినంత ఇసుక తవ్వుకోండి.  పట్టపగలైతే పేపరోళ్లు, టీవీ వాళ్లతో గొడవ.. రాత్రివేళ మీ ఎంతైనా తోలుకోండి. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ వాళ్లు రాకుండా చూసుకుంటా. ఇందుకోసం నాకు రూ.కోటి ఇచ్చుకోండి’ అని అడిగారట. ఆయన కంటే నాలుగు ఆకులు ఎక్కు వే తిన్న ఇసుక సిండికేట్లు మాత్రం అంత ఇచ్చుకోలేమని రూ.30లక్షలైతే వెంటనే ఇచ్చేస్తామని చెప్పారట. మొత్తం మీద అటూ ఇటూగా బేరం అరకోటి వరకు వచ్చి ఆగిందట. సదరు నేత మాత్రం రూ.కోటికి పైసా కూడా తగ్గేది లేదని.. కావాలం టే కొంత టైమ్ తీసుకునైనా ఆ మొత్తం ఇవ్వండని తేల్చి చెప్పేశారట. ప్రస్తుతానికి కొలిక్కి రాని ఈ లెక్క రూ.కోటికి వెళ్తుం దా లేక మరో నేత కోర్టుకు చేరుతుందా అన్నది చూడాలి.
 
 అదుపు.. మాట పొదుపు
 అంటే అన్నామంటారు గానీ.. ప్రతి ఒక్కరూ నామీదే పడి గొడవ చేస్తున్నారంటూ ఈ మధ్యన తెగ బీరాలు పోతున్న ఓ నేత తన నోటి దూకుడు మాత్రం ఇంచైనా తగ్గించడం లేదట. ప్రస్తుతం జిల్లా స్థాయిలో చక్రం తిప్పుతున్న ఈ నాయకుడు ఓ సీనియర్ అధికారికి ఫోన్‌చేసి ‘అమ్మా.. ఏమైందమ్మా.. ఆ పని ఎంతవరకు వచ్చిందమ్మా’ అంటూ మాటకు ముందు, మాటకు తర్వాత ఏమ్మా అని సంబోధిస్తున్నారట. ఓకే అని సర్దిచెప్పుకున్నా.. ఈ మధ్యన నువ్వు.. నువ్వు... అని ఏకవచనంతో మాట్లాడుతుండటంతో ఆ మహిళా అధికారి ఒకింత  నొచ్చుకుంటున్నారట. ఇదే నేత ఒకప్పుడు తనకు స్కూల్లో పాఠాలు చెప్పి, ఇప్పుడు విద్యాశాఖలో అధికారిగా ఉన్న ఓ పెద్దాయనను ఇటీవల ఓ సమావేశంలో అందరి ముందు అవమానించారట. పైకా (పంచాయతీ యువ ఖేల్ ఔర్ అభయా న్) సంక్షేపం (అబ్రివేషన్) ఏమిటో చెప్పాలని సదరు నేత ఆ అధికారిని ప్రశ్నించారు. అసలే టెన్షన్‌లో ఉన్న అధికారి చెప్పలేక తటపటాయించారట. చిర్రెత్తుకొచ్చిన సదరు నేత ‘పైకా’ అబ్రివేషన్ కూడా చెప్పలేని నువ్వేం మాస్టారువి. ఒకప్పుడు నాకు పాఠాలు చెప్పావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇప్పు డే నీపై యాక్షన్ తీసుకునేవాడిని’ అని చిర్రుబుర్రులాడారట. అంతమంది ముందు సదరు నేత అలా అనడంతో బిక్కమొహం వేసిన మాస్టారు ‘ప్చ్.. గురువును ముంచే శిష్యులు గురిం చి విన్నాం. గురువును టార్చర్ పెట్టే శిష్యుడిని ఇప్పుడే చూస్తున్నా’మంటూ సహచరులతో బాధను పంచుకున్నారట.
 
 కీలెరిగి వాతలు పెడుతున్న డాక్టర్ ఎస్పీ
 మూడు నేరాలు.. ఆరు ఘోరాలతో హంతకులు, గజదొంగలు జిల్లా  పోలీస్ యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. మరోవైపు ఎస్పీ డాక్టర్ కె.రఘురామ్‌రెడ్డి మాత్రం వైట్‌కాలర్ నేరస్తుల అంతు చూస్తున్నారు. మూడు నెలల క్రితం కర్నూలు నుంచి బదిలీపై వచ్చిన సందర్భంలో ‘ఇప్పటివరకు ఫ్యాక్షన్ నేపథ్యం గల కర్నూలు జిల్లాలో పనిచేశాను. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ యాక్షన్ ఉండేది. ఇప్పుడు పశ్చిమకు వచ్చాను. ఇక్కడ చదువుకున్న వాడిగా జిల్లా పరిస్థితులన్నీ  తెలుసు. ప్రశాంత పశ్చిమలో ఆర్థిక నేరా లు ఎక్కువ. వాటిపై ఎక్కువ దృష్టి పెడతా’నని ఎస్పీ ప్రకటిం చారు. అన్నట్టుగానే అదే దారిలో వెళ్తున్నారు. ఈ మూడు నెల ల్లో చాలా ఆర్థిక, సంస్థాగత నేరాలకు అడ్డుకట్ట వేశారు. మీడి యా ముసుగులో బ్లాక్‌మెయిల్ చేస్తున్న హర్షవర్దన్ వంటి పెద్దచేపలతోపాటు తణుకులో ఎలక్ట్రానిక్ మీడియా అంటూ చిల్లర వసూళ్లకు పాల్పడుతున్న ఓ ముగ్గురిని పట్టించారు. ఇన్నాళ్లూ అనధికార పోలీస్ బాస్‌గా చెలామణి అయిన గౌస్ మొహియిద్దీన్‌ను కట కటాల వెనక్కి తోసి చాలామంది ఐపీఎస్ అధికారులకే ముచ్చెమటలు పట్టించారు. అంతెందుకు తన  కార్యాల యంలోనే లీవుల కుంభకోణానికి పాల్పడ్డ ఇద్దరిని ఇంటికి పం పించారు. ఎంబీబీఎస్ చదివి డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఐపీఎస్‌కు ఎంపికైన కొల్లి రఘురామ్‌రెడ్డి తనదైన శైలిలో నేరస్తులకు కీలెరిగి వాతలు పెడ్తున్నారన్నమాట. ఆర్థిక నేరాల కట్టడి సరే.. వ్యవస్థీకృత నేరాలకు అడ్డకట్ట వేసి నిజమైన ‘ప్రశాంత పశ్చిమ జిల్లా’గా ఎన్నాళ్లకు తీర్చిదిద్దుతారో?
 - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement