ఏలూరు సిటీ : కలెక్టర్ కె.భాస్కర్ సహాయ సహకారాలతోనే ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఇసుక, మట్టి మాఫియా జోరుగా సాగుతోందని ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌వీ సాగర్ చెప్పారు. ఏలూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాక్షాత్తూ కలెక్టరే అవినీతిని ప్రోత్సహిస్తూ ప్రభుత్వానికి తొత్తులా వ్యవహరించటంతో ఉద్యోగులు సిగ్గు పడుతున్నారని ఆరోపించారు. ముసునూరు మండల మహిళ తహసిల్దార్ వనజాక్షిపై భౌతికదాడులు జరిగితే రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఉద్యోగులు న్యాయం కోసం ధర్నాలు, ఉద్యమాలు చేస్తుంటే, కృష్ణాజిల్లా కలెక్టర్ సైతం సరిహద్దుకు సంబంధించి ఉమ్మడి సర్వేకు నిరాకరిస్తే,
జిల్లాలో మాత్రం చింతమనేనిని కాపాడేందుకు కలెక్టర్ భాస్కర్ తప్పుడు నివేదికలు తయారు చేయించారని విమర్శించారు. వివాదాస్పద ఇసుక రీచ్ జిల్లాలోనే ఉందంటూ సర్వే చేయించటం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని తెలిపారు. ఇదేమైనా పాకిస్తాన్ ఇండియా సరిహద్దు వివాదమా అని ప్రశ్నించారు. ఆగమేఘాల మీద సరిహద్దును సర్వే చేయించాల్సిన అవసరం ఏముందన్నారు. ఉద్యోగుల మనోభావాలకు వ్యతిరేకంగా చింతమనేని మోచేతినీళ్లు తాగేందుకే ఇలా చేశారని సాగర్ ధ్వజమెత్తారు.
కలెక్టర్లే ఇంత నీచానికి ఒడిగడితే ఉద్యోగులకు భద్రత ప్రశ్నార్థకమే అన్నారు. గతంలోనే తాము కలెక్టర్ ప్రజా సంబంధాలకు పనికిరాడని చెప్పామని తెలిపారు. రాజకీయ కారణాలు, కుల బేరీజులో ఆయన్ని కొనసాగించటం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యే చింతమనేని కోసం పంచాయితీ నిర్వహించటం నీతి బాహ్యమైన చర్యగా అభివర్ణించారు. మహిళా ఉద్యోగులకు భద్రత లేకుండా ప్రభుత్వ పెద్దలే ఇలా చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైందన్నారు. అవినీతి ఎమ్మెల్యే, విప్ చింతమనేనికి వత్తాసు పలుకుతున్న కలెక్టర్‌ను తక్షణమే బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కలెక్టర్ అండతో చింతమనేని ఇసుక మాఫియా
Published Sun, Jul 12 2015 12:20 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement