ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోతోంది
తగు చర్యలు తీసుకోవాలి: గవర్నర్‌కు జగన్ లేఖ
ఈ నెల 3, 4, 5 తేదీల్లో రాష్ట్రంలో జరిగిన మునిసిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్, ఎంపీపీ, జెడ్‌పీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రంలో జగన్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న భయానక పరిస్థితులను ప్రజలు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారని గవర్నర్ దృష్టికి తెచ్చారు. ముఖ్యాంశాలివీ...
1. ఈ ఎన్నికలను అధికార టీడీపీ నాయకులు అపహాస్యం పాల్జేశారు. అసలు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ అనేది ఒకటుందా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వారు కలెక్టర్లను బెదిరించి పని చేయించుకుంటుంటే ఎందుకు క ఠినంగా వ్యవహరించడం లేదు? ఇలాంటి అరాచకాలను ఆపకపోతే ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుంది.
2. జూన్ 8న బాబు సీఎం అయ్యాక రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొంది. మా పార్టీ కార్యకర్తల పట్ల అమానుషత్వం కొనసాగుతోంది. వారిని భౌతికంగా అంతమొందించాలనే పథకాలను అధికార పార్టీ పన్నుతోంది. ముఖ్యమంత్రే వీటిని ప్రోత్సహిస్తూంటే న్యాయం కోసం ఎక్కడకు వెళ్లాలి?
3. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన 8 రోజుల్లోపే మా పార్టీకి చెందిన ఒక లోక్‌సభ సభ్యుడిని టీడీపీ ఫిరాయింపజేసుకుంది. అంతటితో సంతృప్తి చెందక వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికైన వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జడ్‌పీటీసీలను ప్రభుత్వ అండదండలతో నయానా, భయానా టీడీపీ వైపు తిప్పుకుని చైర్మన్, మేయర్, అధ్యక్ష పదవులను కైవసం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇదంతా మీడియా సమక్షంలోనే జరిగింది.
4. వైఎస్సార్‌సీపీ విప్ చెల్లదని, ఆ పార్టీ నుంచి ఫిరాయిస్తే అనర్హత వేటు పడదని జూన్ 26న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచీ తప్పుడు ప్రచారం చేస్తూ వచ్చారు. ఫిరాయించిన వారికి డబ్బులిచ్చారు. కొందరిని బెదిరించారు. కిడ్నాప్ చేశారు. వాస్తవానికి వైఎస్సార్‌సీపీని గుర్తింపు పొందిన పార్టీగా మే 29వ తేదీనే ఈసీ పేర్కొంది. జూన్ 27న మళ్లీ వివరణ కూడా ఇచ్చింది.
5.టీడీపీ సీనియర్ నేత ఒంగోలు జిల్లా పరిషత్ హాలులోకి తన మనుషులతో ప్రవేశించి టీడీపీకి ఓటు వేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని వైఎస్సార్ సీపీ వారిని ఎలా బెదిరించారో, భయానక పరిస్థితిని సృష్టించారో ప్రజలంతా చూశారు. అంతేకాదు.. ఇదే తరహాలో నెల్లూరులో కూడా వెంకటగిరి ఎమ్మెల్యే, ఇతర టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి సమావేశం హాలులో వీరంగం చేశారు. రాష్ట్రమంతటా, కర్నూలు జిల్లాలో యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. కొందరు పోలీసులు, అధికారులు టీడీపీ కార్యకర్తల్లా ప్రవర్తించడం దురదృష్టకరం. వీటికి సంబంధించిన టీవీ క్లిప్పింగులను మీకూ ఇస్తున్నాం. ఈ అరాచకం వల్ల మేం మేం గెలవాల్సిన చైర్మన్, అధ్యక్ష పదవులను గెల్చుకోలేక పోయాం. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎన్నికలనే వాయిదా వేశారు.
ఇప్పుడే ఇలావుంటే ఇక ఉప ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తేలిగ్గా అంచనా వేయగలం. ఈ అంశాలన్నింటినీ మీ దృష్టికి తెస్తూ సువిశాల ప్రజాస్వామ్య ప్రయోజనాల పరిరక్షణ కోసం తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం.
రాజ్యాంగ యంత్రాంగం విఫలమైంది
Published Tue, Jul 8 2014 2:01 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement