- ఆదర్శ పంచాయతీగా ఎంపిక
- రూ. 5 కోట్లతో అభివృద్ధికి తిరుపతి పార్లమెంట్ సభ్యుడు వరప్రసాద్‌రావు శ్రీకారం
- నిధులు మంజూరు
ఎలాంటి అభివృద్ధికి నోచుకోక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు పంచాయతీ ప్రజలకు మంచిరోజులొచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు సంకల్పం ఆ గ్రామ రూపురేఖలను మార్చనుంది. ఆ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా ఎంపిక చేయడంతో పాటు రూ.5 కోట్ల నిధులను తన కోటా కింద విడుదల చేశారు. తమ పంచాయతీకి వెలగపల్లి ‘వరప్రసాదం’ అని ప్రజలు కృతజ్ఞత చెప్పుకుంటున్నారు.
పెళ్లకూరు: ప్రధాని మోదీ స్ఫూర్తితో తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చిల్లకూరు పంచాయతీని ఆదర్శపంచాయతీగా ఎంపిక చేయడమే కాకుండా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు వైఎస్సార్‌సీపీ తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు. ఎంపీ చొరవపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా పూర్తిస్థాయిలో మౌలిక వసతులు లేక చిల్లకూరు పంచాయతీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పంచాయతీలో చిల్లకూరుతో పాటు వడ్డిపాళెం గ్రామం ఉంది.
ఈ పంచాయతీలో 463 కుటుంబాలకు గాను 1,764 మంది జనాభా ఉన్నారు. ఇప్పటికీ 40 శాతం మంది పక్కాగృహాలకు నోచుకోక అగచాట్లు పడుతున్నారు. పంచాయతీలో పూర్తిస్థాయిలో సీసీరోడ్లు లేవు. దీంతో వర్షాకాలంలో చిల్లకూరు దళితకాలనీ, బీసీకాలనీ, వడ్డిపాళెం గ్రామాల్లో వీధులు రొచ్చుగా మారుతున్నాయి. మురుగునీరు వీధుల్లోకి చేరి దుర్వాసన వస్తోంది. చిల్లకూరు దళితకాలనీ, అరుంధతికాలనీ, గిరిజన కాలనీ, వడ్డిపాళెం ప్రజలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ఓవర్‌హెడ్ ట్యాంక్ తగిన సామర్థ్యం లేక తాగునీటికి తిప్పలు పడుతున్నారు.
వాటర్‌పైప్ లైన్లు మరమ్మతులకు గురికావడంతో దిగువప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామంలో 50 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు మరమ్మతులకు వచ్చాయి. పంచాయతీ కార్యాలయం లేకపోవడంతో గ్రంథాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. 1956లో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు భయాందోళనల మధ్య చదువుకుంటున్నారు. ముఖ్యంలో పంచాయతీలో మూడు శ్మశాన వాటికలు ఉన్నప్పటికీ వాటికి రోడ్డు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు చిల్లకూరుకు ముఖద్వారం లేదు.
సొంత నిధులతో..
ఎంపీపీ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి నేతృత్వంలో బసివిరెడ్డి వెంకటశేషారెడ్డి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సొంత నిధులతో గ్రామంలో గ్రావెల్‌రోడ్లు ఏర్పాటు చేశారు. అలాగే గ్రంథాలయ భవనానికి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకొచ్చారు.
చిల్లకూరు పంచాయతీకి ఎంపీ నిధులు వరం:
మౌలిక వసతులు కరువై ఇబ్బంది పడుతున్న చిల్లకూరు పంచాయతీ అభివృద్ధికి ఎంపీ వరప్రసాద్‌రావు రూ.5 కోట్లు మంజూరు చేయడం వరమైంది. ఈ నిధులతో పంచాయతీలో తాగునీరు, సీసీరోడ్లు, మురుగుకాలువల ఏర్పాటు, పక్కాగృహాలు, శ్మశానరోడ్లు, పంచాయతీ కార్యాలయం, గ్రామ ముఖద్వారం, విద్యుత్ పునరుద్ధరణ, పాఠశాల అదనపు తరగతి భవనాలు, చిల్లకూరు సహకార భవనం తదితర వసతులు సమకూర్చుకునే అవకాశం లభించింది. తమ పంచాయతీ రూపురేఖలు మార్చేందుకు నిధులు మంజూరు చేసిన వైఎస్సార్‌సీపీకి చెందిన తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావుకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. త్వరలో ఎస్వీ యూనివర్సిటీ బృందం చిల్లకూరు పంచాయతీలో పర్యటించి మౌలిక వసతుల కల్పనపై పరిశీలించనుంది.
గ్రామాభివృద్ధే లక్ష్యం:
నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రజల కోసం నిలబడ్డాను. వారి అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నాను. మోడల్ విలేజ్‌గా చిల్లకూరును ఎంపిక చేయడం ఆనందంగా ఉంది.
-కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ
అభివృద్ధి సాధించాలి:
చిల్లకూరు పంచాయతీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలి. తాగునీరు, మురుగుకాలువలు, సీసీరోడ్లు, పక్కాగృహాలు, విద్యుత్ సౌకర్యం తదితర సౌకర్యాలు కల్పించి అభివృద్ధి పథాన నడిపించాలి.
-బసివిరెడ్డి వెంకటశేషారెడ్డి, సర్పంచ్