సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తుండటంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు అభివృద్ధి పనుల హడావుడి పెంచారు. ఎమ్మెల్యేలు తమ పరిధిలో కోట్ల రూపాయల పనులకు శిలాఫలకాలు వేసి పని ప్రారంభించామని చెప్పుకునే పనిలో పడ్డారు. ఇదే కోవలో వాకాడు మండలం తూపిలిపాలెం వద్ద సుమారు రూ.10 వేల కోట్లతో చేపట్టనున్న ఓడరేవు నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ వస్తున్నారని ఎంపీ డాక్టర్ చింతామోహన్ చేస్తున్న హడావుడితో అధికారులు పరుగులు తీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నిలువునా చీల్చిందనే ఆగ్రహం సీమాంధ్రవాసుల్లో తీవ్రస్థాయిలో వ్యక్తమవుతోంది.
ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో జనం దగ్గరకు ఏమని పోవాలి? మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగాలి? అనే ఆందోళనలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అభివృద్ధి పేరుతో జనాన్ని మరోసారి నమ్మించేందుకు రంగంలోకి దిగారు. పక్క వ్యక్తికి తెలియకుండా చాపకింద నీరులా రాజకీయం చేయడంలో దిట్టయిన ఎంపీ డాక్టర్ చింతామోహన్ సైతం ఇదే నినాదంతో జనాన్ని మరోసారి ఓట్లు అడిగే తంత్రం నడుపుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఏనాడూ గొంతెత్తి అరవని ఎంపీ చింతామోహన్ ఇప్పుడు తిరుపతిని సీమాంధ్ర రాజధాని చేయాలనే డిమాండ్‌ను తనకు తానే భుజానికెత్తుకున్నారు.
ఈ నినాదంతో చిత్తూరు జిల్లాలో తన లోక్‌సభ పరిధిలోకి వచ్చే తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు శాసనసభ నియోజకవర్గాల్లో జనాగ్రహం తగ్గించే వ్యూహం అమలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో తూపిలిపాలెం వద్ద భారీ ఓడరేవు నిర్మాణం తనతోనే సాధ్యమవుతుందనే భావన జనానికి కల్పించేందుకు శంకుస్థాపన హడావుడి ప్రారంభించారు. మరో వారంరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో ఏదో ఒక రకంగా శంకుస్థాపన చేయించి తీరాలని ఆయన అధికారుల మీద ఒత్తిడి పెంచారు. తూపిలిపాలెం పోర్టు నిర్మాణ బాధ్యతలు చూస్తున్న విశాఖపోర్టు అధికారులు, జిల్లా కలెక్టర్, రెవెన్యూ, అటవీ శాఖల అధికారుల మెడ మీద కత్తి పెట్టి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని హడావుడిగా ప్రారంభించారు.
ఈనెల 28న తాను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను తీసుకొచ్చి శంకుస్థాపన చేయిస్తానని ఆయన చెబుతున్నారు. ప్రధాని కార్యాలయం నుంచి ఎలాంటి ప్రాథమిక సమాచారం కూడా లేకపోయినా అధికార పార్టీ ఎంపీ హడావుడితో అధికారులు సైతం తూపిలిపాలెం వద్దకు పరుగులు తీస్తున్నారు. ఓట్ల రాజకీయం కోసం సాగుతున్న ఈ నాటకాన్ని చూసి జనం విస్తుపోతున్నారు. ప్రధాని పర్యటన గురించి జిల్లా అధికారులను అడిగితే తమకైతే అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదనీ, విశాఖ పోర్టు అధికారులు చెబుతున్నారని వారంటున్నారు. పులికాట్ సరస్సులో పక్షుల రక్షిత ప్రాంతాన్ని 10 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్లకు కుదించడం, శ్రీహరికోట నుంచి జరిగే అంతరిక్ష ప్రయోగాలకు పోర్టు కార్యకలాపాల వల్ల భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయనే వివాదం కోర్టులో నలుగుతోంది. ఇలాంటి వివాదాస్పద పరిస్థితుల్లో ప్రధాని వచ్చి పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
పధాని పర్యటన గురించి తమకు కనీసం వారంరోజుల ముందు సమాచారం అందుతుందనీ, జాతీయ భద్రతా దళాలు ముందస్తు తనిఖీలు చేశాకే పర్యటన ఖరారవుతుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ చెబుతున్న శంకుస్థాపన ముహూర్తానికి ఇక రెండు రోజులే సమయం ఉన్నందువల్ల అప్పటికి ప్రధాని రాకపోవచ్చని వారు చెబుతున్నారు. ప్రధాని కాకపోతే ఎవరో ఒకరిని తీసుకొచ్చైనా శంకుస్థాపన తంతు ముగించాలనే దిశగా ఎంపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
కాంట్రాక్టర్ల కోసం..
తూపిలిపాలెం కథ ఇలా ఉంటే, జిల్లాలోని అధికార పార్టీ శాసనసభ్యులు, నేతలు తమ నియోజకవర్గాల్లో ఎన్నికల శంకుస్థాపనలకు ఊపందించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి రెండు, మూడు రోజుల ముందు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు కోట్ల రూపాయల పనులకు నిధులు మంజూరు చేశారు.
ఈ ఉత్తర్వులను ఆగమేఘాల మీద అధికారులకు చేరవేసిన నాయకులు వెనువెంటనే పనుల ప్రారంభానికి అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారు. కోట్ల రూపాయల పనులకు శిలాఫలకాలు వేయడం ద్వారా ఎన్నికల్లో తాము ఇన్ని నిధులు తెచ్చామని చెప్పుకోవడంతో పాటు, తమ వారికి పనులు ఇప్పించడం వల్ల పది రూపాయలు సంపాదించుకునే అవకాశం కల్పించిన వారవుతామని కూడా వారు యోచిస్తున్నారు. అధికారులు మాత్రం ఈ పనులు ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటాయోనని అదిరిపోతున్నారు.
జిమ్మిక్కు
Published Wed, Feb 26 2014 3:14 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement