డాలర్ల విక్రయంపై టీటీడీ నిర్లక్ష్యం | The sale of dollars on ignored TTD | Sakshi
Sakshi News home page

డాలర్ల విక్రయంపై టీటీడీ నిర్లక్ష్యం

Published Mon, Feb 2 2015 5:41 AM | Last Updated on Sat, Aug 25 2018 7:11 PM

డాలర్ల విక్రయంపై టీటీడీ నిర్లక్ష్యం - Sakshi

డాలర్ల విక్రయంపై టీటీడీ నిర్లక్ష్యం

సాక్షి,తిరుమల: ‘‘డబ్బులిస్తాం. శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రం ఉండే బంగారు, వెండి డాలర్లు ఇవ్వండి’’ అని మొరపెట్టుకునే సామాన్య భక్తుల విజ్ఞప్తిని టీటీడీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ధర్మప్రచారం పేరుతో కోట్లాది రూపాయలను టీటీడీ మంచినీళ్లలా ఖర్చు చేస్తోంది. అయితే ధర్మప్రచారంతో ముడిపడిన వెంకన్న చిత్రాలతో ఉన్న బంగారు, వెండి డాలర్ల విక్రయాలను విస్మరిస్తోంది.
 
రెండేళ్లుగా వెండి డాలర్లు నో స్టాక్
తిరుమల ఆలయం పక్కన లడ్డూ కౌంటర్ల సమీపంలోనే శ్రీవారి బంగారు, వెండి డాలర్ల విక్రయ కేంద్రం ఉంది. శ్రీవారు, పద్మావతి అమ్మవారు చిత్రాలతో కూడిన వెండి, బంగారు డాలర్లను చంటి బిడ్డ నుంచి వృద్ధుల వరకు ధరిస్తుంటారు. ఇదో రకంగా ధర్మప్రచారానికి తోడ్పాటు అందిస్తోంది.  5 గ్రాములు, 10 గ్రాముల వెండి డాలర్లు విక్రయిస్తుంటారు. వీటి ధర రూ.100 నుంచి రూ.250లోపే ఉండడంతో తిరుమల క్షేత్ర సందర్శనకు గుర్తుగా సామాన్య భక్తులు కొనుగోలు చేస్తుంటారు.

రెండేళ్లుగా వెండి డాలర్ల కేంద్రంలో నో స్టాక్ బోర్డు పెట్టేశారు. దీనిపై సామాన్య భక్తులు నిత్యం ఫిర్యాదులు, విజ్ఞప్తులు చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోలేదు. అయినా దీనిగురించి ఏ అధికారి కూడా పట్టించుకున్న దాఖలా లేదు. నిత్యం వేలాది మంది భక్తులు వెండి డాలర్ల కోసం రావడం, లేదనే సమాధానం చెబుతుండడంతోఆవేదనగా తిరుగుముఖం పడుతున్నారు.
 
ఏడాదిగా రెండు గ్రాముల బంగారు డాలర్లు లేవు
ఆలయ సమీపంలో బంగారు డాలర్లు విక్రయించే కౌంటర్‌లో సరిగ్గా ఏడాది కాలం నుంచి రెండు గ్రాముల బంగారు డాలర్ల్ల స్టాకు లేదు. ఆలయ విభాగం తన ఆధీనంలోనే ఉండే ఈ కౌంటర్‌లోని డాలర్ల స్టాకు సంగతి తెలియదని చెబుతోంది. అదే తరహాలోనే తిరుపతిలోని జ్యువెలరీ విభాగం కూడా అదే సమాధానం ఇస్తోంది. రెండు గ్రాముల డాలర్ల కొనుగోలు వ్యవహారాలను టీటీడీ మార్కెటింగ్ విభాగానికి అప్పగించి ఏడాది అవుతోంది.

ఇప్పటికిప్పుడే కొనుగోలు చేయాలని చూసినా ఈ తంతు పూర్తయ్యేందుకు మరో ఏడాది కాలం పట్టే అవకాశం ఉంది. 10గ్రాములు రూ.26,270లు, 5గ్రాములు రూ.13, 350లు, 2 గ్రాములు రూ.5,355ల ధరల్లో అతి తక్కువ ధరతో ఉండే బంగారు డాలర్లకే భక్తుల నుంచి రెట్టింపు స్థాయిలో డిమాండ్ ఉంది. అ యితే, అవసరమైన స్టాకు తెప్పించాలని అనేకమార్లు కౌంటర్ సిబ్బంది కోరినా ఏ ఒక్క అధికారి పట్టించుకున్న పరిస్థితి లేదు. కొత్త ఈవో సాంబశివరావు పట్టించుకోవాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement