- పడమటి మండలాల్లో గాలీవాన బీభత్సం
- పిడుగుపడి మహిళ మృతి
- చెట్టు కూలి మరో యువకుడి మృతి
- నేలకొరిగిన భారీ వృక్షాలు
- రహదారుల్లో నిలిచిపోయిన రాకపోకలు
సాక్షి, తిరుపతి: జిల్లాలోని పడమటి మండలాల్లో సోమవారం సాయంత్రం పెనుగాలులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. పూతలపట్టు మండలంలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందింది. పుంగనూరు మండలంలో చెట్టుకొమ్మ కూలి ఓ యువకుడు చనిపోయాడు. బావిలో పడి ఒక ఎద్దు చనిపోయింది. చౌడేపల్లెలో పిడుగుపాటు కు మరో ఎద్దు మృతిచెందింది. చంద్రగిరి రహదారిలో భారీ చింతచెట్టు నేలకొరిగి ఓ కారు ధ్వంసమైంది. ముగ్గురు గాయపడ్డారు.
రహదారిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాల్మీకిపురం శివార్లలోని వ్యవసాయ భూముల్లో సోమవారం సాయంత్రం రెండు పిడుగులు పడడంతో కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయి. సమీపంలో కట్టేసి ఉన్న ఆవులు పిడుగుల శబ్దానికి తాళ్లు తెంపుకుని పరుగులు తీశాయి. పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సోమవారం సాయంత్రం హోరు గాలితో కూడిన వాన కురిసింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎడతెరిపిలేని గాలులతో కూడిన వర్షం కురిసింది.
పుంగనూరు మండలంలోని మంగళం గ్రామంలో నాగరాజు(23) అనే యువకుడిపై చింతచెట్టుకొమ్మ విరిగిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళ ం గ్రామంలో శంకరమ్మకు చెందిన ఎద్దు ఉరుములు, మెరుపులకు పరుగులుతీసి బావిలో పడి మృతి చెందింది. చౌడేపల్లె మండలం మల్లెలవారిపల్లెలో పిడుగుపడి ఒక ఎద్దు మృతి చెందింది. మామిడి, టమోటా పంటలకు నష్టం వాటిల్లింది. పూతలపట్టు మండలంలో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో పాటు బలమైన గాలులు వీచాయి.
తలపులపల్లె పంచాయతీ అలగానిపల్లెలో పిడుగుపడడంతో సంపూర్ణమ్మ(45) అనే గొర్రెల కాపరి మృతి చెందింది. బి.కొత్తకోట మండలంలోని సుంకరవారిపల్లెలో సోమవారం సాయంత్రం పిడుగుకుపాటుకు ఒక పూరిల్లు దగ్ధమైంది. చంద్రగిరి మండలం ఎం. కొంగరవారిపల్లె సమీపంలో భారీ చింతచెట్టు ఒక్కసారిగా నేలకూలింది. అదే సమయంలో చెట్టు కింద ఉన్న షిప్ట్ కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గుడిపాల మండలంలో గాలి, వాన బీభత్సానికి లక్షలాది రూపాయలు ఆస్తినష్టం వాటిల్లింది.
నరహరిపేట, గుడిపాల క్రాస్‌లోని జాతీయరహదారి పక్కన ఉన్న పెద్దవృక్షాలు రోడ్డుపై పడడంతో ట్రాఫిక్‌కు రెండుగంటలకు పైగా తీవ్ర అంతరాయం కలిగింది. వెదురుకుప్పం మండలంలో ఈదురు గాలులకు ఒక రేకుల ఇల్లు ధ్వంసమైంది. శాంతిపురం మండలంలో వడగళ్ల వాన కురిసింది. పెనుగాలుల కారణంగా వృక్షాలు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెద్దపంజాణి మండలంలో కుండపోత వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు వీయడంతో మామిడి పంటకు అపార నష్టం వాటిల్లింది. మదనపల్లె పట్టణంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.