టైలర్ల ఫెడరేషన్‌ను పునరుద్ధరించాలి
గుంటూరు ఈస్ట్: టైలర్ల ఫెడరేషన్‌ను పునరుద్ధరించాలని ది టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. టైలర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో దీక్షా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజీవ్ విద్యామిషన్ ద్వారా కుట్టించే యూనిఫారాల కాంట్రాక్టును అసోసియేషన్ సభ్యులకు ఇవ్వాలన్నారు.
గుర్తింపు కార్డులు, వృద్ధ టైలర్లకు పెన్షన్, ఉచిత బీమా, కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలన్నారు. వృత్తిపన్ను మినహాయింపుతోపాటు షాపులకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి షేక్ సుభానీ మాట్లాడుతూ ఆధునిక జుకీ మిషనరీపై శిక్షణ ఇవ్వాలన్నారు. తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు ఇస్తున్నట్టే ఇక్కడా రాయితీలు ఇవ్వాలని కోరారు.
అన్ని ముఖ్యపట్టణాల్లో ఇళ్ల స్థలాలు, కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేయూలన్నారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు కలెక్టర్ కార్యాలయ ఏవో ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘం కోశాధికారి పి.లక్ష్మయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వి.వెంకటేశ్వర్లు, పలువురు టైలర్లు పాల్గొన్నారు.