మహిళా సర్పంచ్ గ్రామ బహిష్కరణ
టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరినందుకే..
బీద సోదరుల సొంతూరులో దాష్టీకం
అల్లూరు, న్యూస్‌లైన్: మత్స్యకార మహిళా సర్పంచ్, ఆమె కుటుంబంపై గ్రామ బహిష్కరణ వేటు వేశారు. ఈ సంఘటన టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, కావలి టీడీపీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుల సొంతూరు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లిలో సోమవారం జరిగింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన బుచ్చంగారి మమత సర్పంచ్‌గా ఎన్నికైంది. అయితే ఈనెల 2వ తేదీన ఆమె తన భర్త బాబుతో కలసి వైఎస్సార్‌సీపీలో చేరారు. దీంతో కంగుతున్న టీడీపీ నేతలు.. తెర వెనుకనుంచి ఆమె కుటుంబానికి గ్రామ బహిష్కరణ విధించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ వర్గానికి చెందిన మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు కొండూరు పాల్‌శెట్టి, ఇస్కపల్లి మత్స్యకార గ్రామాల పెద్దకాపులు కలిసి ఆమెపై బహిష్కరణ వేటు వేశారు. మహిళా సాధికారత తమ హయాంలోనే జరిగిందని గొప్పలు చెప్పుకునే టీడీపీ.. ఆ ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే స్వగ్రామంలో ఇటువంటి దాష్టీకం జరగడం గమనార్హం.