పదవుల కోసం తమ్ముళ్ల ఆరాటం
- బాబు దృష్టిలో పడేందుకు అష్టకష్టాలు
- పార్టీ అధ్యక్ష పదవికి రేసులో పలువురు
- నామినేటెడ్ పోస్టుల కోసం అప్పుడే పైరవీలు
పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఆందోళనలు, కార్యక్రమాలకు ముఖంచూపని టీడీపీ నాయకులు ఇప్పు డు పార్టీ అధికారంలోకి వస్తుండడంతో చంద్రబాబు దృష్టిలో పడేందుకు తహతహలాడుతున్నారు. సోమవారం బాబు తిరుమలకు వచ్చిన సందర్భంగా ఇది స్పష్టమయింది.
సాక్షి,చిత్తూరు : చంద్రబాబు నాయుడు సోమవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా విమానాశ్రయంలోనూ, నారావారిపల్లె వద్ద ఆయనకు స్వాగతం, వీడ్కోలు పలికేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు పోటీపడ్డారు. జిల్లాలో ప్రస్తుతం పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఎన్నికలకు ముందు అధ్యక్ష పదవికి జంగాలపల్లి శ్రీనివాసులు రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు.
ఈ క్రమంలో సరైన నేత దొరకకుండా పార్టీ జిల్లా అధ్యక్ష పదవి అలాగే ఖాళీగా ఉంచారు. పార్టీ అధికారంలోకి వస్తుండడంతో జిల్లా అధ్యక్ష పదవి చే పట్టేందుకు పలువురు నాయకులు ఇప్పుడు ఉత్సాహం చూపుతున్నారు. గతంలో పార్టీ అధ్యక్ష పదవి తీసుకోమంటే తమ చేతి నుంచి పార్టీ నిర్వహణకు డబ్బులు ఖర్చుచేయాల్సి ఉంటుందని ఒకరిద్దరు నేతలు ముఖం చాటే శారు. అధినేత చంద్రబాబు వద్దే తాము అధ్యక్షపదవి చేయాలేమని చెప్పి తప్పుకున్నారు.
అలాంటి వారు కూడా ఇప్పుడు అధినేత అవకాశమిస్తే అందలం ఎక్కాలని చూస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవికి మాజీ అధ్యక్షుడు మహదేవనాయుడు, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి గౌనివారి శ్రీనివాసు లు, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న దొరబాబు పేర్లు వినపడుతున్నాయి. అదే సమయంలో టీటీడీ బోర్డు సభ్యత్వానికి, తుడ చైర్మన్ పదవికికూడా పైరవీలు ప్రారంభమయ్యూయి.
వెంకటరమణను ఎమ్మెల్యేగా గెలిపించినందున తుడ చైర్మన్ పదవి ఇతర సామాజికవర్గాలకు చెందిన నాయకులకు ఎవరికైనా ఒకరికి ఇవ్వాలనే డిమాండ్‌ను తమ్ముళ్లు తెరపైకి తెస్తున్నారు. తుడ అధ్యక్ష పదవిపై టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు సూరా సుధాకర్‌రెడ్డి కూడా ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఖాళీగా ఉన్న తిరుపతి గంగమ్మగుడి చైర్మన్ పదవి, ఇతర దేవాలయాల కమిటీలు, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు దక్కించుకోవచ్చునని ఆశిస్తున్న తమ్ముళ్లు పోటీ పడి మరీ చంద్రబాబు పర్యటన సందర్భంగా కటౌట్లు పెట్టారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అయితే జిల్లా రాజకీయూలపై పూర్తిగా అవగాహన ఉన్న చంద్రబాబునాయుడు గత పదేళ్లలో పార్టీకి పని చేసినవారు ఎవరు...తప్పించుకుని దూరం దూరంగా ఉన్నవారు ఎవరనే లెక్కలు వేసుకునే పదవులు పందారం చేస్తారని, పైరవీలు చేసినా ప్రయోజనం ఉండదని టీడీపీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్న నాయకులు ఆశాజనకంగా ఉన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న నర్సింహయాదవ్, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ వర్మ, జిల్లా మహిళా అధ్యక్షురాలు పుష్పావతి రాష్ట్రస్థాయిలో ఏదో ఒక పదవి ఇస్తారని ఆశిస్తున్నారు.
తిరుపతి నాయకులు మందలపు మోహన్‌రావు, సుధా బ్రహ్మ తదితరులు నామినేటెడ్ పోస్టుల కోసం రేసులో ఉన్నారు. చంద్రగిరి నాయకులు గతంలో తుడ డెరైక్టర్‌గా పనిచేసిన గాలి రాజేంద్రనాయుడు, వలపల దశరథనాయుడు ఈ సారి ఏదో ఒక పదవి దక్కుతుందని ఆశిస్తున్నారు. పార్టీ కోసం నిధులు ఖర్చుచేసినవారు కూడా తమకు పదవులు వస్తాయని వేచి చూస్తున్నారు. వీరందరూ చంద్రబాబును కలిసేందుకు ఉత్సాహం చూపారు.