చంద్రబాబుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ బహిరంగ లేఖ!
Published Sun, Aug 25 2013 8:34 PM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైఎస్ఆర్ సీపీ బహిరంగ లేఖ రాసింది. గత 26 రోజులుగా సీమాంధ్ర అతలాకుతలం అవుతున్నా మీ వైఖరిలో మార్పురాదా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు జూపూడి ప్రభాకరరావు, గొల్ల బాబూరావు, జ్యోతుల నెహ్రు ప్రశ్నించారు.
సీమాంధ్ర ప్రజల గురించి పట్టించుకోకుండా వైఎస్ జగన్‌నే టార్గెట్ చేస్తున్నారు, ప్రెస్‌మీట్లు పెట్టి మోసపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, మీ వైఖరి చూస్తుంటే మీలాంటి వారు ఉండబట్టే రాష్ట్రానికి ఈ గతి పట్టిందనిపిస్తోంది అని ఘాటైన విమర్శలు చేశారు.
'రాష్ట్రం విడిపోతే వచ్చే సమస్యలపై మాట్లాడటం లేదు. హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రత గురించి మాట్లాడటం లేదు. ఓట్లు-సీట్లు, క్రెడిట్ దక్కవని ఆరాటపడుతున్న మిమ్మల్ని చూసి ఏమనుకోవాలి' అని వైఎస్ఆర్ సీపీ నేతలు జూపూడి, గొల్ల బాబూరావు, జ్యోతుల నెహ్రు నిలదీశారు.
'గత నాలుగేళ్లుగా కాంగ్రెస్‌తో ఎలా కుమ్మక్కయ్యారో అనేక సార్లు రుజువయింది. కోట్ల మందికి అన్యాయం జరుగుతున్నా స్పందించని మీ వైఖరి కాంగ్రెస్‌తో కుమ్మక్కుకు మరో రుజువు చంద్రబాబూ.. ఇప్పటికైనా రాజీనామా చేయండి. మీ ఎమ్మెల్యేలతో, మీ ఎంపీలతో రాజీ నామాలు చేయించండి. బ్లాంక్ చెక్‌లా మీరు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోండి. అడ్డగోలు విభజనతో వచ్చే సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లండి' అంటూ లేఖలో సూచించారు.
రాష్ట్రంలో మూడు పార్టీలు వైఎస్ఆర్ సీపీ, సీపీఎం, ఎంఐఎంలు విభజనపై ఒకే మాట చెబుతున్నాయని, కేంద్రం అన్యాయంగా రాష్ట్రాన్ని విభజిస్తున్న తీరును ఖండిస్తున్నాయని, ఇప్పటికే ప్రధానికి మా పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు.
మీకు నిజంగా సీమాంధ్ర ప్రజలపై ప్రేమ ఉంటే ప్రధానికి లేఖ రాయండని, సీమాంధ్రులకు జరిగే అన్యాయంపై ప్రధానికి లేఖలో వివరించండని నేతలు విజ్ఞప్తి చేశారు. 'మా నేత వైఎస్ జగన్‌ను చూసి గర్వపడుతున్నాం. అనుక్షణం ప్రజల కోసమే ఆలోచిస్తూ జైలులో కూడా నిరవధిక దీక్ష చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయండి' అని అన్నారు.
'కోట్ల మంది తెలుగు ప్రజలకు జరిగే అన్యాయాన్ని ఆపగలం. లేకుంటే మీరు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు.. భావితరాలు మిమ్మల్ని క్షమించవు. విభజన చేసే వరకు చోద్యం చూడొద్దు. కాంగ్రెస్‌తో కుమ్మక్కు రాజకీయాలు చేసి ప్రజల్లోకి వెళితే వారే మీకు బుద్ధి చెబుతారు' అని వైఎస్ఆర్ సీపీ నేతలు జూపూడి, గొల్ల బాబూరావు, జ్యోతుల నెహ్రు హెచ్చరించారు.
Advertisement
Advertisement