టీడీపీ దోపిడీపై తిరగబడదాం | YV Subba Reddy Slams Chandrababu naidu | Sakshi
Sakshi News home page

టీడీపీ దోపిడీపై తిరగబడదాం

Published Tue, Dec 4 2018 11:02 AM | Last Updated on Tue, Dec 4 2018 11:02 AM

YV Subba Reddy Slams Chandrababu naidu - Sakshi

కృష్ణంపాలెం బీసీ కాలనీలో వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి

పశ్చిమగోదావరి, దేవరపల్లి: టీడీపీ అరాచకాలు, దోపిడీపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులంతా కలిసి తిరగబడదామని వైఎస్సార్‌ సీపీ ఉభయగోదావరి జిల్లాల కో–ఆర్డినేటర్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. దేవరపల్లి మండలం కృష్ణంపాలెం అల్లూరి సీతారామరాజు(బీసీ) కాలనీలో దాతలు సత్తి వెంకటరెడ్డి, సూర్యచంద్రారెడ్డి జ్ఞాపకార్థం సత్తి సాయి ఈశ్వరరెడ్డి ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని సోమవారం రాత్రి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో వైవీ సుబ్బారెడ్డి  మాట్లాడారు. టీడీపీదోపిడీని అడ్డుకోవాలన్నారు. వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో దుశ్శాసన పాలన జరుగుతుందన్నారు. ప్రైవేటు స్థలంలో దాతలు ఏర్పాటు చేసిన వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణకు అడ్డంకులు పెట్టటం దారుణమన్నారు.

విగ్రహాలను, శిలాఫలకాలను తొలగించగలరేమో గానీ, ప్రజల గుండెల్లో నుంచి మహానేత రాజన్నను తొలగించలేరని పేర్కొన్నారు విగ్రహాలు తొలగించిన అధికారులపై కేసులు పెట్టనున్నట్టు తెలిపారు. వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లడానికి వైఎస్సార్‌ సీపీ ఆవిర్భవించిందని చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు మనోధైర్యం కల్పించి, భరోసా ఇస్తూ జననేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ముందుకు సాగుతుందన్నారు. 12 జిల్లాల్లో 3,400 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయిందన్నారు. సొంత ప్యాకేజీకి ఒప్పుకుని చంద్రబాబు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని సుబ్బారెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని ప్రధాన అంశాలను సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి వై.ఎస్‌.జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  ఎమ్మెల్యేగా తలారి వెంకట్రావు, ఎంపీగా మార్గాని భరత్‌ను ఆశీర్వదించాలని ఆయన కోరారు.

మహనీయుడు వైఎస్సార్‌
వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు మాట్లాడుతూ మహనీయుడు వై.ఎస్‌. రాజశేఖరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెలను హత్తుకున్నాయని అన్నారు. టీడీపీ హయాంలో గోపాలపురం నియోజవర్గం అవినీతిలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. దోచుకోవడం, దాచుకోవడం అనే సిద్ధాంతంతో టీడీపీ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. పోలవరం సందర్శన యాత్ర పేరుతో కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్విని యోగమవుతోందని విమర్శించారు. రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కవురు శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి ఎకరాల బీడు భూములను సాగులోకి తీసుకువచ్చిన అపర భగీరథుడు వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి అని ఆయన అన్నారు. రాజమండ్రి పార్లమంటరీ నియోజకవర్గ సమన్వయకర్త మార్గాని భరత్‌ మాట్లాడుతూ మొన్నటి దాకా మోదీ మోదీ అంటూ జపం చేసిన చంద్రబాబు ఇప్పుడు రాహుల్‌ రాహుల్‌ అంటున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు.

ఫ్యాన్‌ గాలికి సైకిల్‌ ఎగిరిపోతుందన్నారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై కక్షసాధింపునకు పాల్పడితే చూస్తూ ఊరుకొనేది లేదని  హెచ్చరించారు. సభలో మాజీ ఎమ్మెల్యేలు కారుమూరి వెంకటనాగేశ్వరరావు, గంటా మురళీరామకృష్ణ, ఏఎంసీ మాజీ ఛైర్మన్లు కె.వి.కె.దుర్గారావు, నరహరిశెట్టి రాజేంద్రబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెలికాని రాజబాబు, బీసీ నాయకులు కడలి త్రిమూర్తులు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, మండల పార్టీల అ«ధ్యక్షులు కూచిపూడి సతీష్, గగ్గర శ్రీనివాస్, పడమటి సుబోష్‌చంద్రబోస్, రాష్ట్ర కార్యదర్శి పోతుల రామతిరుపతిరెడ్డి, కారుమంచి రమేష్, పార్టీ నాయకులు గన్నమని జనార్ధనరెడ్డి, తేతలి వెంకట్రామిరెడ్డి, సత్తి జగదీశ్వరెడ్డి, వాసుదేవరరెడ్డి, కుసులూరి వెంకటసతీష్, పల్లి రత్నారెడ్డి, గడా రాంబాబు, పఠాన్‌ అన్షర్‌బాషా, ఎస్‌.కె.వల్లీ, ముల్లంగి శ్రీనివాసరెడ్డి, కప్పల వరలక్ష్మి, జానకిరెడ్డి, బి.వి. చౌదరి, కాండ్రు రామకృష్ణ, సాలి వేణు, కాశింశెట్టి రాంబాబు, మందపాటి పల్లమ్మ, కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement