అభయాంజనేయస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఉభయగోదావరి జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి
పశ్చిమగోదావరి, అప్పనవీడు (పెదపాడు): ప్రజాధనం దోపిడీలో రాష్ట్ర ప్రభుత్వం ఘనత సాధించిందని, దీనిలో దెందులూరు నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని వైఎస్సార్ సీపీ ఉభయగోదావరి జిల్లాల సమన్వయకర్త, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. పెదపాడు మండలం అప్పనవీడులోబుధవారం నియోజకవర్గ బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు అప్పన కనకదుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. గత నాలుగున్నరేళ్లుగా టీడీపీ పాలనలో దోపిడీ పరాకాష్టకు చేరిందని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అవినీతి, అక్రమాలను అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నాయకులపై అడ్డగోలుగా కేసులను బనాయించి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ పెదపాడు మండల అధ్యక్షుడు అప్పన కనకదుర్గా ప్రసాద్‌పై అక్రమ కేసులను బనాయించారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారపార్టీ బెదిరింపులకు మనోస్థైర్యం కోల్పోవద్దని, వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా శ్రేణులపై పెట్టిన కేసులను ఎత్తివేయడం ఖాయమ ని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. రా ష్ట్రంలో ఏ ఒక్కరికీ భద్రత లేదని, అరాచ క పాలన సాగుతోందని విమర్శించారు.
పచ్చచొక్కాలకే పథకాలు
గత ఎన్నికలల్లో దాదాపు 600 అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలకు ప్రజలు కూడా తీవ్రంగా విసుగుచెందారన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం నాలుగేళ్లుగా వైఎస్సార్ సీపీ అలుపెరుగని పోరాటం సాగించిందని గుర్తు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పచ్చచొక్కాలకే అందుతున్నాయని విమర్శించారు. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేశాయని, ఎన్నికలు సమీపిస్తుండటంతోనే ఈ మూడు పార్టీలు విడిపోయినట్లుగా కొత్త డ్రామా ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్ధితుల్లో రాష్ట్ర ప్రజలకు మనోధైర్యం చెప్పేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టారని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో లభిస్తున్న అపూర్వ ఆదరణ, అభిమానాన్ని చూసి ఒర్వలేక ఈర్షా్యద్వేషాలతో సీఎం చంద్రబాబు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం చేయించారని విమర్శించారు. ఈ హత్యయత్నం వెనుక ఉన్న కుట్రదారులను న్యాయస్థానం శిక్షిస్తుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.
మళ్లీ రాజన్న పాలన
మహానేత వైఎస్సార్ పాలన స్వర్ణయుగం అని, మళ్లీ నవరత్న పథకాల ద్వారా అలాంటి పరిపాలన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ద్వారానే సాధ్యమని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపు కోసం బూత్ కమిటీ సభ్యులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. అడ్డగోలుగా అక్రమార్జన చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు రాబోయే ఎన్నికల్లో ఓటు కోసం ఇచ్చే రూ.5 వేలకు ప్రలోభ పడవద్దని, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వప్తే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని, ఈ విషయాన్ని ఇంటిం టికి తిరిగి ప్రజలకు వివరించాలని బూత్ కమిటీ సభ్యులకు చెప్పారు.
చింతమనేని ఆగడాలను అడ్డుకునే ధైర్యం చంద్రబాబుకు లేదు
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆగడాలు, అరాచకాలను అడ్డుకునే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు అబ్బయ్య చౌదరి దుయ్యబట్టారు. అధికారులు, మహిళలను ప్రజలను తీవ్ర పదజాలంతో దూర్భషలాడటం, అడ్డుపడిన వ్యక్తులపై చేయి చేసుకోవటం చింతమనేని నైజంగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.చింతమనేని చేస్తున్న దందాలపై చర్యలు తీసుకోకపోవటం వల్లే ఆయన మరింత రెచ్చిపోతున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే చింతమనేని ఆగడాలకు అడ్డు వచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, చింతమనేని అక్రమాలపై మాత్రం ఒక్క కేసు నమోదు కావటం లేదని ధ్వజమెత్తారు.
వైఎస్సార్ సీపీ జెండా ఎగరటం ఖాయం
రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అఖండ మోజార్టీతో అధికారంలోకి రావటం ఖాయమని ఆ పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు వ్యవహార శైలి పిట్టలదొర మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ఐటీ కంపెనీలను తీసుకొచ్చామని మంత్రి నారాలోకేష్ చెబుతున్నారని, దీనిపై ఆయన చర్చకు సిద్ధమా అని వైఎస్సార్ సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు. తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
తొలుత అభయాంజనేయ స్వామి దేవస్థానంలో పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు, ఏలూరు పార్లమెంట్ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఆళ్ల సతీష్ చౌదరి, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ కుమార్, కృష్ణాజిల్లా కార్యదర్శి నక్కా గాంధీ, పార్టీ నాయకులు మెండం ఆనంద్, గారపాటి భాస్కరరావు, వడ్లపట్ల శ్రీను, బొమ్మనబోయిన నాని, తోట పద్మారావు, జానంపేట బాబు, ఘంటశాల ప్రభాకరరావు, మెట్టపల్లి సూరిబాబు, కడియాల సతీష్, ఆలపాటి నరసింహమూర్తి, సప్పా మురళి, గూడవల్లి కిరణ్‌కుమార్, తుందూరు క్రాంతి, కడిమి గోవిందరావు, కంభంపాటి సుబ్రహ్మణ్యం, చెన్నుబోయిన సాయి సతీష్, బాల్ధా ప్రసాద్, ఆవాల గోవింద్, తొత్తడి దేవకుమారి, మూల్పూరి గోపాలకృష్ణ, బోదవరపు వెంకటేశ్వర రెడ్డి, కొండె లాజరు, మేకల లక్ష్మీ నారాయణ, చింతల శివయ్య, మరీదు రెడ్డియ్య, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment