బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, చిత్రంలో కొట్టు సత్యనారాయణ, ముదునూరి ప్రసాదరాజు, కంతేటి సత్యనారాయణరాజు, తదితరులు
పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం: హామీ లివ్వడం డ్రామాలు ఆడటం ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని వైఎస్సార్ సీసీ ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్త, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఆయనను సాగనంపి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జై కొడదామని పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక గీతా రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సమావేశానికి నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ 2014లో అమలు కాని హామీలతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. కోట్ల రూపాయలను దండుకొని, పాలనలో విఫలమై ప్రజలను ఎన్ని ఇబ్బందులకు గురిచేశారో అందరికీ తెలుసన్నారు. ఎక్కడ చూసినా టీడీపీ నేతలు రాక్షసపాలన సాగించడం, దోపిడీ, జేబులు నింపుకోవడం ప్రజలందరికీ తెలుసన్నారు. పచ్చ చొక్కాలకే సంక్షేమ పథకాలను కట్టబెడుతూ.. అర్హులకు అన్యాయం చేస్తూ.. చంద్రబాబు నీచ పాలన సాగిస్తున్నారన్నారు.
రాజన్న పాలన జగన్‌తోనే సాధ్యం : వైఎస్సార్ సీపీఅధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజలలో మనో«ధైర్యం కల్పిస్తూ భరోసా ఇస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరి సంక్షేమ పాలన జగన్‌కే సాధ్యమన్నారు. వైఎస్సార్ సీపీ వస్తే నవరత్న పథకాలను అన్నివర్గాలకూ అందేలా చేస్తామని, దీనిపై నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సుబ్బారెడ్డి దిశానిర్దేశం చేశారు.
బూత్ కమిటీలది గురుతర బాధ్యత
వచ్చే ఎన్నికల్లో బూత్ కమిటీలపై గురుతర బాధ్యత ఉందని వైవీ సుబ్బారెడ్డి సూచించారు. పార్టీ పథకాలను పోలింగ్ రోజు సాయంత్రం వరకూ ప్రజలకు వివరించాలని, వారిని పోలింగ్‌స్టేషన్లకు తీసుకురావాలని సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని టీడీపీ, బీజేపీ రెండు పార్టీలూ తీవ్ర అన్యాయం చేశాయని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. బీజేపీతో చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్న సందర్భంలో నాలుగున్నరేళ్లపాటు డ్రామాలు ఆడిన చంద్రబాబు మళ్లీ ప్లేటు ఫిరాయించి ఇప్పుడు హోదా అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే పోరాటం చేస్తున్నారన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు
ముడుపులు తీసుకొని రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టిన చంద్రబాబు నిరుద్యోగ భృతి అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. 600 హామీ లను ఇచ్చి గత ఎన్నికల్లో అమలు చేయని బాబు , వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనే కార్యక్రమం చేస్తారని, వీటిని వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు గమనించాలని కోరారు. చంద్రబాబు ఇచ్చే రూ. 5 వేల కంటే నవరత్నాల వల్ల ప్రతి కుటుంబానికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు కలిగే ప్రయోజనాల గురించి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ప్రజలకు వివరించాలని వైవీ సుబ్బారెడ్డి సూచిం చారు. ‘జగన్‌ను ఆశీర్వదించండి, వైఎస్ పాలన తిరిగి వస్తుంది’ అనే భరోసాను ఓటర్లలో బూత్ కమిటీ కన్వీనర్లు కల్పించాలన్నారు. జగన్‌పై విశాఖలో దాడి చేసిన మాదిరిగానే నియోజకవర్గాలలో కూడా దాడులు, కేసులుంటాయని, వాటికి ఏ కార్యకర్త భయపడవద్దని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యకర్తలకు అండగా ఉంటారన్నారు. పార్టీ విజయం కోసం ఒక సైనికుని మాదిరి పనిచేద్దామని, పార్టీ అధికారంలోకి వచ్చాక న్యాయబద్ధంగా పార్టీ వెన్నంటి ఉన్నవారికి ప్రయోజనం కలిగించే చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. సర్వేల పేరుతో ఓటర్ల నమోదు అంటూ వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణను ఆశీర్వదించాలని కోరారు.
కుట్ర వెన్నుపోటు బాబుకు అలవాటు : ఎమ్మెల్సీ కంతేటి
వైఎస్, తాను, చంద్రబాబు కలిసి కాంగ్రెస్ పార్టీలో ఒకే సారి మంత్రులుగా పనిచేశామని పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కంతేటి సత్యనారాయణ రాజు అన్నారు. మోసం, కుట్ర, వెన్నుపోటు లక్షణాలు ఆ నాటి నుంచే చంద్రబాబులో ఉన్నాయన్నారు. ఆ తరుణంలో చంద్రబాబును కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన సంగతిని గుర్తుచేశారు. ఎన్టీఆర్ కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తే, ఆ పార్టీతో చంద్రబాబు జతకట్టారని విమర్శించారు. వైఎస్ జగన్ లాంటి మంచి వ్యక్తిని మట్టుపెట్టాలని ప్రభుత్వం చూసిం దని, జగన్ గెలుపు చారిత్రక అవసరమని పేర్కొన్నారు. దోచుకో దాచుకో అనే పాలసీతో భారత్ నుంచి వేరైన ప్రాంతానికి చెందిన వ్యక్తిగా మాట్లాడుతున్న బాబు పాలనకు చరమగీతం పాడాలన్నారు. 25 ఏళ్ల నుంచి గూడెం రాజకీయాలలో ఉంటున్న కొట్టు సత్యనారాయణకు 2019 ఎన్నికల్లో గెలుపు ద్వారా సిల్వర్ జూబ్లీ వేడుక చేయాలని కోరారు.
ఆర్భాటం, అట్టహాసమే.. అభివృద్ధేదీ : ముదునూరి
ఆర్భాటం, అట్టహాసమే తప్ప తెలుగుదేశం హయాంలో అభివృద్ధి లేదని వైఎస్సార్ సీపీ నర్సాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయంలో బూత్ కమిటీ కన్వీనర్లు గురుతర బాధ్యత పోషించాలన్నారు. టీడీపీని సాగనంపే ఆలోచనలో ప్రజలు ఉన్నారన్నారు.
హోదా కోసం పోరాడింది జగనే :గ్రంధి శ్రీనివాసు, భీమవరం సమన్వయకర్త
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడింది వైఎస్సార్ సీపీ అధినేత జగనేనని, ఆయన హోదా అంశాన్ని సజీవంగా ఉంచారని పార్టీ భీమవరం సమన్వయకర్త గ్రంధి శ్రీనివాసు అన్నారు. సీఎం చంద్రబాబు అవకాశవాది అని విమర్శించారు.
జగన్ చెమటలు పట్టిస్తున్నారు : కొట్టు సత్యనారాయణ
40 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నవారికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెమటలు పట్టిస్తున్నారని ఆ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త కొట్టు సత్యనారాయణ అన్నారు. ఉభయ రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పరిస్థితులు ప్రజలు తలదించుకొనేలా ఉన్నాయని, చంద్రబాబు పొత్తులు, సంధులు హాస్యాస్పదంగా ఉన్నాయని, కాంగ్రెస్ వెనుక వెంపర్లాడి పొత్తుపెట్టుకొనే స్థితికి చంద్రబాబు దిగజారారని ఎద్దేవా చేశారు. ఈ మధ్య కాలంలో కొందరు నాయకులు మగతనం గురించి మాట్లాడుతున్నారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పదవులను తృణప్రాయంగా వదలడం మగతనమన్నారు. అంతేకానీ డూప్‌లతో ఫైట్లు చేసి, పాటలు పాడే వారు కూడా మగతనం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవ్వరికీ లేదన్నారు. ఓటర్ల జాబితాలో వైఎస్సార్ సీపీని అభిమానించే వారి ఓట్లు తొలగించే కుట్ర పెయిడ్ పార్టీల ద్వారా చేస్తున్నారని కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఎస్సీ పేటలకు, ముస్లిం కమ్యూనిటీ ప్రాంతాలకు వెళ్లి ఈ తరహా కుట్రలు చేస్తున్నారని, బూత్ కమిటీ బాధ్యులు క్షేత్రస్థాయికి వెళ్లి పార్టీని పటిష్టం చేయాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు యోగేంద్రవర్మ, బీసీ విభాగం అధ్యక్షులు కామన బుజ్జి, లీగల్ విభాగం అధ్యక్షులు శిరిగినీడి విజయకృష్ణ, ఎస్‌సీ సెల్ అధ్యక్షులు నల్లిమిల్లి గోపీ, ఎస్‌టీ సెల్ అ««ధ్యక్షులు రాంబాబు, ఉభయగోదావరి జిల్లాల బూత్ కమిటీల ఇన్‌చార్జి బీవీఆర్ చౌదరి, నర్సాపురం పార్లమెంటరీ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షులు ఖండవల్లి వాసు, మైనార్టీ సెల్ అధ్యక్షులు మహబూబ్ బాషా, పార్టీ నాయకులు మేడిది జాన్సన్, వేండ్ర వెంకటస్వామి, పార్టీ నాయకులు ముద్రగడ లలిత కుమారి, పిచ్చికల రాజారావు, బండారు నాగు, గుండుబోగుల బలుసుల రావు, మండా పద్మావతి, రమాదేవి, గుండుమోగుల సాంబయ్య, గొర్రెల శ్రీనివాసరావు, తమ్మిశెట్టి చుక్కయ్య, కొలుకులూరి ధర్మరాజు, ముప్పిడి పెద్దబ్బులు, చిటకన ప్రసాద్, కర్రి ప్రభావతి, పైబోయిన రమేష్ , నిమ్మల నాని, కర్రి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. వివిధ సమస్యలపై చల్లా లింగమూర్తి, సూర్పని రామకృష్ణ, కట్టుబోయిన కృష్ణప్రసాద్, గొర్రెల శ్రీనివాసు, గోపీకృష్ణ, గుండుమోగుల బలుసులరావులు మాట్లాడారు. పార్టీ తరఫున వైవీ సుబ్బారెడ్డిని గజమాలతో సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment