అప్పుల మూటతో.. ‘టాటా’ | 2G scam; CDMA is the experts of failure | Sakshi
Sakshi News home page

అప్పుల మూటతో.. ‘టాటా’

Published Wed, Dec 20 2017 12:34 AM | Last Updated on Wed, Dec 20 2017 12:34 AM

2G scam; CDMA is the experts of failure - Sakshi

బహుశా!! టాటాలు తాము అడుగుపెట్టిన ఏ రంగం నుంచి కూడా ఇన్ని నష్టాలతో... ఇంత దారుణంగా నిష్క్రమించి ఉండలేదేమో!! టెలికం మాత్రం వారికి ఆ చేదు అనుభవాన్ని రుచి చూపించింది. ఈ రంగంలో టాటాల వెంచర్లన్నీ దారుణమైన నష్టాలను మిగిల్చాయి. అంతేకాదు!! 2జీ స్కామ్‌తో టాటా బ్రాండ్‌ ప్రతిష్టపైనా మచ్చపడింది. అంతర్జాతీయ భాగస్వామితో వివాదం మామూలుగా దెబ్బతీయలేదు. దేశీ టెలికం విప్లవాన్ని ఊహించి అందరికన్నా ముందే ఈ రంగంలోకి దిగినా... కీలకమైన నిర్ణయాలన్నీ ఎదురుతిరిగి వైకుంఠపాళి పాముల్లా మింగేశాయి. ఆఖరికి అట్టడుగుకు జారిపోవటంతో.. ఆస్తులన్నీ ఉచితంగా ధారపోసి అప్పులతో నిష్క్రమించక తప్పలేదు.  అయినా దేశంలో విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచే టాటా గ్రూప్‌ ఒక్క టెలికంలోనే ఎందుకు ఇంతలా దెబ్బతింది? ప్రొఫెషనలిజానికి మారుపేరుగా ఉండే ఈ గ్రూప్‌... ఎందుకు రాణించలేకపోయింది? ఏ నిర్ణయాలు దెబ్బ తీశాయి? పరిస్థితులు అనుకూలించలేదా? లేక మేనేజ్‌మెంట్‌ లోపాలున్నాయా? ప్రభుత్వ పాలసీలే శరాఘాతమయ్యాయా? పోటీని తట్టుకోలేకపోయిందా? ఒక్కసారి చూద్దాం...

(సాక్షి, బిజినెస్‌ విభాగం):దేశంలో మొబైల్‌ సర్వీసులు ఆరంభించడానికి 1992లో కేంద్రం మొట్టమొదట బిడ్లు ఆహ్వానించినపుడే టాటాలు కూడా రంగంలోకి దిగారు. కాకపోతే తొలిదశలో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై నగరాలకు పోటీ పడినా... టాటాల చేతికి ఏ సర్కిలూ రాలేదు. ముంబైని బీపీఎల్‌ టెలికమ్, మ్యాక్స్‌ టచ్‌ దక్కించుకోగా... ఎయిర్‌టెల్, స్టెర్లింగ్‌ సంస్థలు ఢిల్లీని... ఉషామార్టిన్, మోది టెల్‌స్ట్రా సంస్థలు కోల్‌కతాను... స్కైసెల్, ఆర్‌పీజీ సెల్యులార్‌లు చెన్నైని దక్కించుకున్నాయి. దీంతో లైసెన్స్‌ పొందని కంపెనీలన్నీ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని ఆరోపించాయి. ఈ ఆరోపణలు సర్వీసుల ఆరంభాన్ని మరో మూడేళ్లు ఆలస్యం చేశాయిగానీ... ఫలితాన్ని మాత్రం మార్చలేకపోయాయి. తదుపరి 1995లో టెలికం విభాగం 21 సర్కిళ్లకు బిడ్లు పిలిచింది. అప్పుడు టాటాలకు తొలి లైసెన్స్‌ దక్కింది. అది కూడా... ఆంధ్రప్రదేశ్‌ నుంచే!!.

టాటా గ్రూప్‌ తాను అడుగుపెట్టిన ఏ రంగంలోనైనా మొదటి మూడు స్థానాల్లో మాత్రమే ఉండాలని కోరుకుంటుంది. చాలా రంగాల్లో ఇదే పరిస్థితి ఉంది కూడా!! టెలికంలోనే ఇదే పరిస్థితిని ఆకాంక్షించిన టాటా టెలి సర్వీసెస్‌ లిమిటెడ్‌ (టీటీఎస్‌ఎల్‌)... 2000లో బిర్లా– ఏటీ అండ్‌ టీతో చేతులు కలిపింది. కాకపోతే కొద్ది కాలానికే టెక్నాలజీపై భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తాయి. వినియోగదారులకు స్పష్టమైన వాయిస్‌తో అద్భుతమైన అనుభవాన్ని అందించాలన్న ఉద్దేశంతో టాటాలు సీడీఎంఏ (కోడ్‌ డివిజన్‌ మల్టిపుల్‌ యాక్సెస్‌) టెక్నాలజీకి ఓటేశారు. బిర్లాలు మాత్రం జీఎస్‌ఎంవైపు (గ్లోబల్‌ సిస్టమ్‌ ఫర్‌ మొబైల్స్‌) మొగ్గారు. ఇదిగో... ఈ తేడా టాటాల్ని సొంతగా కార్యకలాపాలు ఆరంభించుకునేలా చేసింది. 2002లో హ్యూస్‌ టెలికంను కొన్న టాటా... టాటా టెలి మహారాష్ట్రగా దాని పేరు మార్చి అక్కడా సీడీఎంఏ కార్యకలాపాలు ఆరంభించింది. 2006లో రతన్‌ టాటా ఐడియాలోని తన వాటాను విక్రయించేశారు కూడా!!.

ఆ ఒక్క నిర్ణయం మార్చేసింది!!
నిపుణుల మాటల్లో చెప్పాలంటే... జీఎస్‌ఎంతో సేవలు ఆరంభించిన టాటాలు సీడీఎంఏవైపు మళ్లటం తప్పటడుగే. ‘‘ఖరీదైన లగ్జరీ కారును తెచ్చి నిరుపేదలకు సవారీగా అందించాలనుకోవటం సరికాదు. సీడీఎంఏ కూడా అలాంటిదే’’ అనేది టెలికం నిపుణుల మాట. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కూడా సీడీఎంఏ టెక్నాలజీతో సేవలందిస్తోంది. అప్పట్లోనే ఆ సంస్థ బిజినెస్‌ నెమ్మదించటం మొదలైంది కూడా. సీడీఎంఏలో ఒక టెలికం ఆపరేటర్‌ నుంచి మరొక ఆపరేటర్‌కు మారడం కష్టం. అలా మారాలంటే హ్యాండ్‌సెట్‌ను మార్చి కొత్తది తీసుకోవాలి. నంబరు మార్చడానికి కొత్త ఫోన్‌ కొనాల్సిన పరిస్థితిని ఎవరు ఆహ్వానిస్తారు చెప్పండి? ఇక సీడీఎంఏ ఆపరేటర్లు తక్కువ కావటంతో మొబైల్‌ మోడళ్లు కూడా తక్కువే ఉండేవి. ఇక జీఎస్‌ఎంలో ఒక ఆపరేటర్‌ నుంచి మరొక ఆపరేటర్‌కు మారాలంటే సిమ్‌ మారిస్తే చాలు. దీంతో జీఎస్‌ఎం ఫోన్లు కూడా బోలెడన్ని మోడళ్లు అందుబాటులో ఉండేవి. అదే జీఎస్‌ఎం ఆధిపత్యానికి దారితీసింది కూడా.

తప్పు దిద్దుకున్నా... ఫలితం లేదు!!
2007లో డ్యూయల్‌ టెక్నాలజీ కోసం దరఖాస్తు చేసి అనుమతి పొందిన టాటా టెలిలో... 2008 నవంబర్లో జపాన్‌ దిగ్గజం ఎన్‌టీటీ డొకొమో 27.71% వాటాను కొనుగోలు చేసింది. ఇందుకు రూ.12,924 కోట్లు వెచ్చించింది. డొకొమో ఊతంతో టాటా దూకుడుగా ముందుకెళ్లటానికి ప్రయత్నించింది. 2009 జూన్‌లో ‘వన్‌పైసా పర్‌ సెకన్‌’ బిల్లింగ్‌తో తమ జోరు పెంచే ప్రయత్నం చేసింది. కానీ ఈ టారిఫ్‌ డొకొమోకు సైతం ఇష్టం లేదు. అందుకేనేమో!! ఇది సంచలనం అయ్యింది కానీ టాటా డొకోమోకు వినియోగదారుల్ని మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది. వ్యాపారం అనుకున్నట్లుగా సాగకపోవటంతో ఆరేళ్ల తరవాత తన వాటా విక్రయించేసి బయటపడాలని డొకోమో భావించింది. వీళ్లిద్దరి ఒప్పందం ప్రకారం... డొకోమో కొనుగోలు చేసిన మొత్తంలో సగం చెల్లించి ఆ వాటాను టాటాయే తీసుకోవాలి. లేదంటే వాటాదారును టాటాలే వెదకాలి. ఆర్‌బీఐ నియంత్రణలను చూపిస్తూ... టాటా చేతులెత్తేసింది. దీంతో వివాదం అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది. అక్కడ ఎదురుదెబ్బ తగలటంతో... 1.2 బిలియన్‌ డాలర్లు... అంటే దాదాపు రూ.7,500 కోట్లు చెల్లించి టాటాలు వివాదాన్ని పరిష్కరించుకోవాల్సి వచ్చింది. ఇది టాటా బ్రాండ్‌ ఇమేజ్‌నూ కొంత దెబ్బతీసిందనే చెప్పాలి.

2జీ స్కామ్‌... దెబ్బతీసింది
యావత్తు టెలికం రంగానికే 2జీ స్కామ్‌ మచ్చలాంటిది. స్పెక్ట్రమ్‌ను మార్కెట్‌ ధర కన్నా తక్కువకు విక్రయించారనే ఆరోపణలు ఈ రంగాన్ని చుట్టేశాయి. ఇది టాటాలనూ దెబ్బతీసింది. 2జీ స్కామ్‌ కేసులో సుప్రీంకోర్టు 2012లో  122 లైసెన్స్‌లను రద్దు చేసింది. ఇందులో టాటాలకు చెందిన అస్సాం, జమ్మూకశ్మీర్, నార్త్‌ఈస్ట్‌ లైసెన్స్‌లూ ఉన్నాయి. లైసెన్స్‌ కోల్పోవడంతోపాటు యూనిటెక్‌తో డీల్‌ విషయంలోనూ టాటాలు ఆరోపణలు ఎదుర్కోవలసి వచ్చింది. 2జీ దెబ్బ తర్వాత టాటా గ్రూప్‌ టెలికంలో ఎలాంటి కొనుగోళ్లూ చేయలేదు. దూకుడుగా నిర్ణయాలు సైతం తీసుకోలేదు. ఈ స్కామ్‌ ఒక స్తబ్దతను తెచ్చిందనేది నిపుణుల మాట.

భారీ రుణాలు... నష్టాలు
2008–16 మధ్య టాటా టెలీ సర్వీసెస్‌ నష్టాలు ఏకంగా రూ.31వేల కోట్లు. ఇదే కాలంలో టాటాటెలీ మహారాష్ట్రకొచ్చిన నష్టాలు రూ.5,600 కోట్లు. టాటా టెలీ  రుణాలు రూ.35,204 కోట్లు. డొకోమోకు చెల్లించిన మొత్తం రూ.7,500 కోట్లపైగానే ఉంది.

జియోతో ఎగ్జిట్‌?
రిలయన్స్‌ జియో రంగంలోకి రావటానికి ముందే... టెలికంలో కొనసాగించడం కష్టమని టాటా భావించింది. 2015 మార్చి నాటికి టాటా టెలి రెవెన్యూ మార్కెట్‌ వాటా కేవలం 7.2 శాతం. అదే సమయంలో టాప్‌–3 సంస్థలు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా రెవెన్యూ మార్కెట్‌ వాటా 72 శాతం. జియో రాకతో పరిస్థితి మరింత జఠిలమయింది. వొడాఫోన్‌ లాంటివే మనుగడ కోసం కలిసిపోతుంటే.. ఇక మధ్యస్థాయి కంపెనీల పరిస్థితి ఎలా ఉంటుంది? జియోలా అందుబాటు రేటులో బండిల్‌ డేటా ప్లాన్లను అందించడం వీటికి తలకు మించిన భారం. జియో వల్ల టాటా టెలి చాలా కస్టమర్లను కోల్పోయింది. జియోకు పోటీగా సేవలందించాలంటే టాటా గ్రూప్‌కు 8–10 బిలియన్‌ డాలర్ల మేర కొత్త ఇన్వెస్ట్‌మెంట్లు కావాలి.  ఎటుచూసినా పరిస్థితి ఆశాజనకంగా లేకపోవటంతో టాటా టెలీని ఎయిర్‌టెల్‌కు అప్పగిస్తూ చంద్రశేఖరన్‌ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల టాటాలకు ఒరిగిందేమీ లేదు. టాటా టెలి, టాటా టెలి మహారాష్ట్ర సంస్థలకు 19 టెలికం సర్కిళ్లలో ఉన్న 4 కోట్ల మందికి పైగా కస్టమర్లు ఎయిర్‌టెల్‌కి లభిస్తారు. ఎయిర్‌టెల్‌ మాత్రం టాటాకు రూపాయి కూడా ఇవ్వదు. పైపెచ్చు టాటా టెలి సంస్థలకున్న భారీ రుణాల్ని  కూడా టాటా గ్రూపే తీరుస్తుంది. కాకపోతే స్పెక్ట్రమ్‌ కోసం టెలికం విభాగానికి టాటా చెల్లించాల్సిన మొత్తాలను విడతల వారీగా ఎయిర్‌టెల్‌ చెల్లిస్తుంది. టాటా టెలి ఉద్యోగులను ఎయిర్‌టెల్‌ తీసుకుంటుంది. అంటే... అప్పులు మూటగట్టుకుని ఉత్తచేతులతో నిష్క్రమించారన్న మాట!!. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement