న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2018–19) వ్యవసాయం, తయారీ రంగాలు వెన్నుదన్నుగా నిలవనున్నాయని కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) పేర్కొంది. దీనితో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదుకానున్నట్లు అంచనావేసింది. 2017–18లో ఈ రేటు 6.7 శాతం కావడం గమనార్హం. సీఎస్‌ఓ సోమవారం విడుదల చేసిన జీడీపీ మొదటి ముందస్తు అంచనాలను క్లుప్తంగా చూస్తే...
∙రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 2018–19 సంవత్సరానికి 7.4 శాతం వృద్ధి రేటు ఉండొచ్చని అంచనా వేసింది. ప్రస్తుత సీఎస్‌ఓ అంచనాలు ఆర్‌బీఐ అంచనాలకన్నా తక్కువగా ఉండడం గమనార్హం.
∙పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే అంచనాలకన్నా కూడా తాజా అంచనాలు భిన్నంగా ఉండడం గమనార్హం. వృద్ధి రేటు 2018–19లో 7 నుంచి 7.5 శాతం శ్రేణిలో ఉంటుందని ఆర్థిక సర్వే పేర్కొంది.
∙2016–17లో వృద్ధి 7.1 శాతంకాగా అంతక్రితం ఏడాది (2015–16) వృద్ధి రేటు 8.2 శాతం.
∙కేవలం పరిశ్రమ ఉత్పత్తికి సంబంధించి వాస్తవ జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరం 6.5 శాతం. అయితే, 2018–19లో 7 శాతంగా ఉండే వీలుంది.
∙వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల వృద్ధి రేటు 3.4 శాతం నుంచి 3.8 శాతానికి పెరుగుతుంది.
∙తయారీ రంగం వృద్ధి రేటు 5.7 శాతం నుంచి 8.3 శాతానికి పెరిగే అవకాశం.
∙అయితే, మైనింగ్ క్వారీయింగ్ రంగంలో ఉన్న క్షీణ రేటు – 2.9% నుంచి – 0.8 శాతానికి తగ్గే వీలుంది.
∙వాణిజ్యం, హోటెల్స్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్ సేవల రంగాల్లో క్షీణ రేటు కూడా – 8 శాతం నుంచి –6.9 శాతానికి తగ్గవచ్చు.
∙పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ ఇతర సేవల విభాగంలో వృద్ధి రేటు 10 శాతం నుంచి 8.9 శాతానికి తగ్గే అవకాశం ఉంది.
∙విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా వృద్ధి రేటు 7.2 శాతం నుంచి 9.4 శాతానికి పెరుగుతుంది.
∙నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 5.7 శాతం నుంచి 8.9 శాతానికి పెరిగే అవకాశం.
∙ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవల వృద్ధి రేటు స్వల్పంగా 6.6 శాతం నుంచి 6.8 శాతానికి చేరుతుంది.
∙పెట్టుబడులకు సూచిక అయిన స్థూల స్థిర పెట్టుబడుల పరిమాణం (జీఎఫ్‌సీఎఫ్) రూ.47.79 లక్షల కోట్ల నుంచి రూ.55.58 లక్షల కోట్లకు పెరగనుంది.
తలసరి ఆదాయం రూ.1,25,397
జాతీయ తలసరి ఆదాయం 2018–19లో రూ.1,25,397గా ఉండొచ్చని సీఎస్‌ఓ పేర్కొంది. 2017–18లో ఈ మొత్తం రూ. 1,12,835. అప్పట్లో ఇది 8.6 శాతం వృద్ధి కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 11.1 శాతంగా ఉండనుంది.
మంచి ఫలితమే...
వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదైతే అది మంచి సానుకూల ఫలితమే అవుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగవంతమైన వృద్ధిరేటు కొనసాగిస్తున్న దేశంగా తన హోదాను నిలబెట్టుకుంటుంది. పెట్టుబడులు పెరుగుతున్న సంకేతాలూ హర్షణీయమే.
– సుభాశ్ చంద్ర గార్గ్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment