మీడియాలో ప్రకటనలకు వారధి | Bridge to advertising in the media | Sakshi
Sakshi News home page

మీడియాలో ప్రకటనలకు వారధి

Published Sat, Oct 24 2015 2:08 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

మీడియాలో ప్రకటనలకు వారధి - Sakshi

మీడియాలో ప్రకటనలకు వారధి

- మీడియా యాంట్...  ఇదొక అడ్వర్టయిజ్‌మెంట్ గూగుల్
- 9 విభాగాల్లో 2 లక్షలకు పైగా ప్రచార సాధనాల్లో ప్రకటన లకు అవకాశం
- సైన్ బోర్డ్‌లు, టీవీ, పేపర్, ఆన్‌లైన్, మొబైల్ వంటి వెన్నో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
‘‘నిన్నమొన్నటి వరకూ ఏ సంస్థ అయినా సక్సెస్ కావాలంటే ఓ మంచి ఆలోచన.. దాన్ని నిలబెట్టుకోవాలన్న తపన.. సమాజానికి ఉపయోగపడే సేవలుంటే సరిపోయేది! కానీ, నేడు వీటికి తోడుగా ప్రచారం కూడా జతకలిస్తేనే.. విజయం సంపూర్ణమవుతుంది. అందుకే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ కంపెనీ ప్రచారం, ప్రకటనల మీద దృష్టిసారించాయి. అయితే అన్ని సంస్థలూ ప్రచారం కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయలేకపోవచ్చు. పోనీ చేద్దామని ముందుకొచ్చినా ఏ మీడియాలో ఎంత మేర ప్రకటనలిస్తే సక్సెస్ అవుతామో అంచనా వేయలేవు. అలా అని న్యూస్‌పేపర్, టీవీ, ఇంటర్నెట్, హోర్డింగ్స్, మొబైల్.. ఇలా అన్నీ రకాల మీడియాల్లో ప్రకటనలు గుప్పించనూ లేవూ!! ఈ సమస్యకు చక్కని పరిష్కారాన్ని చూపిస్తోంది మీడియా యాంట్. సంస్థ ప్రస్థానం, సేవల గురించి మీడియా యాంట్ సీఈఓ సమీర్ చౌదరి మాటల్లోనే..
 
సమస్యల్లోంచే వ్యాపార ఆలోచన పుట్టుకొస్తుందనడానికి మా సంస్థ చక్కటి ఉదాహరణ. ఎందుకంటే 2010లో నేను ఆన్‌లైన్ ట్రావెల్ బుకింగ్ సేవలందిస్తున్న రెడ్ బస్ సంస్థలో  పనిచేసేవాణ్ణి. ఆ సమయంలో రెడ్ బస్ ఓ స్టార్టప్ కంపెనీ. ఓ రోజు ఒక మీడియాలో ప్రకటన ఇద్దామని సంబంధిత కార్యాలయానికి వెళ్లాను. కానీ, మా దగ్గరున్న బడ్జెట్‌కు ప్రకటన ఇవ్వలేమన్నారు యాజమాన్యం. పోనీ, మా దగ్గరున్న బడ్జెట్‌కు ఏ మీడియా సరిపోద్దో సలహా కూడా ఇవ్వలేకపోయారు. అప్పుడే అనిపించింది.. మాలాంటి స్టార్టప్ కంపెనీలకు ఎక్కడైతే బడ్జెట్ అడ్వటైజ్‌మెంట్ ఉంటుందో.. అసలు ఏ మీడియాలో ఎంత బడ్జెట్ ఉంటుందో చెప్పే టెక్నాలజీ ఉంటే బాగుండునని!! ఇంకేముంది.. రెడ్‌బస్‌లోని మరో ఇద్దరు సహా ఉద్యోగులు ముఖేష్ అగర్వాల్, మంజునాథ్ సింగ్‌లతో కలిసి లక్ష రూపాయల పెట్టుబడులతో 2012లో మీడియా యాంట్‌ను ప్రారంభించాం.
 
2 లక్షలకు పైగా ప్రకటనలు..
ప్రస్తుతం మీడియా యాంట్‌లో టీవీ, మేగ జైన్, న్యూస్‌పేపర్లు, అవుట్‌డోర్, నాన్ ట్రెడిషన్, డాటా బేస్, మొబైల్, రేడి యో, సినిమా ఇలా 9 విభాగాల్లో మొత్తం 2 లక్షల ప్రచా ర సాధనాల్లో పైగా ప్రకటనలకు అవకాశాలున్నాయి. వీటిలో విభాగాల వారీగా చూస్తే 1,200 వార్తా పత్రికలు, 300 చానళ్లు, 10 వేల సినిమా స్క్రీన్లు, 4 వేల మేగజైన్లు, 10 వేల డేటాబేస్‌లు, లక్ష మొబైల్ యాప్స్, 120 సిటీల్లో మొత్తం 30 రేడియో స్టేషన్లు, 10 వేల హోర్డింగ్స్ ఉన్నాయి. ప్రతి మీడియాను కేటగిరీల వారీగా అంటే ఉదాహరణకు వార్తా పత్రికలను తీసుకుంటే.. పాఠకుల సంఖ్య ఎంత? మెయిన్‌లో అయితే ఎంత.. టాబ్లాయిడ్‌లో అయితే ఎంత  వంటి సమస్త సమాచారాన్ని మీడియా యాంట్ అందిస్తుంది. మా ద్వారా అందిన ప్రతి ప్రకటన విలువ మీద మీడియా సంస్థ 5-20 శాతం వరకు కమీషన్‌ను చెల్లించాల్సి ఉంటుంది.
 
విదేశీ కస్టమర్లు కూడా..
ప్రస్తుతం మీడియా యాంట్‌లో 1,000 మంది క్లయింట్లున్నారు. వీటిలో మన దేశంతో పాటుగా ఆస్ట్రేలియా విశ్వ విద్యాలయాలు, అమెరికా రిటైల్ వ్యాపార సంస్థలు, సింగపూర్, మలేషియా పర్యాటక విభాగాలూ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మహీంద్రా, సోని, రామోజీ ఫిల్మ్ సిటీలు మీడియా యాంట్ ద్వారానే ప్రకటనలను బుక్ చేస్తాయి.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పర్యాటక శాఖలు మేగజైన్లకు ప్రకటనలిస్తుంటాయి.
 
సరైన మీడియా ఎంపిక..

దేశంలో 10 లక్షలకు పైగా మీడియా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ, ప్రస్తుతం మా దగ్గర 2 లక్షల ఆప్షన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతా వాటికి విస్తరించడమే మా లక్ష్యమని’’ సమీర్ పేర్కొన్నారు. ఏ మీడియాలో ప్రకటనలిస్తే ఎంత మేర ప్రచా రం అవుతుందనే అంశాన్ని కస్టమర్లకు ముందుగానే చెప్పే ప్రత్యేకమైన టూల్‌ను రూపొందిస్తున్నాం. దీంతో కస్టమర్ల సరైన మీడియాను ఎంచుకోవటంతో పాటూ బడ్జెట్‌కు తగ్గ లాభాన్ని పొందుతాడు. మీడియా, ప్రకటనలపై కస్టమర్లకు సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నాం.
 
రూ.15 కోట్ల వ్యాపారం లక్ష్యం..
‘‘గతేడాది రూ.6 కోట్ల వ్యాపారాన్ని చేరుకున్నాం. ఈ ఏడాది రూ.15 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 8.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. మా మొత్తం వ్యాపారంలో హైదరాబాద్ వాటా 10-15 శాతం  ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement