న్యూఢిల్లీ: గాడితప్పిన ఆర్థిక వ్యవస్థకు తగిన చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పలు అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ పండుగల వేళ వినియోగదారులు మరింత ఖర్చు చేసేందుకు వీలుగా వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు, చిన్న మధ్య స్థాయి వ్యాపార సంస్థల(ఎస్‌ఎంఈ)కు సులభంగా రుణాలు అందేలా చేయడం, పెట్టుబడుల ఉపసంహరణను మరింత వేగవంతం చేయడం వంటి చర్యలు ప్రభుత్వ ఉద్దీపనల ప్యాకేజీలో భాగంగా ఉన్నట్టు ఆర్థిక శాఖా వర్గాలు తెలిపాయి. దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో మూడేళ్ల కనిష్ట స్థాయి అయిన 5.7 శాతానికి పడిపోయిన విషయం విదితమే. గతేడాది పెద్ద నోట్లను రద్దు చేయడం, జీఎస్‌టీ అమలుతో ఈ పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో దేశీయ పెట్టుబడులను ప్రోత్సహించడం, గ్రామీణ మౌలిక సదుపాయాలకు, చౌక ఇళ్లకు మరిన్ని నిధులను అందుబాటులో ఉంచడం వంటివి ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, వాటికి తీసుకోవాల్సిన చర్యల వివరాలతో ఇప్పటికే ఓ నివేదిక రూపొందించారు. లిక్విడిటీ సమస్య ఉన్నట్టు ప్రభుత్వం సైతం అంగీకరించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, జీడీపీలో ద్రవ్య లోటును 3.2 శాతానికి సవరించే విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. ప్రైవేటు వినియోగం తక్కువగా ఉందని, కనుక పన్ను రేట్లను తగ్గించాలనే సూచన ప్రభుత్వం ముందుకు వచ్చినట్టు పేర్కొన్నాయి.
అయితే, ప్రస్తుత పరిస్థితులు మూడు నుంచి నాలుగు నెలల్లో సర్దుకుంటాయని, ద్రవ్యలోటు లక్ష్యాన్ని దాటదనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలిపాయి. కొన్ని రైల్వే ఆస్తులను, ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వరంగంలోని బ్లూచిప్ కంపెనీల్లో కొంత మేర వాటాల విక్రయంతో పన్నేతర ఆదాయాన్ని రాబట్టే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. దక్షిణ కొరియా కంపెనీలు రైల్వే మార్గాల అభివృద్ధికి ఆసక్తిగా ఉండడంతో, వాటి నుంచి పెట్టుబడులు తరలివస్తే రైల్వేపై ప్రభుత్వ వ్యయాలు తగ్గుతాయని అధికార వర్గాలు తెలిపాయి.