కోటి ఫోక్స్‌వ్యాగన్ కార్లలో చీటింగ్ పరికరం | Cheating device is one crore of Volkswagen cars | Sakshi
Sakshi News home page

కోటి ఫోక్స్‌వ్యాగన్ కార్లలో చీటింగ్ పరికరం

Published Wed, Sep 23 2015 1:35 AM | Last Updated on Fri, Sep 28 2018 3:18 PM

కోటి ఫోక్స్‌వ్యాగన్ కార్లలో చీటింగ్ పరికరం - Sakshi

కోటి ఫోక్స్‌వ్యాగన్ కార్లలో చీటింగ్ పరికరం

ఫ్రాంక్‌ఫర్ట్: డీజిల్ కార్లలో కాలుష్యకారక వాయువుల విడుదలను కప్పిపుచ్చే పరికరం వివాదం జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కంపెనీపై అమెరికా క్రిమినల్ కేసుల విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అటు ఫ్రాన్స్ నుంచి దక్షిణ కొరియా దాకా మిగతా దేశాలు తాము కూడా విచారణ జరపనున్నట్లు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా విక్రయించిన వాహనాల్లో దాదాపు 1.1 కోటి కార్లలో ఇటువంటి పరికరం ఉండి ఉండొచ్చని సంస్థ వెల్లడించింది. వివాద పరిష్కార వ్యయాల కోసం మూడో త్రైమాసికంలో దాదాపు 7.3 బిలియన్ డాలర్ల మొత్తాన్ని పక్కన పెడుతున్నట్లు, దీని వల్ల లాభాలు కూడా తగ్గొచ్చని ఫోక్స్‌వ్యాగన్ పేర్కొంది.

దీంతో, ఫ్రాంక్‌ఫర్ట్ స్టాక్ ఎక్స్చేంజీలో క్రితం రోజు 17 శాతం క్షీణించిన కంపెనీ షేరు తాజాగా మరో 23 శాతం పతనమైంది. పూర్తి పారదర్శకతతో వివాదాన్ని పరిష్కరించుకోవాలని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ ఫోక్స్‌వ్యాగన్ యాజమాన్యానికి సూచించారు. ఈ పరిణామాలన్నింటి దరిమిలా సంస్థ సీఈవో మార్టిన్ వింటర్‌కోర్న్‌కి కంపెనీ యాజమాన్యం ఉద్వాసన పలకడం దాదాపు ఖరారైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాలుష్యకారక వాయువుల విషయంలో నియంత్రణ సంస్థలను మోసపుచ్చేందుకు ఫోక్స్‌వ్యాగన్ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఉపయోగించిందని అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఈపీఏ) గుర్తించిన సంగతి తెలిసిందే, దీనికి పరిహారంగా 18 బిలియన్ డాలర్ల మేర పెనాల్టీ విధించే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement