2015లో చైనా వృద్ధి 6.9 శాతం
బీజింగ్: మందగమనాన్ని సూచిస్తూ... చైనా ఆర్థిక వ్యవస్థ 2015లో 6.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. గడచిన 25 సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయిలో చైనా వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇలాంటి ఆర్థిక ఫలితం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అలాగే ఇన్వెస్టర్లపై చూపే ప్రభావాలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ మంగళవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం అక్టోబర్-డిసెంబర్ కాలంలో వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదయ్యింది. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో ఉన్న 2009 తరువాత ఒక త్రైమాసికంలో ఇంత తక్కువ స్థాయి వృద్ధి రేటు ఇదే తొలిసారి.
1990 తరువాత...
మొత్తం ఏడాదిలో చూస్తే... 1990 తరువాత దేశం ఇంత తక్కువ స్థాయి వృద్ధిని చూడలేదు. అప్పట్లో కేవలం 3.8 శాతం వృద్ధి మాత్రమే నమోదయ్యింది. అంతక్రితం ఏడాదే చైనాలో జరిగిన తియాన్మన్ స్క్వేర్ అణచివేత ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2015లో 7 శాతం వార్షిక వృద్ధి లక్ష్యంతో పనిచేస్తున్నట్లు గత ఏడాది చైనా ప్రధాని లీ కిక్వాంగ్ పేర్కొన్నప్పటికీ, అంతిమంగా ఈ ఫలితం రాకపోవడం గమనార్హం.
తాజా గణాంకాల ప్రకారం చైనా ఆర్థిక పరిమాణం 2015లో 67.67 టిలియన్ యువాన్‌లు (దాదాపు 10.3 ట్రిలియన్ డాలర్లు). ఇందులో సేవల రంగం వాటా 50.5 శాతం. మొదటిసారి ఈ నిష్పత్తి తయారీ రంగాన్ని అధిగమించింది. వృద్ధి మరింత తగ్గే పరిస్థితి ఉందని స్పష్టమైతే... చైనా కొత్త సహాయక ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.