కార్పొరేట్ మోసాల దర్యాప్తునకు పీడబ్ల్యూసీ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కన్సల్టెన్సీ రంగంలో ఉన్న పీడబ్ల్యూసీ ఇండియా.. కార్పొరేట్ మోసాల దర్యాప్తు కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఇందుకోసం కంపెనీ రూ.10 కోట్ల దాకా వ్యయం చేసింది. ఈ కేంద్రం ద్వారా క్లయింట్ల కంపెనీల్లో యాంటీ మనీ లాండరింగ్ నియమాల అమలు, వ్యాపార ఒప్పందాలకు ముందు థర్డ్ పార్టీ దర్యాప్తు, ఈ-మెయిళ్లు, పత్రాల పరిశీలన, పరిశోధన సేవలను అందిస్తుంది. 100 మందికిపైగా సుశిక్షితులైన సిబ్బంది ఈ సెంటర్‌లో పనిచేస్తున్నారు. ఏడాదిలో మరో 150 మందిని నియమించుకోనున్నట్టు పీడబ్ల్యూసీ ఫోరెన్సిక్ సర్వీసెస్ లీడర్ దినేష్ ఆనంద్ వెల్లడించారు. కంపెనీకి ఇప్పటికే గుర్గావ్, ముంబైలో ఫోరెన్సిక్స్ టెక్నాలజీ ల్యాబ్స్ ఉన్నాయి.