సాక్షి, హైదరాబాద్: బిజినెస్ అంటే కోట్లలో పెట్టుబడి పెట్టాలి. కస్టమర్లను ఆకర్షించేందుకు కార్పొరేట్ ఆఫీసునూ ప్రారంభించాలి. అయితే ఇదంతా పెద్ద కంపెనీలకు, విదేశీ పెట్టుబడులుండే సంస్థలకైతే చెల్లుతుంది. మరి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), ఔత్సాహిక పారిశ్రామికుల పరిస్థితేంటి? పోనీ బ్యాంకులోన్ తోనో లేక అప్పు చేసో ఆఫీసును ప్రారంభించారనుకుందాం! బిజినెస్‌లో సక్సెస్ అయితే పర్వాలేదు. దురదృష్టం వెంటాడి విఫలమైతే? ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదూ.
అందుకే ఎంఎస్‌ఎంఈలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు దారి చూపుతోంది ‘వర్చువల్ ఆఫీసు’. ఆఫీసు స్థలం, ఫర్నీచర్ నుంచి ఉద్యోగుల వరకు అన్నీ అద్దెకుండేవే ఈ వర్చువల్ ఆఫీసులు. కార్పొరేట్ ప్రాంతాల్లో ఆఫీసు తెరవాలంటే అక్కడి స్థిరాస్తి ధరలు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, చిన్న కంపెనీలు భరించలేనంతగా ఉంటాయన్నది నిజం. ఈ ప్రాంతాల్లో వ్యాపారాన్ని ప్రారంభించాలంటే కోట్లలో పెట్టుబడి, ఆఫీసు ఫర్నీచర్, ఉద్యోగులకు వేతనాలు ఇలా అన్నింటి భారాన్ని మోస్తూ బిజినెస్‌ను నడపడమంటే మాములు విషయం కాదు. ఇలాంటి కష్టాలకే చెక్ చెబుతాయి వర్చువల్ ఆఫీసులు. ఆఫీసు స్థలం నుంచి ఫర్నీచర్, ఉద్యోగుల వరకు అన్నీ అద్దెకు లభించడమే వీటి ప్రత్యేకత. వీటి లాభాలు చూసి చిన్న కంపెనీలే కాదు మల్టినేషనల్ కంపెనీలూ ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ ఆఫీసు సేవలు రెండు రకాలుగా ఉంటాయి.
1. వర్చువల్ ఆఫీసు 2. సర్వీస్ ఆఫీసు
వర్చువల్ ఆఫీసు: ఆఫీసుకు చిరునామా, ఫోన్ నెంబర్, ఫ్యాక్స్ సేవలుంటాయి. క్లయింట్లు ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకునేందుకు ఓ రిసెప్షనిస్ట్ ఉంటుంది. ఆఫీసుకొచ్చే ఫోన్లు స్వీకరించి సంబంధింత యాజమాన్యానికి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఇక ధరలు విషయానికొస్తే్త.. ఫోన్ నంబర్, అడ్రస్, ఫ్యాక్స్ సేవలకైతే నెలకు ఒక్కో దానికి రూ.2,500 చొప్పున చెల్లించాలి. ఇంట్లోనే ఉండి ఆఫీసును ప్రారంభించాలనుకునే వారికి ఇవి ఉపయుక్తం. అందరికి తెలిసిన బిజినెస్ అడ్రస్ ఉంటుంది కాబట్టి కస్టమర్లకూ నమ్మకముంటుంది.
సర్వీస్ ఆఫీసు: వీటిలో ఆఫీసును పెట్టుకునేందుకు వీలుగా అద్దెకు స్థలం కేటాయిస్తారు. చ.అ.లను బట్టి ధరలుంటాయి. సుమారుగా రూ.40 వేలు నుంచి లక్షకు పైగానే ధరలున్నాయి. అలాగే సమావేశాలు నిర్వహించుకునేందుకు కూడా ప్రత్యేక గది ఉంటుంది. దీనికి 10 నిమిషాలకు రూ.85 చెల్లించాలి.
స్థలం నుంచి ఉద్యోగుల వరకు..
వర్చువల్ ఆఫీసు అంటే కార్యాలయానికి అవసరమైన స్థలం నుంచి ఫర్నీచర్, ఫోన్, ఫ్యాక్స్ నెంబర్లు, బిజినెస్ కార్డులు, లెటర్ హెడ్స్, సమావేశాల కోసం ప్రత్యేక గదులు, ఆడియో, వీడియో సౌకర్యం, ఇంటర్నెట్ సేవలు.. ఇలా ప్రతి ఒక్కటీ అద్దెకిస్తారు. అంతేకాకుండా అద్దెకు తీసుకున్న ఆఫీసులో ఒక రిసెప్షనిస్ట్ కూడా ఉంటుంది. ఈ రిసెప్షనిస్ట్ సంబంధిత కంపెనీకి వచ్చే ఫోన్ కాల్స్‌ను రిసీవ్ చేసుకొని యజమానికి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఆఫీసుకొచ్చే లెటర్లను కంపెనీ యజమానికి కొరియర్ చేస్తారు.
ప్రయోజనాలెన్నో..
⇔ కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టే వారు ఆ బిజినెస్‌ను ప్రజలు ఎలా స్వాగతిస్తారు? ఎలాంటి మార్పులవసరం వంటి అనేక అంశాలను తెలుసుకునేందుకు వర్చువల్ ఆఫీసులు ఉపయోగడతాయి.
⇔ కంపెనీకి ప్రొఫిషనల్ బిజినెస్ అడ్రస్ వస్తుంది. అంతేకాకుండా అందరూ సులువుగా గుర్తు పట్టే ప్రాంతంలో ఆఫీసు అడ్రస్ ఉండటంతో కంపెనీపై నమ్మకం ఏర్పడుతుంది.
⇔ సొంతంగా ఆఫీసును పెట్టుకుంటే ఉద్యోగులు, భద్రతా సిబ్బంది వేతనాలు, విద్యుత్ చార్జీలు వంటివెన్నో స్వయంగా భరించాల్సి ఉంటుంది. అదే వర్చువల్ ఆఫీసుల్లో అయితే అవేమీ ఉండవు. ఆఫీసు స్థలానికి, రిసెప్షనిస్ట్‌కు డబ్బులు చెల్లిస్తే చాలు.
⇔ సొంతంగా ఆఫీసుంటే యజమాని ప్రతి రోజూ ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. ఇందుకోసం కారు, బండి వాటిని వినియోగించాలి. దీంతో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన వనరుల ఖర్చులూ భరించాల్సి ఉంటుంది. అదే వర్చువల్ ఆఫీసైతే యజమాని రోజూ ఆఫీసుకు రావాల్సిన అవసరం ఉండదు. దీంతో ఇంధనం వినియోగం తగ్గుతుంది. పర్యావరణానికి మేలు చేసినవారమవుతాం.
Comments
Please login to add a commentAdd a comment