చీకట్లో చిరుదివ్వెలు... | Diwali special story on stock markets | Sakshi
Sakshi News home page

చీకట్లో చిరుదివ్వెలు...

Published Mon, Nov 5 2018 1:43 AM | Last Updated on Mon, Nov 5 2018 1:43 AM

Diwali special story on stock markets - Sakshi

మన స్టాక్‌ మార్కెట్‌ ఈ ఏడాది ఎన్నడూ చూడనంత తీవ్రమైన ఒడిడుదుకులను చవిచూస్తోంది. ఆగస్టు వరకూ ఆకాశమే హద్దుగా చెలరేగి రోజుకో కొత్త ఆల్‌టైమ్‌ గరిష్టాలను తాకిన దేశీ సూచీలు... ఆ తర్వాత హఠాత్తుగా కుప్పకూలి ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం రూపంలో మార్కెట్లను తాకిన సునామీ దెబ్బకి బ్లూచిప్స్‌ షేర్లు కూడా 20–50 శాతం దాకా పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లలో మరింత ఇన్వెస్ట్‌ చేయాలా? మార్కెట్లు కోలుకుంటాయా లేక బేరిష్‌ ధోరణిలోకి జారిపోతాయా? అన్న ప్రశ్నలు ఇన్వెస్టర్లను తొలిచేస్తున్నాయి.

అంతంతమాత్రం రుతుపవనాలు, ఎన్నికల సీజన్, భయపెడుతున్న వాణిజ్య, ద్రవ్య లోటులు, క్రూడ్‌ ధరల జోరు, బలహీన రూపాయి, వాణిజ్య యుద్ధ మేఘాలు మొదలైన అంశాలు కలవరపెడుతున్నాయి. అదే సమయంలో వినియోగం పెరుగుతుండటం, ఇన్‌ఫ్రా.. వ్యాపారాలు మెరుగుపడుతుండటం, పట్టణీకరణ, ఉద్యోగాల కల్పన పెరుగుతుండటం తదితర అంశాలు ఈక్విటీ మార్కెట్‌పై ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దీపావళి సందర్భంగా బ్రోకింగ్‌ సంస్థలు కొన్ని ఆశావహ షేర్లను సూచిస్తున్నాయి. మార్కెట్లు మరింత బలహీనపడినా మిగతా వాటితో పోలిస్తే ఇవి కొంత స్థిరంగా ఉంటాయన్నది వాటి అభిప్రాయం. వచ్చే దీపావళి టార్గెట్‌గా నిపుణులు సూచిస్తున్న పటాకా షేర్లు మీకోసం...    – సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం


హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
అపోలో హాస్పిటల్స్‌:     ప్రస్తుత ధర: రూ. 1,151        టార్గెట్‌ ధర: రూ. 1,368
బహుముఖ హెల్త్‌కేర్‌ డెలివరీ వ్యాపార విధానాలతో తన రంగంలో అగ్రగామి స్థానంలో ఉంది. ఆస్పత్రుల విస్తరణ, వాటి నుంచి వచ్చే ఆదాయాలు, వృద్ధి అవకాశాలు మెరుగుపడుతుండటం, నిర్వహణ నష్టాలు తగ్గుతుండటం కంపెనీకి సానుకూలం. ప్రస్తుత ధర దగ్గర తీసుకోవచ్చు. ఒకవేళ తగ్గిన పక్షంలో రూ. 974–982 దాకా మరికొన్ని షేర్లను జోడించుకోవచ్చు.

కమిన్స్‌ ఇండియా     ప్రస్తుత ధర: రూ. 769        టార్గెట్‌ ధర: రూ. 817
జనరేటర్లలో ఉపయోగించే డీజిల్‌ ఇంజిన్లను తయారు చేసే అమెరికన్‌ కంపెనీకి భారత్‌లో అనుబంధ సంస్థ ఇది. ఎనిమిది తయారీ కేంద్రాలు ఉన్నాయి. పారిశ్రామిక, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు మళ్లీ పుంజుకుంటుండటం ఈ సంస్థకు సానుకూలాంశాలు. వ్యయ నియంత్రణ చర్యలు, కొత్త ఉత్పత్తులు, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటుండటం తదితర అంశాలు కమిన్స్‌కు లాభించనున్నాయి. స్టాక్‌ తగ్గిన పక్షంలో రూ. 597–605 మధ్యలో మరికొన్ని కొనుగోలు చేయొచ్చు.
 
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌   ప్రస్తుత ధర: రూ. 2,422    టార్గెట్‌ ధర: రూ.  2,952
దేశీ ఫార్మా దిగ్గజాల్లో ఒకటి. దువ్వాడ ప్లాంటుకు సంబంధించి ఎఫ్‌డీఏ అభ్యంతరాల పరిష్కారం; సుబాక్సోన్, నువారింగ్, కొపాక్సోన్‌ ఉత్పత్తుల వివాదాలను పరిష్కరించడం కీలకం కానున్నాయి. అమెరికా మార్కెట్లో ధరలపరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆశావహ దేశీ, అమెరికాయేతర మార్కెట్లు ఆదాయాల వృద్ధికి దోహదపడగలవు. చైనా మార్కెట్లోకి విస్తరించడం, దేశీ బ్రాండెడ్‌ మార్కెట్లో టాప్‌–10 (ప్రస్తుతం 16వ స్థానం)లోకి చేరుకోవడం కంపెనీ లక్ష్యాలుగా పెట్టుకుంది. షేరు తగ్గిన పక్షంలో రూ. 2,210–2,230 దాకా మరిన్ని కొనుగోలు చేయొచ్చు.
 
ఐసీఐసీఐ బ్యాంక్‌       ప్రస్తుత ధర: రూ. 354          టార్గెట్‌ ధర: రూ. 411
ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం. నాయకత్వపరమైన ఒత్తిళ్లు సద్దుమణుగుతుండటం, అసెట్‌ క్వాలిటీని.. రుణ వృద్ధి, ఆదాయాలను మెరుగుపర్చుకునేందుకు తీసుకుంటున్న చర్యల కారణంగా స్టాక్‌ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఫలితంగా అనలిస్టులు, ఇన్వెస్టర్లు ఈ షేరు వైపు మళ్లీ చూడొచ్చు. ప్రస్తుత రేటు దగ్గర కొన్నతర్వాత ఒకవేళ తగ్గితే రూ. 290–295 దాకా మరిన్ని కొనుగోలు చేయొచ్చు.
 
సైయంట్‌ (గతంలో ఇన్ఫోటెక్‌)      ప్రస్తుత ధర: రూ. 619      టార్గెట్‌ ధర: రూ. 748
ఐటీ ఇంజినీరింగ్‌ సేవలు అందిస్తున్న సంస్థ. క్లయింట్లతో పటిష్టమైన సంబంధాలు, సరైన సమయానుకూలమైన కొనుగోళ్లతో ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను పటిష్టపర్చు కుంటూ ఉండటం, తక్కువ రుణభారంతో పటిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉండటం కంపెనీకి సానుకూల అంశాలు. పలు డీల్స్‌ చర్చల దశల్లో ఉన్నాయి. ప్రస్తుత ధర వద్ద దీన్ని కొనవచ్చు.  తగ్గితే రూ. 545–555 దాకా మరిన్ని కొనుగోలు చేయొచ్చు.


ఆనంద్‌ రాఠీ
ఏషియన్‌ పెయింట్స్‌    ప్రస్తుత ధర: రూ. 1,246        టార్గెట్‌ ధర: రూ. 1471
పట్టణీకరణ వేగవంతంగా జరుగుతుండటం, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెరుగుతుండటం, అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగంవైపు ప్రజలు మళ్లుతుండటం మొదలైన అంశాలు ఏషియన్‌ పెయింట్స్‌కు సానుకూలాంశాలు. మార్కెట్‌ లీడర్‌ అయిన ఏషియన్‌ పెయింట్స్‌కు విస్తృతమైన నెట్‌వర్క్‌ కూడా ఉంది. దీంతో మిగతా పోటీ సంస్థలతో పోలిస్తే మరింత ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.
 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌    ప్రస్తుత ధర: రూ. 1,947       టార్గెట్‌ ధర: రూ. 2,420
ప్రభుత్వ రంగ బ్యాంకులు మూలధన పరమైన సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రైవేట్‌ బ్యాంకులకు అపార అవకాశాలు ఉన్నాయి. మార్కెట్‌ షేరును పెంచుకునేందుకు, బ్యాంకింగ్‌.. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రంగంలో మరింత వృద్ధికి ఈ సంస్థకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి.

ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌  ప్రస్తుత ధర: రూ. 1,674  టార్గెట్‌ ధర: రూ. 2,042
తయారీ తదితర రంగాలన్నింటిలోనూ డిజిటల్‌ సాంకేతికత వినియోగం గణనీయంగా పెరుగుతోంది. అంతర్జాతీయంగా ఇలాంటి సర్వీసులకు డిమాండ్‌ భారీగా ఉన్న నేపథ్యంలో ఈ తరహా సొల్యూషన్స్‌ అందించే ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌ సంస్థ లబ్ధి పొందే అవకాశం ఉంది.
 
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌    ప్రస్తుత ధర: రూ. 352    టార్గెట్‌ ధర: రూ. 406
దేశీ ఉక్కు మార్కెట్, ఆదాయాలు మెరుగుపడుతుండటం ఈ సంస్థకు సానుకూలాంశం. అలాగే ఇన్‌ఫ్రా రంగం నుంచి డిమాండ్‌ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుని, వ్యయాలను నియంత్రించుకుని, నిర్వహణను మెరుగుపర్చుకునేందుకు కంపెనీ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వగలవని అంచనా.
 
సుందరం ఫాసెనర్స్‌    ప్రస్తుత ధర: రూ. 531       టార్గెట్‌ ధర: రూ. 760
పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 200–300 కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది.  
 
ఇంద్రప్రస్థ గ్యాస్‌    ప్రస్తుత ధర: రూ. 282    టార్గెట్‌ ధర: రూ. 319
దేశ రాజధాని ఢిల్లీలో పర్యావరణ కాలుష్య నివారణకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఆంక్షల నేపథ్యంలో పర్యావరణ అనుకూల ఇంధనాల వినియోగానికి ప్రాధాన్యత ఏర్పడుతోంది. ఇలాంటి అంశాలు ఇంద్రప్రస్థ గ్యాస్‌కు సానుకూలంగా తోడ్పడే అవకాశాలు ఉన్నాయి.


సెంట్రమ్‌ వెల్త్‌
కేర్‌ రేటింగ్స్‌    ప్రస్తుత ధర: రూ. 1,067
దేశీయంగా రెండో అతి పెద్ద క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఇది. గత కొన్నాళ్లుగా అధిక లాభాల మార్జిన్లతో రేటింగ్స్‌ వ్యాపారం లాభసాటిగానే ఉంటోంది. రాబోయే రోజుల్లో బ్యాంకింగ్‌ తదితర సంస్థలకు క్రెడిట్‌ రేటింగ్‌ల అవసరం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపుతో రుణ కార్యకలాపాలు మందగించే అవకాశం మొదలైన  వాటితో రేటింగ్స్‌ సంస్థలకు కొంత ప్రతికూలాంశాలు కూడా ఉన్నాయి. కానీ మొత్తం మీద రుణ వృద్ధి మెరుగుపడుతుండటం, పటిష్టమైన క్లయింట్స్‌ పోర్ట్‌ఫోలియో వంటి అంశాలు కేర్‌కు సానుకూలమైనవిగా భావించవచ్చు.

సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ (ఇండియా)      ప్రస్తుత ధర: రూ. 239
షేర్లను ఎలక్ట్రానిక్‌ ఫార్మాట్‌లో భద్రపర్చుకునేందుకు, సెక్యూరిటీస్‌ లావాదేవీల నిర్వహణకు అనువైన సర్వీసులను అందిస్తోంది. తన విభాగంలో అగ్రగామిగా ఉంది. పోటీ సంస్థకు 276 మంది డిపాజిటరీ పార్టిసిపెంట్స్‌ మాత్రమే ఉండగా.. సీడీఎస్‌ఎల్‌కు ఏకంగా 594 మంది డీపీలు ఉన్నారు. 2017–18లో లాభంలో దాదాపు 19 శాతం వృద్ధి సాధించింది. సెక్యూరిటీలు కాకుండా ఇతర పెట్టుబడి సాధనాల వైపు ఇన్వెస్టర్లు మళ్లే అవకాశాలు, టెక్నాలజీపై అధికంగా ఆధారపడటం, నియంత్రణ సంస్థలపరమైన రిస్కులు ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతుండటం  సానుకూలాంశం..

హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌    ప్రస్తుత ధర: రూ. 387
లాభసాటిగా ఉన్న కొద్ది లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థల్లో ఇది కూడా ఒకటి. టాప్‌ 5 ప్రైవేట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల జాబితాలో ఇది కూడా ఉంది. ప్రధానంగా బ్యాంకెష్యూరెన్స్‌ తదితర విధానాల్లో పాలసీల విక్రయం ఉంటోంది. అయితే, బ్యాంకెష్యూరెన్స్‌ విధానాల్లో ప్రతికూల మార్పులేమైనా చోటు చేసుకున్న పక్షంలో సంస్థ పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వ్యాపారంలో తీవ్రమైన పోటీ కూడా కంపెనీపై ప్రభావం చూపొచ్చు. కానీ, అసెట్‌ క్వాలిటీ మెరుగ్గా ఉండటం, వైవిధ్యమైన విక్రయ విధానాలు ఈ సంస్థకు సానుకూలాంశాలు.

జాగరణ్‌ ప్రకాశన్‌    ప్రస్తుత ధర: రూ. 107
దినపత్రికలు మొదలుకుని ఎఫ్‌ఎం రేడియో, డిజిటల్‌ మీడియా తదితర విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 13 రాష్ట్రాల్లో 5 భాషల్లో 8 దినపత్రికలను ప్రచురిస్తోంది. అత్యధిక ప్రజాదరణ ఉన్న దైనిక్‌ జాగరణ్, 7 కోట్ల పైగా రీడర్‌షిప్‌ ఊతంతో టాప్‌లో ఉంది.  ప్రింట్‌తో పోలిస్తే అధిక మార్జిన్లు ఉండే రేడియో విభాగం ఆదాయాలు పెరుగుతున్నాయి. అలాగే న్యూస్‌ప్రింట్‌ ధరలు కాస్త దిగి వస్తుండటం కూడా సంస్థకు సానుకూల అంశాలు. ద్వితీయార్థంలో ఎన్నికల నేపథ్యంలో బడా సంస్థల నుంచి ప్రకటనలు పెరగొచ్చని, తద్వారా ఆదాయాలు మెరుగుపడొచ్చని అంచనా.

పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌     ప్రస్తుత ధర:  రూ. 988
అడ్హెసివ్స్, సీలెంట్స్, నిర్మాణ రంగంలో ఉపయోగించే రసాయనాలు మొదలైన వాటిని పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ ఉత్పత్తి చేస్తోంది.  కన్జూమర్‌ ఉత్పత్తులు (ఆదాయంలో 84 శాతం వాటా), పారిశ్రామికోత్పత్తులు (15 శాతం), ఇతరత్రా ఉత్పత్తుల (1 శాతం) విభాగాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. దేశీయంగా 23 ప్లాంట్లు, 3 ఆర్‌అండ్‌డీ సెంటర్లు ఉన్నాయి. 80 పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. డీమోనిటైజేషన్, జీఎస్‌టీ ప్రభావాలు తగ్గుతుండటం, దేశీయంగా డిమాండ్‌ పెరుగుతుండటం సంస్థకు సానుకూలాంశాలు. కొన్ని ప్రతికూలతలు ఉన్నా.. మార్కెట్‌ లీడర్‌గా కొనసాగుతుండడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement