సాక్షి, న్యూఢిల్లీ : ఆగస్టు, సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీఎస్టీ రిటర్నులను ఆలస్యంగా దాఖలు చేసినందుకు విధించిన జరిమానాలను ప్రభుత్వం మాఫీ చేసింది. పెనాల్టీని రద్దు చేస్తున్న విషయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి జీఎస్టీఆర్-3బీ ఫైలింగ్ ఆలస్యంపై విధించిన ఫీజులను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే బిజినెస్‌లపై విధించిన ఆలస్య ఛార్జీలను, తిరిగి పన్ను చెల్లింపుదారుల అకౌంట్లలోకి వేయనున్నట్టు పేర్కొన్నారు. జీఎస్టీ పాలన కింద జూలై నెల రిటర్నులపై విధించిన ఆలస్య ఫీజులను కూడా ప్రభుత్వం రద్దు చేసింది.
3బీ రిటర్నుల ఆలస్యానికి విధిస్తున్న పెనాల్టీను రద్దు చేయాలని వ్యాపార వర్గాలు డిమాండ్ చేసిన క్రమంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ డేటా ప్రకారం జూలై నెలలో 55.87 లక్షల జీఎస్టీఆర్-3బీ రిటర్నులు దాఖలు కాగ, ఆగస్టు నెలలో 51.37 లక్షల రిటర్నులు, సెప్టెంబర్‌లో 42 లక్షలకు పైగా రిటర్నులు దాఖలయ్యాయి. తుది గడువు పూర్తి అయిన తర్వాత పెద్ద మొత్తంలో వ్యాపారస్తులు తమ రిటర్నులు ఫైల్ చేస్తున్నట్టు జీఎస్టీఎన్ నెట్‌వర్క్ డేటాలో తెలిసింది. జూలై నెలకు సంబంధించి తుది గడువుకి కేవలం 33.98 లక్షల రిటర్నులు మాత్రమే దాఖలయ్యాయని, తర్వాత ఈ సంఖ్య 55.87 లక్షలకు పెరిగినట్టు వెల్లడైంది. అదేవిధంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కూడా ఉంది. రిటర్నులను ఆలస్యంగా దాఖలు చేస్తున్న వారిపై కేంద్ర జీఎస్టీ కింద రోజుకు రూ.100, అంతేమొత్తంలో రాష్ట్ర జీఎస్టీ ఫీజును విధిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment