హోండా ‘ఆక్టివా’ ఉత్పత్తి పెంపు
న్యూఢిల్లీ: రానున్న పండుగల సీజన్‌లో మరిన్ని ఆక్టివా స్కూటర్లను విక్రయించడంపై హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ) దృష్టి సారించింది. 2001లో ఆక్టివా స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చామని, మంచి అమ్మకాలు సాధిస్తోందని హెచ్‌ఎంఎస్‌ఐ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) యధ్‌విందర్ ఎస్. గులేరియా పేర్కొన్నారు.
మార్కెట్లోకి వచ్చి 14 ఏళ్లు అయినప్పటికీ, ఇప్పటికీ ఈ స్కూటర్‌కు వెయిటింగ్ పీరియడ్ కొనసాగుతోందని, ఇది ఈ స్కూటర్‌కు వినియోగదారులు ఇస్తోన్న ప్రాధాన్యతను వెల్లడిస్తోందని వివరించారు. పండుగల సీజన్ కారణంగా పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి బెంగళూరులోని మూడోప్లాంట్‌లో ఉత్పత్తిని పెంచామని పేర్కొన్నారు. జూలై-సెప్టెంబర్ కాలానికి రోజువారీ ఉత్పత్తి 15-20 శాతం పెంచామని వివరంచారు. ఏప్రిల్-జూలై కాలానికి ఎంక్వైరీలు 30 శాతం పెరగాయని, అమ్మకాలు 33 శాతం వృద్ధి చెందాయని పేర్కొన్నారు.
వివిధ మోడళ్లకు సంబంధించి పెండింగ్ ఆర్డర్లు ఇప్పటివరకూ 60,000 ఉన్నాయని, వీటిల్లో 70 శాతం ఆక్టివా స్కూటర్‌వేనని వివరించారు. కాగా గత నెలలో హీరో మోటోకార్ప్ బైక్, స్ప్లెండర్ బైక్‌ల విక్రయాల(1,65,779)ను ఈ ఆక్టివా స్కూటర్ విక్రయాలు (1,91,883)అధిగమించాయి. ఆక్టివా స్కూటర్ నంబర్‌వన్ టూవీలర్‌గా నిలిచిందని గులేరియా పేర్కొన్నారు. గత 11 నెలల కాలంలో స్ప్లెండర్ అమ్మకాలను ఆక్టివా అమ్మకాలు మూడు సార్లు అధిగమించాయని వివరించారు.