వృద్ధిరేటు పడిపోతుంది..! | India's GDP growth estimated to fall at 7.1 per cent in 2016-17 | Sakshi
Sakshi News home page

వృద్ధిరేటు పడిపోతుంది..!

Published Sat, Jan 7 2017 1:36 AM | Last Updated on Thu, Sep 27 2018 9:07 PM

వృద్ధిరేటు పడిపోతుంది..! - Sakshi

వృద్ధిరేటు పడిపోతుంది..!

2016–17లో అంచనా 7.1 శాతం
తయారీ, మైనింగ్, నిర్మాణ రంగాలు పేలవం
అంచనాలు విడుదల చేసిన  గణాంకాల శాఖ
నోట్ల రద్దు కారణం కాదని వివరణ
నవంబర్‌నే ‘డేటా’కు తీసుకోలేదని వెల్లడి  


న్యూఢిల్లీ: భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016–17, ఏప్రిల్‌–మార్చి) వృద్ధి రేటు మందగమనంలో ఉండబోతున్నట్లు స్వయంగా గణాంకాల శాఖ అంచనా వేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కేవలం 7.1 శాతంగా ఉంటుందని శుక్రవారం గణాంకాల శాఖ కార్యాలయం (సీఎస్‌ఓ) తన అంచనాలను వెలువరించింది. అయితే దీనికి రూ.500, రూ.1000 నోట్ల రద్దు కారణం కాదనీ, ఈ అంచనాల రూపకల్పనకు ఏప్రిల్‌–అక్టోబర్‌ మధ్యకాలంలో గణాంకాలనే పరిగణనలోకి తీసుకున్నట్లు స్పష్టం చేసింది. మొత్తం జీడీపీలో దాదాపు 55 శాతం పైగా ఉన్న తయారీ రంగంతోపాటు మైనింగ్, నిర్మాణ రంగాల పేలవ పనితీరు జీడీపీ స్పీడ్‌కు బ్రేక్‌లు వేస్తున్నట్లు పేర్కొంది. గత ఏడాది దేశ జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతం. ‘‘మందగమనానికి డీమోనిటైజేషన్‌ ఎంతమాత్రం కారణం కాదు’’ అని గణాంకాల విడుదల సందర్భంగా చీఫ్‌ స్టాటిస్టీషియన్‌ టీసీఏ అనంత్‌ అన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా 2016–17 జీడీపీ అంచనాలను 7.1 శాతంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజా అంచనాలు, ఇందుకు సంబంధించి అనంత్‌ చెప్పిన వివరాలను పరిశీలిస్తే...

ఏదో ఊహాజనితమైన అంచనాల అవసరం మాకు లేదు. వాస్తవిక గణాంకాల ఆధారిత అంచనాలు ఇవి. నవంబర్‌ బ్యాంక్‌ డిపాజిట్లు, క్రెడిట్‌ డేటాను మేము పరిగణనలోకి తీసుకోలేదు.  డీమోనిటైజేషన్‌ కారణంగా నెలకొన్న తీవ్ర ఒడిదుడుకుల పరిస్థితి నెలకొనడమే దీనికి కారణం. ఇది మినహా అక్టోబర్‌ వరకూ అందిన వాస్తవిక డేటా ఆధారంగా తాజా గణాంకాలు విడుదలయ్యాయి.
2016–17లో జీడీపీ విలువ (2011–12 స్థిర ధరల వద్ద) రూ. 121.55 లక్షల కోట్లుగా నమోదయ్యే వీలుంది. మేలో విడుదలైన ప్రొవిజినల్‌ అంచనాల ప్రకారం 2015–16 ఆర్థిక సంవత్సరం జీడీపీ విలువ రూ.113.50 లక్షల కోట్లు.
వాస్తవ స్థూల విలువ ఆధారిత (జీవీఏ) అంచనాల ప్రకారం వృద్ధి  2015–16లో 7.2 శాతం ఉంటే, ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 శాతానికి తగ్గుతుంది. ఈ విలువలో రూ.104.27 లక్షల కోట్ల నుంచి రూ.111.53 లక్షల కోట్లకు చేరుతుంది.
వ్యవసాయ రంగం వృద్ధి 4.1%గా ఉంటుంది. అటవీ, మత్స్య విభాగాల వృద్ధి రేటు 1.2%గా ఉంది.  మైనింగ్, క్వారీయింగ్‌లో వృద్ధిలేకపోగా 1.8% క్షీణత నమోదుకానుంది. గతేడాది వృద్ధిరేటు 7.4%.
తయారీ రంగం వృద్ధి 9.3% నుంచి 7.4%కి పడిపోతోంది. నిర్మాణ రంగంలో కూడా వృద్ధి రేటు 3.9% నుంచి 2.9%కి తగ్గుతుంది.
రూ. లక్ష దాటనున్న తలసరి ఆదాయం
నికర తలసరి ఆదాయం (ప్రస్తుత ధరల వద్ద) రూ.1,03,007గా ఉంటుంది. 2015–16తో పోల్చితే 10.4% (రూ.93,293) ఎక్కువ.

ఊహాజనితం అనుకోము: శక్తికాంత్‌ దాస్‌
‘సీఎస్‌ఓ వాస్తవిక డేటాను ఆవిష్కరించింది. దీనిని మేము ఏదో ప్రభావాలు, ఊహాగానాలతో వేసిన లెక్కలుగా భావించలేం. ఇప్పుడు వివిధ వర్గాల నుంచి అంచనాలన్నీ డీమోనిటైజేన్‌ ఆధారంగానే వస్తున్నాయి. ఇవన్నీ కేవలం ఊహాగానాలతో చేసినవే’ అని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్‌దాస్‌ చెప్పారు. డీమోనిటైజేషన్‌ నేపథ్యంలో జీడీపీ 2% వరకూ పడిపోతుందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌సహా పలువురు అభిప్రాయపడిన నేపథ్యంలో తాజా అంచనాలు వెలువడ్డాయి.

డీమోనిటైజేషన్‌ ప్రభావం ఉంటుంది: పరిశ్రమలు
మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద డీమోనిటైజేషన్‌ ప్రభావం ఉంటుందని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే పెద్ద నోట్ల రద్దు ప్రభావం తాత్కాలికమేనని, అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొంటాయని పారిశ్రామిక మండలి సీఐఐ పేర్కొంది. రానున్నది వృద్ధి ఆధారిత బడ్జెట్‌ అని విశ్వసిస్తున్నట్టు తెలిపింది. ఇది 8 శాతం దేశాభివృద్ధికి బాటకు చేరడానికి దోహదపడే అంశంగా అభిప్రాయపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement