ఎగ్జిట్ పోల్స్ షాక్
- 490 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 8,550 దిగువకు నిఫ్టీ
- ప్రభావం చూపిన ఎల్ అండ్ టీ ఫలితాలు
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పొందవచ్చంటూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ స్టాక్ మార్కెట్లను పడగొట్టాయి. ఎల్ అండ్ టీతో సహా పలు కార్పొరేట్ల ఫలితాలు నిరాశకు గురిచేయడం కూడా స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో ట్రేడింగ్ సెషన్‌లోనూ క్షీణించడానికి మరో కారణం.
సెన్సెక్స్ సోమవారం ట్రేడింగ్‌లో 490 పాయింట్లు క్షీణించి 28,227 పాయింట్లకు పతనమైంది. ఇది మూడు వారాల కనిష్ట స్థాయి. నిఫ్టీ 135 పాయింట్లు నష్టపోయి 8,526 పాయింట్ల వద్ద ముగిసింది.
అమ్మకాల వెల్లువ
నేడు(మంగళవారం) ఫలితాలు రానున్న ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మిపార్టీకి అనుకూలంగా శనివారం నాడు ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌కు మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం జరిగిన పలు రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీలో ఓడిపోతే కేంద్ర ప్రభుత్వం సంస్కరణలపై ఇంతకు ముందులాగా దూకుడుగా వ్యవహరించదన్న అంచనాలు స్టాక్ మార్కెట్లను పడగొట్టాయని పేర్కొన్నారు.
అంచనాలకంటే ఎల్ అండ్ టీ ఫలితాలు అధ్వానంగా ఉండడం చివరలో మార్కెట్ల పతనానికి మరింత కారణమైందని వివరించారు. అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉండడం, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో లాభాల స్వీకరణ, స్పెక్యులేషన్.. ఈ అంశాలు కూడా స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌పై ప్రభావం చూపాయని బొనంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ గోయల్ వ్యాఖ్యానించారు.
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు...
విదేశీ ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరిపారు. క్యాపిటల్ గూడ్స్, లోహ, వాహన, బ్యాంకింగ్, కన్సూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసీజీ, రిఫైనరీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిధులు స్టాక్ మార్కెట్ల నుంచి తరలడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. జీడీపీ గణాంకాలు వెలువడనుండడం(మార్కెట్లు ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెలువడ్డాయి) కూడా ట్రేడింగ్‌పై ప్రభావం చూపిందని ట్రేడర్లు పేర్కొన్నారు. రూపాయి పతనం కారణంగా ఐటీ షేర్లు, ఇన్ఫోసిస్, విప్రో తదితర ఐటీ షేర్లు పెరిగాయి. సెన్సెక్స్ 28,567 పాయింట్లు వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 28,183 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 491 పాయింట్ల నష్టంతో 28,227 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 135 పాయింట్లు నష్టపోయి 8,526 పాయింట్ల వద్ద ముగిసింది.
ఆప్ ఎఫెక్ట్
ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను తగ్గిస్తుందన్న అంచనాలతో టాటా పవర్ 2.5 శాతం, రిలయన్స్ పవర్ 6 శాతం వరకూ క్షీణించాయి. ఈ రెండు కంపెనీలు ఢిల్లీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. రిలయన్స్-అడాగ్‌కు చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రా 8.6 శాతం రిలయన్స్ కమ్యూనికేషన్స్4.3 శాతం స్థాయిలో పడిపోయాయి. గతంలో డీఎల్‌ఎఫ్‌కు వ్యతిరేకంగా ఆప్ వ్యవహరించిన నేపథ్యంలో డీఎల్‌ఎఫ్ షేర్ 4 శాతం వరకూ క్షీణించి రూ.157 వద్ద ముగిసింది. ఆర్థిక ఫలితాలు బాగా లేకపోవడంతో ఎల్ అండ్ టీ 6.6 శాతం, టాటా స్టీల్ 5.7 శాతం, గెయిల్ 4.53 శాతం చొప్పున క్షీణించాయి. సెసా స్టెరిలైట్ 4.5 శాతం, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, టాటా మోటార్స్ షేర్లు 3-4% రేంజ్‌లో పడిపోయాయి.
ఈ వారంలో ఆర్థిక ఫలితాలు వెల్లడి కానున్న కంపెనీలు-సిప్లా, భెల్, హిందాల్కో, కోల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్‌బీఐల షేర్లు 0.7 -7% వరకూ పడిపోయాయి. చైనా దిగుమతి గణాంకాలు బలహీనంగా ఉండటంతో లోహ షేర్లు క్షీణించాయని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేశ్ చౌధురి చెప్పారు. రాగి, ఉక్కు, అల్యూమినియం లోహాలను ప్రపంచంలోనే అత్యధికంగా చైనానే వినియోగిస్తోంది. దీంతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, సెయిల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, హిందూస్తాన్ కాపర్, నాల్కోల షేర్లు 0.9 శాతం నుంచి 4 శాతం రేంజ్‌లో పడిపోయాయి.
ఆరు సెన్సెక్స్ షేర్లకే లాభాలు: 30 షేర్ల సెన్సెక్స్‌లో 24 షేర్లు నష్టపోగా, ఆరు మాత్రమే లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2%, ఓఎన్‌జీసీ 1.5%, బజాజ్ ఆటో 1.4%, సన్ ఫార్మా 1.3%, ఇన్ఫోసిస్ 1.1 శాతం, విప్రో 1% చొప్పున పెరిగాయి. మొత్తం 1,911 షేర్లు నష్టాల్లో ముగియగా, 927 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,955 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.15,277 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,94,340 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.660 కోట్ల నికర అమ్మకాలు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.470 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
నెల రోజుల కనిష్టానికి రూపాయి
ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం కావడం కూడా సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. డాలర్‌తో రూపాయి మారకం నాలుగు వారాల వారాల కనిష్ట స్థాయి రూ.62.17కు చేరింది.
మార్కెట్లు ఎందుకు పడ్డాయంటే..
⇒ ఆప్‌కు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్
⇒ కార్పొరేట్ల నిరాశాజనక ఆర్థిక ఫలితాలు
⇒ రూపాయి పతనం
⇒ కొనసాగుతున్న లాభాల స్వీకరణ
⇒ మిశ్రమంగా ఆసియా మార్కెట్లు
⇒ యూరప్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం కావడం