ఉబెర్ 210 కోట్ల డాలర్ల పెట్టుబడుల సమీకరణ
భారత, చైనాల్లో విస్తరణ కోసం
న్యూయార్క్: యాప్ ఆధారిత ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబెర్ భారత్, చైనాల్లో విస్తరణ కోసం 210 కోట్ల డాలర్ల(సుమారుగా రూ.13,650 కోట్లు) పెట్టుబడులు సమీకరించనున్నది. టైగర్ గ్లోబల్, ఇంకా ఇతర ఇన్వెస్టర్ల నుంచి ఈ స్థాయిలో నిధులు సమీకరించనున్నదని సమాచారం. ఇలా సమీకరించిన నిధులను భారత్, చైనాల్లో ఉబెర్ కంపెనీ పెట్టుబడులు పెడుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పెట్టుబడుల ఆధారంగా ఈ కంపెనీ విలువ 6,250 కోట్ల డాలర్లు(సుమారుగా రూ.4 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. భారత్‌లో కార్యకలాపాల విస్తరణ కోసం 9 నెలల్లో వంద కోట్ల డాలర్లు(రూ.6,400 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నామని ఈ ఏడాది జూలైలో ఉబెర్ వెల్లడించింది.
ఉబెర్‌తో పోటీపడుతున్న మరో ట్యాక్సీ అగ్రిగేటర్ ఓలాలో కూడా టైగర్ గ్లోబల్ పెట్టుబడులు పెట్టడం విశేషం. కాగా ఓలా కంపెనీ ఇతర పోటీ కంపెనీలైన డిడి, లిఫ్ట్, గ్రాబ్ ట్యాక్సీలతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల ఈ యాప్‌ల యూజర్లందరూ భారత్, చైనా, అమెరికా, ఆగ్నేయాసియా దేశాల్లో ట్యాక్సీలను బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా67 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉబెర్‌కు గట్టి పోటీనిచ్చిన్నట్లు అవుతుంది కూడా.