ఘోర ప్రమాదం.. 16 మంది దుర్మరణం | 16 People Died In Road Accident In Kurnool | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం.. 16 మంది దుర్మరణం

Published Sun, May 12 2019 1:39 AM | Last Updated on Sun, May 12 2019 2:36 PM

16 People Died In Road Accident In Kurnool - Sakshi

కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు)/వైఎస్సార్‌ సర్కిల్‌/సీక్యాంప్‌/కృష్ణగిరి/వెల్దుర్తి/కర్నూలు గాయత్రీ ఎస్టేట్‌: పెళ్లి ఖాయమైందన్న ఆనందంఆ దాయాదుల్లో ఎక్కువసేపు నిలువలేదు. తిరుగు ప్రయాణంలో మృత్యువు కాటేసింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద శనివారం జరిగిన ఘోర ప్రమాదం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. వేగంగా వచ్చిన బస్సు ఎదురుగా వచ్చిన బైకును   తప్పించబోయి అవతలివైపు వెళ్తున్న జీపును ఢీకొనడంతో 16 మంది మృత్యువాతపడ్డారు. మృతులను తెలంగాణలోని గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం వాసులుగా గుర్తించారు. గద్వాల జిల్లా వడ్డేమాను మండలం రామాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ లక్ష్మన్న, జయలక్ష్మీల కుమారుడు శ్రీనాథ్‌కు గుంతకల్‌కు చెందిన మేనమామ కుమార్తెతో పెళ్లికి ఖాయం చేసుకోవడానికి ఉదయం 8.30 గంటలకు 30 మంది రెండు జీపుల్లో బయల్దేరి వెళ్లారు.

మధ్యాహ్నం ఒంటిగంటకు గుంతకల్‌ చేరుకుని పెళ్లి ఖాయం చేసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సొంతూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. పురుషులందరూ ఒక జీపులో, మహిళలు మరోదానిలో బయల్దేరారు. మహిళల వాహనం ముందు వెళ్తోంది. సాయంత్రం 6 గంటల సమయంలో వెల్దుర్తి సమీపంలోని రైల్వే బ్రిడ్జి దగ్గరకు పురుషులు ప్రయాణిస్తున్న జీపు చేరుకోగానే.. ఎదురుగా వాయువేగంతో వస్తున్న ప్రైవేటు బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో వాహనంలో ఉన్న 16 మందిలో 13 మంది అక్కడిక్కడే మృతిచెందారు. ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడడంతో పోలీసులు వారిని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ ముగ్గురు మరణించగా.. మిగిలిన ఇద్దరు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు.

ప్రమాదం ఇలా జరిగింది..
కేఏ01 ఏజీ 4406 నంబర్‌ గల ప్రైవేట్‌ ఏసీ బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తోంది. అదే సమయంలో మాసుం, ఖాజా అనే యువకులు తమ స్కూటర్లో వెల్దుర్తి సమీపంలోని పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌ పోయించుకుని రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతలో బస్సు దాదాపు 150 కిమీ వేగంతో దూసుకొస్తుండటం చూసి ఆగిపోయారు. అదే సమయంలో మరో స్కూటరిస్టు రావడంతో దానిని తప్పించబోయిన బస్సు.. ఆగి ఉన్న స్కూటర్‌తోపాటు రోడ్డుకు అవతల వైపున గుంతకల్లు నుంచి వస్తున్న జీపును బలంగా ఢీకొట్టింది. దీంతో జీపులోని 13 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు స్కూటరిస్టులతోపాటు జీపులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందడంతో మృతుల సంఖ్య 16కి పెరిగింది.  

అందరూ దాయాదులే..
ప్రమాదంలో చనిపోయిన వారి సెల్‌ఫోన్లకు వస్తున్న కాల్స్‌ ఆధారంగా పోలీసులు మృతుల బంధువుల వివరాలను కొనుగొన్నారు. ఆధార్‌ కార్డుల ద్వారా కొందరిని గుర్తించారు. మృతులంతా గద్వాల జిల్లా వడ్డేమాను మండలం రామాపురం గ్రామానికి చెందిన వారిగా నిర్ధారించారు. 16మందిలో 14 మంది ఇదే గ్రామానికి చెందిన వారు కాగా, డ్రైవర్‌ రంగస్వామి శాంతినగర్‌ వాసి. మాసుం వెల్దుర్తికి చెందిన వారు. మృతుల్లో రామాపురం గ్రామానికి చెందిన శాలన్న (30), గోపీనాథ్‌ (25), రాముడు (45), మునిస్వామి (30), భాస్కర్‌ (35), సోమన్న (40), తిక్కన్న (40), నాగరాజు (38), పరశురాముడు (25), సురేష్‌ (29), కృష్ణ (28), పౌలన్న (45), చింతలన్న (55)తో పాటు వెల్దుర్తికి చెందిన కటికె మాసుం (27), జీపు డ్రైవర్‌ రంగస్వామి (40), వెంకటరాములు (35) ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన దాయాదాలు.

హాజరుకాని పెళ్లి కుమారుడు
పెళ్లి కుమార్తె మేనత్త కూతురు కావడంతో పెళ్లి కుమారుడు శ్రీనాథ్‌ ఈ కార్యక్రమానికి వెళ్లలేదు. శ్రీనాథ్‌ తండ్రి గతంలోనే మరణించగా.. ఆయన తల్లి మహిళలు ప్రయాణిస్తున్న జీపులో ఉన్నారు. వారి తరఫున చిన్నాన్న రాముడుతో పాటు ఇతర బంధువులు నిశ్చితార్ధానికి వెళ్లారు. ఈ ప్రమాదంలో రాముడుతోపాటు 14 మంది బంధువులు, డ్రైవర్‌ రంగస్వామి మృతిచెందారు. మృతులంతా 25–40 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. కుటుంబాలకు పెద్ద దిక్కైన వారు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యుల వేదన వర్ణనాతీతం. మృతుల్లో ఎస్‌బీఐ ఉద్యోగి సురేష్‌కు కొత్తగా పెళ్లయింది. ఆయన భార్య ప్రస్తుతం గర్భవతి. మరో మృతుడు నాగరాజుకు కూడా ఇటీవలే వివాహం అయింది. మరోవైపు.. ప్రమాదంలో తండ్రీకొడుకులు చింతలన్న, తిక్కయ్య కూడా మృతిచెందారు. ఈ దుర్ఘటనతో ఆ కుటుంబంలో మగదిక్కు లేకుండా పోయింది. అలాగే, రామాపురం గ్రామానికి చెందిన మునిస్వామి కుమారుడు గోపీనాథ్‌కు వచ్చే నెలలో వివాహం చేయాలని నిశ్చయించారు. ఈయన విద్యుత్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. కొడుకు ఇకలేడని తలుచుకుని ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.  

కలెక్టర్, ఎస్పీ పరామర్శ
ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న కర్నూలు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ, జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప, డోన్‌ డీఎస్పీ ఖాదర్‌బాషా సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతులను పోస్టుమార్టం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లుచేశారు. అనంతరం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చి మృతుల కుటుంబీకులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన విధానాన్ని వారి నుంచి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌ను ఆదేశించారు.  

మృతుల కుటుంబాలకు పరామర్శ
జిల్లా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం, మాజీ ఎమ్మెల్యే సంపత్‌లు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి వచ్చిన మృతుల కుటుంబీకులను, క్షతగాత్రులను పరామర్శించారు. గద్వాల జిల్లా కలెక్టర్‌ శశాంక్, ఎస్పీ లక్ష్మీనాయక్‌ ఆస్పత్రికి వచ్చి మృతుల వివరాలను అడిగి తెలుసుకుని వారి బంధువులకు సమాచారమిచ్చారు.  
 
ఆ దేవునికి మాపై ఎందుకింత కసి..
గుండెలవిసేలా రోదించిన మృతుల కుటుంబీకులు, బంధువులు
కర్నూలు (హాస్పిటల్‌) :  ‘పెళ్లి ఖాయం చేసుకుని ఇంటికి బయల్దేరాం. ఆడోళ్లమంతా ముందు జీపులో బయల్దేరాం. మేం ఊరికి చేరుకున్నాక బంధువులంతా ఫోన్లు చేస్తున్నారు. ఇంకో జీపు యాక్సిడెంట్‌కు గురయ్యిందంట.. టీవీలో వస్తోంది, చాలామందికి దెబ్బలు తగిలినాయంట అని చెప్పారు. వెంటనే మేం జీపులో ఉండే మా వాళ్లకు ఫోన్‌ చేశాం. ఎవ్వరూ ఫోన్‌ ఎత్తలేదు. మేం వచ్చిన జీపును తక్షణమే వెల్దుర్తికి పంపించాం. అక్కడికి వెళ్లినవారు ఫోన్‌చేసి అక్కా జీపులో ఎవ్వరూ మిగల్లేదని ఏడ్చుకుంటూ చెప్పారు. ఆ దేవునికి మా మీద ఇంత కసి ఎందుకు? మేమేమి అన్యాయం చేశాం’.. అని గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామ మహిళలు గుండెలవిసేలా రోదించారు. ప్రమాద విషయం తెలుసుకుని మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చారు. ఆసుపత్రిలో నిర్జీవంగా ఉన్న తమ వారిని చూసి కుప్పకూలిపోయారు.

బస్సులో భయం.. భయం
వెల్దుర్తి వద్ద రోడ్డు ప్రమాదంతో వోల్వో బస్సులో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్‌ నుంచి మంగళూరుకు వెళ్లే ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ వోల్వో బస్సులో సుమారు 48 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరిన బస్సు కర్నూలుకు 5.30 గంటలకు చేరుకుంది. బళ్లారి చౌరస్తా వద్ద మరో ముగ్గురు ప్రయాణికులను ఎక్కించుకుని బెంగళూరు వైపు సాగింది. సుమారు 6.20 గంటల సమయంలో వెల్దుర్తి చెక్‌పోస్టు వద్దకు రాగా.. భారీ కుదుపునకు గురైంది. అంతవరకు సాఫీగా సాగిన బస్సు ప్రమాదానికి గురి కావడంతో అందులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టిన అనంతరం తుఫాన్‌ వాహనాన్ని 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. అదే సమయంలో బస్సు డీజిల్‌ ట్యాంకు లీకవడం, ఇంజిన్‌లో పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు భయాందోళనలతో కేకలు వేశారు. బస్సు అద్దాలను ధ్వంసం చేసి  ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కిందకు దూకారు. కొంతసేపటికి తేరుకుని ఎవరి దారిన వారు గమ్యస్థానాలకు బయలుదేరారు.


ఇరుక్కుపోయిన మృతదేహాలు

ప్రమాద స్థలి చూపరులను భీతిగొల్పింది. సరిగ్గా సాయంత్రం 6.20 గంటలకు వోల్వో బస్సు బైక్‌ను.. ఆ వెంటనే తుపాన్‌ వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో తుపాన్‌ వాహనంలో ఉన్న 16 మందిలో 13 మంది అక్కడికక్కడే చనిపోయారు. వీరిలో ఏడుగురి మృతదేహాలు వాహనం నుంచి బయటకు ఎగిరిపడ్డాయి. ఆరుగురి మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి. తీవ్రంగా గాయపడిన ముగ్గురు కూడా వాహనంలోనే ఉండిపోయి ఆర్తనాదాలు చేయసాగారు. స్థానికులు గాయపడిన వారిని వాహనం నుంచి వెలికితీసి ఆసుపత్రికి తరలించడానికి సాయపడ్డారు. ఆరుగురి మృతదేహాలు పూర్తిగా ఇరుక్కుపోవడంతో స్థానికులతో పాటు పోలీసులు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించేందుకు నాలుగు గంటల పాటు చెమటోడ్చినా ఫలితం లేక చివరకు క్రేన్‌లను రప్పించారు. వాటి సాయంతో రాత్రి 10.30 గంటలకు వాటిని పక్కకు తొలగించారు. వాహనాలు ఓ వైపు నుంచి వెళ్లేలా వీలు కల్పించడంతో ట్రాఫిక్‌ పెద్దగా స్తంభించలేదు.

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
సాక్షి, న్యూఢిలీ/హైదరాబాద్‌ : కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరగడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
 
సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్‌ : కర్నూలు జిల్లాలో వెల్దుర్తి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పలువురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంఘటనలో గాయపడి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి అవసరమైన సాయం అందించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు.
 
వైఎస్‌ జగన్‌ తీవ్ర విచారం
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారికి ఆయన సంతాపం వ్యక్తంచేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  
 
బాధిత కుటుంబాలను ఆదుకోండి: చంద్రబాబు
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధితులకు తక్షణమే వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement