మృతుడు కిషోర్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్‌సీపీ నేత, కౌలు రైతు పసుమర్తి వెంకట కిషోర్‌ను స్థానిక టీడీపీ నాయకులు దారుణంగా హత్య చేశారు. పొలంలో పట్టపగలే రాడ్లు, గొడ్డళ్లతో దాడిచేసి చంపేశారు. హతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు...పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం కొత్త అంబర్‌పేటలో కిషోర్ (36) కౌలుకు తీసుకున్న పొలంలో శుక్రవారం మిషన్‌తో కోత కోయిస్తుండగా ఐదుగురు వ్యక్తులు రాడ్లు, గొడ్డళ్లతో వచ్చి తలపై మోదారు. నెత్తురు మడుగులో కొట్టుకుంటుండగా అతన్ని చికిత్స నిమిత్తం ఏలూరు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. దాడి సమయంలో అక్కడే ఉన్న కిషోర్ పెద్దమ్మ కుమారుడు గూడపాటి సుబ్బారావు చంపవద్దని ప్రాధేయపడినా వదలలేదు.అంబర్‌పేటలో దాసరి బుల్లెమ్మకు 11.50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
ఆమె భర్త, కుమారుడు మృతి చెందడంతో 1996లో తణుకుకు చెందిన రాజశేఖర్‌కు విక్రయించింది. టీడీపీ మాజీ ఎంపీటీసీ జువ్వా స్వామి, ఏసుపాదం, సులేమాన్‌రాజులకు బుల్లెమ్మ మేనత్త. పొలానికి తామే వారసులమంటూ అన్నదమ్ములైనవారు ఆమెను వేధిస్తున్నారు. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. పొలాన్ని కౌలుకు చేస్తున్న కిషోర్‌ను ఖాళీ చేయించాలని టీడీపీ ప్రభుత్వ హయాం నుంచి ఆపార్టీ నాయకుల ద్వారా అతనిపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ నెల 8న కిషోర్ పొలాన్ని కోసి ధాన్యం ఆరబోయగా టీడీపీ నాయకులు, మాజీ ఎంపీటీసీ జువ్వా స్వామి, అతని సోదరులు ధాన్యాన్ని ఎత్తుకుపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో పొలానికి వెళ్లిన కిషోర్‌ను పథకం పన్నిన దుండగులు రాడ్లు, గొడ్డళ్లతో కొట్టి చంపారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు నిందితులు జువ్వా ఏసుపాదం, జువ్వా స్వామి, జువ్వా సులేమాన్‌రాజుతో పాటు శశికుమార్, బుచ్చిబాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సోదరుడు, టీడీపీ కీలక నేత గన్ని గోపాలం ఈ హత్యకు పథకం పన్నాడని ఆరోపణలు వస్తున్నాయి. వివాదంలో ఉన్న 11.50 ఎకరాల భూమిపై అతని కన్నుపడిందని, ఆ భూమిని కాజేసేందుకే కుట్రపన్ని నిందితులను రెచ్చగొట్టారని ప్రత్యక్ష సాక్షి గూడపాటి సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment