గోమతి మృతి చెందిన ఇంట్లో పరిశీలిస్తున్న గూడూరు డీఎస్పీ, సీఐలు, ఇన్‌సెట్లో గోమతి మృతదేహం
సాక్షి, నాయుడుపేట టౌన్(నెల్లూరు): అదనపు కట్నం కోసం కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. భార్యను చిత్రహింసలతో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన వైనంపై హతురాలి కుటుంబ సభ్యులు పోలీసలుకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటన పట్టణంలోని పిచ్చిరెడ్డితోపు వీధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. అయితే మహిళ మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా తమిళనాడులోని భర్త స్వగ్రామానికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మహిళ మృతదేహాన్ని తిరిగి నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. మృతురాలి తల్లిదండ్రులు దువ్వూరు రఘరామిరెడ్డి, మహేశ్వరి కథనం మేరకు.. చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం అన్నూరు గ్రామానికి చెందిన రఘరామిరెడ్డి కుమార్తె గోమతి (27)ని నాలుగేళ్ల క్రితం తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా, పొన్నేరి తాలుకా అరవవాకం గ్రామానికి చెందిన సన్నారెడ్డి ధీరజ్‌రెడ్డితో వివాహమైంది.
పెళ్లి సమయంలో కట్న కానుల కింద రూ.8 లక్షలు నగదు, 50 సవర్లకు పైగా బంగారు నగలు ఇచ్చారు. వీరికి ఏడాది వయస్సు కలిగిన కుమారుడు ఉన్నాడు. ధీరజ్ మేనకూరులోని ఓ పరిశ్రమలో పనిచేస్తూ నాయుడుపేటలోని పిచ్చిరెడ్డితోపు వీధిలో నివాసం ఉంటున్నారు. అయితే వివాహం జరిగిన కొద్ది నెలలకే భర్త పుట్టింటి నుంచి మరికొంత నగదు తీసుకుని రావాలని గోమతితో తరచూ గొడవ పడేవాడు. ఈ విషయమై పలుమార్లు గోమతి తల్లిదండ్రులకు చెప్పుకుని కుమిలిపోయింది. అయితే ఆమెకు నచ్చజెప్పి సర్దుకుని కాపురం చేసుకోవాలని తల్లిదండ్రులు సముదాయించేవారు. ఈ క్రమంలో ఆదివారం భార్యాభర్తల మధ్య చిన్నపాటి విషయమై గొడవ జరిగి తార స్థాయికి చేరుకుంది. కొద్ది సేపటి తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగి కోపంతో గోమతి ఇంట్లో ఉన్న ఓ రూములోకి వెళ్లి తలుపు వేసుకుని ఫ్యాన్‌కు చీరతో ఆత్యహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించి ఆమెను కిందకు దించి స్థానికులు సహాయంతో పట్టణంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా అందరిని నమ్మించాడు.
తామంతా నాయుడుపేటకు వచ్చే సరికి గోమతి మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా తమిళనాడులోని ధీరజ్ స్వగ్రామానికి తరలించాడు. తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి పరిశీలించగా గోమతి శరీరంపై గాయాలు ఉండడం, ఆమె దుస్తులు చిరిగి ఉండడంతో అనుమానం వచ్చి నాయుడుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గోమతి మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి తండ్రి రఘరామిరెడ్డి తన కుమార్తెను అల్లుడే కిరాతకంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గోమతి మృతదేహాన్ని తహసీల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పంచనామా జరిపి వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోమవారం సాయంత్రం గోమతి మృతదేహాన్ని తమిళనాడులోని ఆమె అత్తారింటికి తరలించించారు.
భర్త, కుమారుడితో ఉన్న మృతురాలు గోమతి (ఫైల్)
తల్లడిల్లిన కుటుంబ సభ్యులు
ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుని బీటెక్ వరకు చదివించిన తమ కుమార్తెను అల్లుడే కడతేర్చాడంటూ మృతురాలి తల్లి మహేశ్వరితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు తల్లడిల్లిపోయారు. ఆదివారం ఉదయం కూడా గోమతి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడిందని మధ్యాహ్నం సమయంలోనే తన కుమార్తెను పథకం ప్రకారం హత్య చేశాడంటూ కన్నీరు మున్నీరయ్యారు. పలుమార్లు మా ముందే తన పగæ తీర్చుకుంటానని కుమార్తెతో వివాదాలకు దిగేవాడని తమకు కడుపు కోత మిగిల్చాడాని బావురుమన్నారు. గోమతి మెడకు వైరు బిగించి ఉన్నట్లు వాతలు ఉన్నాయని, భర్త కసాయిగా మారి ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆరోపించారు.
హత్యగా కేసు నమోదు : గూడూరు డీఎస్పీ శ్రీహర్ష
పట్టణంలోని పిచ్చిరెడ్డితోపు వీధిలో నివాసముంటున్న గోమతి హత్యకు గురైనట్లుగా మృతురాలి తండ్రి దువ్వూరు రఘరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సోమవారం కేసు నమోదు చేశామని గూడూరు డీఎస్పీ భూమన భవాని శ్రీహర్ష తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా డీఎస్పీ స్థానిక సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్సై డీ వెంటేశ్వరరావుతో కలిసి పిచ్చిరెడ్డితోపులో ఘటన జరిగిన ఇంటిని పరిశీలించారు. ఓ గదిలో ఫ్యాన్ రెక్కకు ఉరేసుకున్నట్లు తగిలించి ఉన్న చీరతో పాటు అక్కడి పరిసరాలను డీఎస్పీ పరిశీలించారు. ఇంటిలో పలుచోట్ల రక్తపు మరకలు, ప్లాసిక్ట్ తాడు వంటివి అక్కడే పడేసి ఉండడాన్ని గుర్తించారు. మృతురాలి శరీరంపై ఎక్కడైనా గాయాలను పోలీసులు క్షుణంగా పరిశీలించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు పోలీసుల విచారణలో అసలు విషయాలు నిగ్గు తేలుస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment