అక్తర్ బేగం
యాలాల : భార్య ప్రవర్తన నచ్చకపోవడంతో గొంతు నులిమి హత్య చేశాడో భర్త. అనంతరం మృతదేహం ఉన్న గదికి తాళం వేసి నేరుగా పీఎస్‌లో లొంగిపోయాడు. ఈ సంఘటన మండల పరిధిలోని రాజీవ్ స్వగృహ కాలనీలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. తాండూరు రూరల్ సీఐ సైదిరెడ్డి, నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం మిట్టబాస్పల్లికి చెందిన అక్తర్ బేగం(33), అబ్దుల్ రహీం 2007లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
వీరి పెళ్లికి ముందు అక్తర్ బేగంకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. మొదటి భర్తకు దూరంగా ఉంటున్న అక్తర్ బేగంను అబ్దుల్ రహీం రెండో వివాహం చేసుకున్నాడు. రహీం కర్ణాటక సరిహద్దులో ఉన్న సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో కూలీ పనులు చేస్తుండగా, అక్తర్ బేగం టైలరింగ్ పనులతో జీవితం గడుపుతున్నారు. ఏడాదిన్నరగా మండల పరిధిలోని రాజీవ్ కాలనీలోని 5వ బ్లాక్‌లో 1వ నెంబరు గదిలో నివాసం ఉంటున్నారు.
కాగా ఇటీవల అక్తర్ బేగం ప్రవర్తనలో మార్పు గమనించిన రహీం తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. ఇదే క్రమంలో ఈనెల 12న ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్తర్ బేగం 14న తిరిగి వచ్చింది. ఇదే విషయమై ఆదివారం తమ సమీప బంధువుల వద్ద పంచాయతీ నిర్వహించారు. కాగా సోమవారం ఉదయం తమ కూతురు అఫియా బేగంను పాఠశాలకు పంపించిన అనంతరం భార్యాభర్తలు గొడవ పడ్డారు.
ఈ క్రమంలో రహీం.. అక్తర్ బేగం గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గదిలోనే ఉంచి బయట నుంచి తాళం వేసి నేరుగా యాలాల పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. విషయం నిందితుడి ద్వారా తెలుసుకున్న పోలీసులు కాలనీలో వారు ఉంటున్న గదిని తెరచి పంచనామ నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పాపం ఆఫియా..!
కాగా తల్లి హత్యకు గురైన విషయం తెలియని అఫియా పరిస్థితి స్థానికులను కంటతడి పెట్టించింది. అఫియా పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన అనంతరం పోలీసులు అఫియాను పాఠశాల నుంచి కాలనీకి తీసుకొచ్చారు. తమ ఇంటి ముందు గుమిగూడిన జనాలను చూస్తూ, ఏం జరిగిందోనని ఆందోళనకు గురవుతున్న అఫియాకు స్థానికులు ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment