ఏడీబీ రోడ్డు అభివృద్ధికి రూ.230 కోట్లు
- నెల రోజుల్లో ఖరారు కానున్న టెండర్లు
- పూర్తి కావొచ్చిన భూసేకరణ గ్రామసభలు
రాజానగరం : కాకినాడ నుంచి రాజానగరం వరకు ఉన్న ఏడీబీ రోడ్డును (30 కిలోమీటర్ల వరకు) నాలుగు లేన్లగా అభివృద్ధి చేసే ప్రక్రియను రూ.230 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారని ఆర్‌అండ్‌బీ ప్రత్యేక డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాన్సన్‌రాజు తెలిపారు. రాజానగరం మండలం రామస్వామిపేటలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ అందుకు అవసరమైన 74 ఎకరాల భూసేకరణకుగాను నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న గ్రామసభలు కూడా పూర్తికావొచ్చాయన్నారు. రాజానగరంలో జాతీయ రహదారిని ఏడీబీ రోడ్డు కలిసే జంక‌్షన్ వద్ద ‘ట్రంపెట్’ని నిర్మించి కాకినాడ వైపు నుంచి వచ్చే వాహనాలకు జాతీయ రహదారి పైకి చేరేందుకు ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేస్తారన్నారు. ఇందుకు అవసరమైన భూసేకరణపై ప్రజలకు అవగాహన కలిగిచేందుకుగాను శనివారం రాజానగరంలో తుది గ్రామసభను నిర్వహిస్తున్నామన్నారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం భూములు కోల్పోతున్నవారికి పరిహారం చెల్లిస్తున్నారన్నారు. అయితే ఈ పరిహారం విషయమైగాని, ఇతర ఏవిధంగా అభ్యంతరాలు ఉన్నా వెంటనే తెలియజేయమని సూచించామన్నారు.
రామస్వామిపేటలో గ్రామసభ
ఏడీబీ రోడ్డు విస్తరణకుగాను రామస్వామిపేటలో భూములు, గృహాలు కోల్పోతున్న వారి జాబితా, వారికి లభించే పరిహారానికి సంబంధించిన వివరాలను తహసీల్దారు జీఏఎల్ సత్యవతిదేవి తెలియజేశారు. భూములకు, నిర్మాణాలకు, ఫలసాయం ఇచ్చే వృక్షాలకు వేరువేరుగా పరిహారం ఏవిధంగా చెల్లించేది వివరించారు. ఈ విషయంలో ఏవిధమైన అభ్యంతరాలు ఉన్నా వెంటనే తెలియజేయాలన్నారు. జాబితాలో తమ పేర్లు లేవని, కాని భూసేకరణకు మార్కింగ్ ఇచ్చారని కొందరు, నిర్మాణాలకు మీరిచ్చే పరిహారం చాలా తక్కువగా ఉందని, పెంచాలని మరికొందరు వెలిబుచ్చిన అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఆ మేరకు లేఖలు ఇచ్చే వాటిని పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. సమావేశంలో డిప్యూటీ తహసీల్దారు రామకృష్ణ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు అశోక్, గ్రామపెద్దలు గుత్తుల ఆదినారాయణ, అట్రు బ్రహ్మం పాల్గొన్నారు.