శీలానికి వెలకట్టిన పెద్దలు..
కల్లూరు రూరల్: మోసగాడి మాయమాటల్లో పడి ఓ అమాయకురాలు గర్భవతైంది. పెద్దలు ఆమె శీలానికి వెలకట్టి వదిలేశారు. నిందితుడి తల్లి దగ్గరుండి మరీ అబార్షన్ చేయించింది. అనారోగ్యంతో రెండు నెలల తర్వాత శుక్రవారం ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, 12 మందిపై కేసు పెట్టారు.
వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబంజరకు చెందిన వికలాంగురాలు వాంకుడోత్ రాణి(15)కి, అదే గ్రామానికి చెందిన మూడు చెన్నకేశవులు మాయమాటలు చెప్పి లోబర్చకున్నాడు. గర్భం దాల్చడంతో ఆమె తల్లిదండ్రులు గ్రామ పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు. దీంతో బాధితురాలిని చెన్నకేశవులు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. దీనికి అతడి తల్లిదండ్రులు నిరాకరించి, నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్ధపడ్డారు. బాలిక కుటుంబానికి రూ.40 వేలు చెల్లించేలా ఇరు కుటుంబాల మధ్య గ్రామ పెద్దలు రాజీ కుదిర్చారు.
ఈ క్రమంలో చెన్నకేశవులు తల్లి లచ్చి.. బాధితురాలికి ఖమ్మం తీసుకెళ్లి అబార్షన్ చేయించింది. వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకోక పోవడంతో ఆరోగ్యం క్షీణించి, ఖమ్మం ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి మృతిచెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో శనివారం 12 మందిపై కల్లూరు ఏసీపీ బల్లా రాజేశ్ కేసు నమోదు చేశారు. అబార్షన్ చేసిన ఆస్పత్రి వైద్యులపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.