భద్రకాళి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవం
Published Fri, Aug 19 2016 12:59 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
హన్మకొండ కల్చరల్ : వరంగల్‌లోని శ్రీ భద్రకాళి ఆలయంలో మూడు రోజులుగా జరుగుతున్న పవిత్రోత్సవాలు శ్రావణపౌర్ణమి సందర్భంగా గురువారం అమ్మవారిని అఖండ పవిత్రాలతో అలంకరించి పవిత్రోత్సవం సంపూర్తి చేశారు. ప్రధానార్చకుడు భద్రకాళి శేషు అధ్వర్యంలో ముఖ్యార్చకులు పార్నంది నర్సింహామూర్తి, చెప్పెల నాగరాజుశర్మ, టక్కరసు సత్యం ఉదయం నుంచి పవిత్రోత్సవ కృతువు మహాకుంభాభిషేకం జరిపారు. పావీరవికన్యా మంత్రపఠనం చేస్తూ మహాపూర్ణాహుతి నిర్వహించి హోమసంపాతాజ్యాన్ని వివిధ రంగుల ఊలు దారాలతో రూపొందించిన దండలకు లేపనం చేశారు. అనంతరం నూలు దండలను అమ్మవారి ధృవమూర్తి, ఇచ్ఛామూర్తులకు అలంకరించారు. ఊలు దారాలతో శోభాయమానంగా కొలువైన అమ్మవారిని చూసి భక్తులు పులకించిపోయారు. ఈ సందర్భంగా అర్చకుడు భద్రకాళి శేషు మాట్లాడుతూ ఆలయంలో అర్చకులు, భక్తులు, అధికారుల వల్ల తెలిసీతెలియక జరిగే అపరాధాలు తొలగించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. దేవాలయ సూపరిటెండెంట్ అద్దంకి విజయ్, చింత శ్యామ్‌సుందర్ పాల్గొన్నారు.
Advertisement