చేలు తడారి.. డెల్టా ఎడారి | chelu tadari.. delta adari | Sakshi
Sakshi News home page

చేలు తడారి.. డెల్టా ఎడారి

Published Fri, Aug 12 2016 11:35 PM | Last Updated on Fri, Oct 5 2018 6:40 PM

చేలు తడారి.. డెల్టా ఎడారి - Sakshi

చేలు తడారి.. డెల్టా ఎడారి

పెనుగొండ:  మిగుల జలాలతో నదుల అనుసంధానం చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సర్కారు.. అన్నపూర్ణ లాంటి ‘పశ్చిమ’ డెల్టాను ఎడారిగా మార్చేస్తోంది. గోదావరి నదికి సమీపంలోని గ్రామాల్లోనూ నీరందక వరిచేలు ఎండుతున్నాయి. దాళ్వాలో మాత్రమే సాగు నీటి కష్టాలు ఎదుర్కొనే రైతులు చంద్రబాబు సర్కారు పుణ్యమాని సార్వాలోనూ ఎద్దడిని చవిచూస్తున్నారు.
నారుమడుల సీజన్‌లో నీరందక మడులు ఎండిపోగా.. రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో కలెక్టర్‌ కె.భాస్కర్‌ హడావుడిగా నీటిపారుదల సలహా మండలి సమావేశం ఏర్పాటు చేసి మూడు రోజుల్లోనే సమస్యకు చెక్‌ పెడతామని ప్రకటించారు. అయినా పలు ప్రాంతాల్లో నేటివరకూ నీటి ఎద్దడికి పరిష్కారం లభించలేదు. పెనుగొండ మండలం కొఠాలపర్రు, తామరాడ, వడలి, రామన్నపాలెం గ్రామాల్లో సాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాట్లువేసి 15 రోజులు దాటుతున్నా చేలకు నీరందడం లేదు. వడలి–ఆచంట చానల్‌ పరిధిలో 700 ఎకరాలకు, ఐతంపూడి–చెరుకువాడ చానల్‌ శివారు ప్రాంతాల్లో 100 ఎకరాలకు నీరు అందడం లేదు. పంట కాలువల్లో మట్టాలు తక్కువగా ఉండటంతో చేలల్లోకి నీరు చేరడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. నరసాపురం ప్రధాన కాలువ, కోడేరు బ్యాంక్‌ కెనాల్‌లో నీటిమట్టం తక్కువగా ఉండటంతో ఈ పరిస్థితి దాపురించింది. రెండు అడుగుల నీటిమట్టం పెంచాలని రైతులు కోరుతున్నా ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో ‘కలెక్టర్‌ గారూ.. కనికరించరూ’ అని రైతులు వేడుకుంటున్నారు. 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement