కేంద్రం కంటే నేనే తెలివైన వాడిని | cm says.. he is more inteligent | Sakshi
Sakshi News home page

కేంద్రం కంటే నేనే తెలివైన వాడిని

Published Sat, Sep 24 2016 9:29 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

కేంద్రం కంటే నేనే తెలివైన వాడిని

కేంద్రం కంటే నేనే తెలివైన వాడిని

– నన్నెవరూ ఏమీ చేయలేరు
– అందుకే ప్యాకేజీకి అంగీకరించా
– తెలంగాణ ప్రభుత్వం ఏ కేసూ పెట్టలేదు
– పోలవరం నిర్మించే బాధ్యత కేంద్రం నాకు అప్పగించింది
– ప్రధాని కంటే ముందే నేను పచ్చదనం, పరిశుభ్రతకు పిలుపునిచ్చా
– పేరుకే ప్రత్యేక హోదా.. ప్యాకేజీలో అన్నీ ఉన్నాయి
– ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు
 
ఏలూరు (మెట్రో) :
ఎవరు ఎన్ని కేసులు పెట్టినా తనను ఎవరూ ఏమీ చేయలేరని, తెలంగాణ ప్రభుత్వం తనపై ఏ కేసూ పెట్టలేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శనివారం దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి అనంతరం సురేష్‌ బహుగుణ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. తాను నీతి నిజాయితీలతో జీవనం సాగిస్తున్నానని, అందువల్లే రోజుకు 6 గంటలపాటు ప్రశాంతంగా నిద్రపోతున్నానని పేర్కొన్నారు. తాను ఎవరికో భయపడుతున్నాననిఅంటున్నారని ఓటుకు నోటు కేసు గురించి పరోక్షంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఆ కేసు తెలంగాణలో ఉంటే తాను ఎందుకు భయపడతానని, అయినా తెలంగాణ ప్రభుత్వం తనపై ఏ కేసూ పెట్టే సాహసం చేయలేదని చెప్పుకొచ్చారు. తనమీద బురదజల్లే యత్నం చేస్తున్నారని, ఇది ఇప్పుడు మాత్రమే కాదని, గతంలోనూ తనపై చాలాసార్లు బురద చల్లారని, ఎవరు ఎన్నిసార్లు యత్నించినా తనను ఎవరూ ఏమీ చేయలేరని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఇబ్బందులు పెడదామని యత్నించిన వారికి కోర్టులు కూడా చీవాట్లు పెట్టాయని, అయినా వారికి బుద్ధి రాలేదని పేర్కొన్నారు.
ప్రధాని కంటే ముందే పిలుపునిచ్చా 
భారత ప్రధాన మంత్రి ఇటీవల స్వచ్ఛభారత్‌కు పిలుపునిచ్చారని, తాను గతంలోనే పచ్చదనం– పరిశుభ్రతకు పిలుపునిచ్చాన అన్నారు. ఇది తన గొప్పతనమని చెప్పుకున్నారు. ఓ పద్ధతి ప్రకారం ముందుకు పోతున్నానని పేర్కొన్నారు.
 
కేంద్రం కంటే తెలివైన వాడిని 
తాను చాలా తెలివైన వాడినని, కేంద్రం కంటే ఎక్కువ తెలివి ఉందని, తాను అందరి కంటే సీనియర్‌ నాయకుడినని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. తెలివైన వాడిని కాబట్టే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాను తప్ప ఇంకొకటి కాదన్నారు. డబ్బులు లేకపోతేనే ఎన్నో అభివద్ధి పనులు చేశామని, డబ్బులుంటే రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా తయారు చేస్తామని చెప్పారు.  కేంద్ర ప్రభుత్వం రెండేళ్లపాటు హోదాపై మాట్లాడకుంటే గట్టిగా అడిగానని, దాని ఫలితమే ఈ ప్యాకేజీ అని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదాతో సమానంగా మెరుగ్గా ప్యాకేజీ ఇస్తామన్న కేంద్రం పోలవరానికి రూ.30వేల కోట్లు రానున్న మూడు నాలుగు సంవత్సరాల్లో ఇస్తానని స్పష్టం చేసిందని చెప్పారు. 
పోలవరం నిర్మాణ బాధ్యత నాకు అప్పగించింది 
పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేయలేక ఆ బాధ్యతను తనకు అప్పగించిందని చంద్రబాబు చెప్పారు. ప్రతి సోమవరం పోలవరం పనులపై సమీక్ష నిర్వహిస్తానని, సోమవారాన్ని పోలవారంగా మారుస్తున్నానని చెప్పారు. ఓ పక్క దీన్ని పూర్తి చేస్తూనే ప్రత్యేక హోదా వస్తే ఎన్ని నిధులు వస్తాయో అన్నీ ఇస్తామని కేంద్రం చెప్పిందని, అందుకే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నానని పేర్కొన్నారు.
నాకు ఇంగ్లిష్‌ రాదన్నారు 
ఇటీవల ఏలూరులో నిర్వహించిన యువభేరిలో వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ముఖ్యమంత్రి పరోక్షంగా మాట్లాడుతూ ఇటీవల ఒక నాయకుడు ఏలూరు వచ్చి తనకు ఇంగ్లిష్‌ రాదని చెప్పారన్నారు. అటువంటి నాయకుల సభలకు విద్యార్థులను ఎందుకు పంపిస్తున్నారో వారి తల్లిదంఢ్రులు ఆలోచించుకోవాలన్నారు. విద్యార్థులు ఆ నేత సమావేశాలకు ఎందుకు పోతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.  
ఆరోగ్యాంధ్ర ప్రదేశ్‌ కోసం కషి
రాష్ట్రంలో దోమల నివారణ, పారిశుధ్యం మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అక్టోబరు 2 నాటికి రాష్ట్రంలో 110 మునిసిపాలిటీలను సంపూర్ణ పారిశుధ్య పట్టణాలుగా ప్రకటించనున్నామని చెప్పారు. దోమలపై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. బైబిల్, ఖురాన్, భగవద్గీత ఉన్నట్టే ప్రతి ఒక్కరి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దోమలపై దండయాత్ర పుస్తకం ఉండాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి పీతల సుజాత, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్, ఎంపీలు తోట సీతారామలక్ష్మి, మాగంటి వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ బి.రామాంజనేయులు, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement