నగదు కష్టం..రెట్టింపు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో నగదు కష్టాలు రెట్టింపయ్యాయి. సోమవారం మిలాద్ఉన్ నబీ పండగ సందర్భంగా బ్యాంకులు పనిచేయలేదు. కర్నూలు నగరంలో రెండే రెండు ఏటీఎంలు తెరుచుకున్నాయి. వీటికి జనాలు పోటెత్తుతున్నారు. పురుషులతో సమానంగా మహిళలు ఏటీఎంల వద్ద క్యూకట్టారు. ఇండియన్ బ్యాంకుకు ఆరు ఏటీఎంలు ఉన్నాయి. వీటిలో రెండు పనిచేస్తున్నా నగదు గంటలోనే ఖాళీ అవుతోంది. దీంతో ఎస్‌బీఐ ఏటీఎంలపై ఒత్తిడి పెరుగుతోంది. జిల్లా మొత్తం మీద నాలుగు ఏటీఎంలు మాత్రమే పనిచేస్తున్నాయంటే పరిస్థిథి ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ఇప్పటి వరకు 10వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతంలో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. జిల్లాకు 75కోట్ల కొత్త కరెన్సీ వచ్చినట్లు సమాచారం. ఇందులో 80శాతం వరకు రూ.2000 నోట్లు, మిగిలిన 20శాతంలో రూ.500,100,50, 20 నోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నగదును అన్ని బ్యాంకులకు పంపిణీ చేయనున్నారు. మంగళవారం మధ్యాహ్నం సమయానికి నగదు బ్యాంకులకు వెళ్లే అవకాశం ఉంది.