అనంతపురం అగ్రికల్చర్: వి«ధి నిర్వహణలో ఉన్న గోపాలమిత్రలకే గౌరవ వేతనం చెల్లిస్తామని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డిస్ట్రిక్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ–డీఎల్‌డీఏ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) డాక్టర్ ఎన్.తిరుపాల్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక సాయినగర్ పశువైద్యశాలలో సాక్షితో మాట్లాడుతూ... గోపాలమిత్రలు సమ్మెలో ఉన్నందున జిల్లాలో కృత్రిమ గర్భోత్పత్తి, లేగదూడల సంరక్షణ, పశువైద్యానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. గోపాలమిత్రల డిమాండ్లు పరిష్కరించడానికి ముందుకు వస్తున్నా తమ పరిధిలో పరిష్కారం కాని కొత్త డిమాండ్లను తెరపైకి తీసుకువస్తూ నిరసన కొనసాగిస్తున్నారని తెలిపారు.
కొత్తగా ఏర్పాటవుతున్న పశుమిత్రల ద్వారా గోపాలమిత్రలకు ఢోకా లేదన్నారు. ఈ క్రమంలో ఆగస్టు ఒకటో తేదీలోగా విధుల్లో చేరాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ క్రమంలో మే నెలకు సంబంధించి 85 మందికి మాత్రమే వేతనాలు ఇస్తున్నామన్నారు. మిగతా వారు కూడా రెండు మూడు రోజుల్లో విధుల్లో చేరి రికార్డులు సమర్పిస్తే పరిగణలోకి తీసుకుని న్యాయం చేస్తామని తెలిపారు. లేదంటే వారి స్థానాల్లో కొత్తగా గోపాలమిత్రల నియామకానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నిరసన ఉధృతం
తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ఏ మాత్రం చొరవ చూపకపోవడంతో గోపాలమిత్రలు తమ నిరసన కార్యక్రమాలను ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సోమవారం స్థానిక జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ) కార్యాలయాన్ని ముట్టడించాలని తీర్మానించారు. ఇదే అంశంపై గోపాలమిత్రల అసోసియేషన్ అధ్యక్షుడు కె.వెంకటేశులు ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్ట్స్‌కళాశాల మైదానంలో సమావేశమై చర్చించారు. డిమాండ్ల పరిష్కారానికి ఎవరి నుంచి కూడా స్పష్టమైన హామీ లభించకపోవడంతో నిరవదిక సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు.
పనిచేసే గోపాలమిత్రలకే వేతనం
Published Sun, Jul 31 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
Advertisement
Advertisement