చోరీలకు ఇంజినీరింగ్ తెలివితేటలు
Published Thu, Sep 8 2016 12:06 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
– ఏటీఎం కార్డు నెంబర్లు గుర్తించి నగదు చోరీ
– రూ.లక్ష నగదు, ఐదు సెల్‌ఫోన్లు, ఫ్రిజ్ స్వాధీనం
– బేతంచెర్లకు చెందిన అన్నదమ్ముల పన్నాగం
– పోలీసులకు చిక్కిన వైనం
ఇంజినీరింగ్ కోర్సు ద్వారా ఘడించిన సాంకేతిక మెలకువలను మంచి ఉద్యోగాలు సాధించి భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగించాల్సిన ఓ ఇద్దరు అన్నదమ్ములు వక్ర మార్గంలో వినియోగిస్తూ వచ్చారు. బేతంచెర్లకు చెందిన ఈ ఇద్దరు ఇంజనీరింగ్ పట్టభద్రులు చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు.
తాడిపత్రి: ఏటీఎంలో చోరీలకు పాల్పడుతన్న బేతంచెర్లకు చెందిన కార్తీక్, అతని సోదరుడు జగదీశ్‌ను అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.లక్ష నగదు, ఐదు సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్, ఒక ఫ్రిజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారి ఖాతాల్లోనున్న మరో రూ.లక్షను సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక సీఐ రామకష్ణారెడ్డి, ఎస్‌ఐలు లక్ష్మి, రామకష్ణారెడ్డి, ఆంజనేయులుతో కలసి డీఎస్పీ చిదానందరెడ్డి విలేకరులకు వివరించారు. బీటెక్ చదివిన కార్తీక్ బేతంచెర్లలో తొలుత బైక్ చోరీ చేశాడు. ఆ తరువాత సోదరుడితో కలసి అనంతపురం జిల్లా గుత్తిలో ఏటీఎం కేంద్రంలో ఓ వ్యక్తి డబ్బు డ్రా చేస్తుండగా, అతని కార్డుపైనున్న 16 అంకెలను గుర్తించారు. వాటి సాయంతో అతని ఖాతాలోని నగదును తన సాంకేతిక పరిజ్ఞాన ఉపయోగించి తన ఖాతాలోకి మార్చుకోగలిగాడు. ఇక అక్కడి నుంచి వారు వెనక్కి తిరిగి చూసుకోలేదు.
అంధ్రా బ్యాంకు ఏటీఎంలే లక్ష్యంగా...
చోరీల్లోనూ కార్తీక్ తన తెలివి తేటలను ప్రదర్శించాడు. ఇతర బ్యాంకుల ఏటీఎం కార్డులైతే 16 నంబర్లు వేర్వేరుగా ఉంటాయని, వాటిని గుర్తు పెట్టుకోవడం కష్టంగా భావించిన అతను ఆంధ్రా బ్యాంకు ఏటీఎంలనే ఎంపిక చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఏటీఎంలలో ఎవరైనా నగదు డ్రా చేసుకునేటప్పుడు వారి వెనుక వైపున క్యూలో నిలబడినట్లు నటిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా తన సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసుకునేవాడు. ఆ తరువాత తన సాంకేతిక పరిజ్ఞానంతో నెట్ బ్యాంకింగ్ అకౌంట్ క్రియేట్ చేసి నగదను తన ఖాతాలోకి సునాయసంగా మార్చుకునేవాడు.
Advertisement