ఇంటింటా కన్నీరు | gadapa gadapaku ysr eat godavari | Sakshi
Sakshi News home page

ఇంటింటా కన్నీరు

Published Thu, Sep 8 2016 12:28 AM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM

ఇంటింటా కన్నీరు - Sakshi

ఇంటింటా కన్నీరు

ఉన్న ఇళ్లు పీకేసుకున్నాం.. కొత్త ఇళ్లకు దిక్కులేదు..
రేషన్‌ కార్డు లేదు, పింఛను తొలగించేశారు
గడప గడపలో సమస్యల చిట్టా
సౌకర్యాలు మాట దేవుడెరుగు కనీసం ఉండటానికి గూడు కూడా ఇవ్వని సర్కార్‌ తీరుపై జనం ఆగ్రహంతో ఉన్నారు. పాత ఇళ్లు పీకేసుకుని ఎదురుచూస్తుంటే, కొత్త ఇళ్లు ఇవ్వకపోవడంతో బాధితులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. జిల్లాలో 11 నియోజకవర్గాల్లో జరిగిన గడప గడపకూ వైఎస్సార్‌ కార్యక్రమంలో ఇళ్లు లేక, ప్రభుత్వం రుణాలు మంజూరు చేయక ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారు ఏకరవుపెట్టారు.
– సాక్షి ప్రతినిధి, కాకినాడ
 
ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకుర్రులో పక్కా గృహాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో పూరిల్లే దిక్కయ్యాయని పట్టపగలు మధు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్రం జగ్గంపేట మండలం గుర్రప్పాలెంలో ఇళ్లకు రుణాలు ఇస్తామని చెప్పి కాళ్లరిగేలా తిప్పుకున్నా, తాటాకింటిలో అవస్థలు తప్పడం లేదని పాలిశెట్టి భవాని చెప్పారు. అర్హత కలిగినా పింఛను ఇవ్వడం లేదని తాడిపూడి సింహాచలం పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్‌ హుకుంపేట, బొమ్మూరులో ఆధార్, రేషన్, పింఛను వీటిలో ఏ ఒక్కటి ఇవ్వలేదని హుకుంపేట వరలక్ష్మికాలనీకి చెందిన పచ్చిపులుసు సత్యవతి అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పదేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నా, ఇల్లు ఇవ్వలేదని, రేషన్‌కార్డు లేదని నల్లగుంట్ల రూప వాపోయింది. వర్షం వస్తే రోడ్లు మునిగిపోతున్నాయని పామర్తి గోవిందు, బొమ్మూరు నవభారత్‌నగర్‌లో ఖాళీ స్థలాలతో దోమలు పెరిగిపోయాయని ఎన్‌.చంటి తెలిపాడు. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని ఎ.లక్ష్మణరావు చెప్పాడు.
 
కల్లుగీత కార్మికుడి కంటతడి
మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం నేలటూరులో కార్పొరేషన్ల రుణాలు అధికార పార్టీ వారికే కట్టబెట్టుకుంటున్నారని స్థానికులు ఆరోపించారు. కల్లుగీత కార్మికునిగా గుర్తింపు కార్డు ఉన్నా ప్రయోజనం లేదని చోడేlశ్రీనివాస్‌ కంటతడిపెట్టాడు. ఇప్పనపాడులో వసతుల లేమితో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రెయినేజీలు లేక అపరిశుభ్రత తాండవిస్తోందని, దోమల బెడద అధికంగా ఉందని కాలనీలో లాజరు గోడు వెళ్లగక్కాడు. నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం పంచాయతీ శివారు కిత్తమూరుపేటలో మహానేత వైఎస్‌ హయాంలో ఇచ్చిన పింఛన్లను ఇప్పుడు తొలగించారని గ్రామస్తులు మొరబెట్టుకున్నారు. చాలా మంది పింఛన్లుlతొలగించారని తమడాల వెంకాయమ్మ బావురుమంది. రెండేళ్లుగా అడుగుతున్నా రోడ్లు వేయలేదని మోడేజు రాజేశ్వరి గ్రామస్తుల సమస్యను ఏకరవుపెట్టింది. వైఎస్‌ హయాంలో రూ.200 పింఛను ఇచ్చేవారని, కాలు, చేయి పనిచేయదని వైద్యుల సర్టిఫికెట్‌ ఉన్నా పింఛను మాత్రం ఇవ్వడం లేదని మాడేం కాసులమ్మ కన్నీరుమున్నీరైంది.
రైతుల అవస్థలు
పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం క్రాపలో పకృతి వైపరీత్యాలతో నష్టపోయి 200 ఎకరాల్లో గత్యతరం లేక పంట విరామం ప్రకటించామని పలువురు రైతులు వివరించారు. పకృతి వైపరీత్యాల వల్ల ఏటా పంట నష్టపోతున్నా, పరిహారం అందడం లేదని రైతు ఎం.సూర్యభాస్కరరావు ఆవేదన వ్యక్తం చేశాడు. పెద్దాపురం నియోజకవర్గం కట్టమూరులో మంత్రి చేతులతో రుణమాఫీ పత్రం తీసుకున్నా, ఇప్పటికీ మాఫీ కాలేదని పెద్ది నాగేశ్వరరావు అనే రైతు ఘొల్లుమన్నాడు. భర్త చనిపోయి రెండేళ్లయినా, ఇప్పటివరకూ వింతంతు పింఛను ఇవ్వలేదని గోనాతి సూర్యావతి కంటతడిపెట్టింది.
మహిళలు కన్నీటిపర్యంతం
అమలాపురం రూరల్‌ మండలం వన్నెచింతలపూడిలో వికలాంగ పింఛను రావటం లేదని జాలెం సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశాడు. హౌసింగ్‌ రుణం ఇవ్వలేదని పడమటి గోపాలరావు, డ్వాక్రా రుణమాఫీ కాలేదని పి.గంగామణి వాపోయారు. పిఠాపురం పట్టణం రథాలపేటలో డ్రెయినేజీలు అస్తవ్యస్థంగా మారాయని కొత్తపల్లి బేబీ తెలిపింది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం రాజేంద్రనగర్‌లో రేషన్‌కార్డు ఇచ్చారు కానీ, స్లిప్‌లు ఇవ్వకపోవడంతో రేషన్‌ ఇవ్వడం లేదని పరుచూరి నూకరత్నం ఆవేదన వ్యక్తం చేసింది. రెండేళ్ల నుంచి ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయలేదని కుండా భద్రావతి కన్నీటిపర్యంతమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement