కార్మికుల సంక్షేమం పట్టించుకోకుండా పెట్టుబడిదారీ వ్యవస్థకు కొమ్ము కాస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనపై దేశంలోని అన్ని కార్మిక సంఘాలతో కలసి సెప్టెంబరు 2న సార్వత్రిక సమ్మె నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి అన్నారు. ఐఎన్‌టీయూసీ ఉభయ తెలుగు రాష్ట్రాల 185వ వర్కింగ్ కమిటీ సమావేశం ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సంజీవరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. జాతీయాదాయం పెరుగుతున్నట్లు మోదీ చెబుతున్నారని, అదే స్థాయిలో దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని అన్నారు. సంపద కేంద్రీకృతం అవుతుండటంతో పేదరికం పెరిగిపోతోందన్నారు. రాష్ట్రంలో కార్మికుల రక్షణతోపాటు వారి హక్కుల పరిరక్షణకు వైఎస్సార్ కాంగ్రెస్‌తో కలసి నడవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకు వెళ్లానన్నారు. కార్మికులకు రూ. 18 వేల జీతం ఇస్తూ శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.