ప్రభుత్వ వైద్యాన్ని అమ్మేశారు..! | Government Hospital Private Hospital Aarogyasri | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైద్యాన్ని అమ్మేశారు..!

Published Sun, Jul 2 2017 2:00 AM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

ప్రభుత్వ వైద్యాన్ని అమ్మేశారు..!

ప్రభుత్వ వైద్యాన్ని అమ్మేశారు..!

నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలోని రోగులను ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు
ప్రతి ఆరోగ్యశ్రీ కేసు పంపాల్సిందేనంటూ ‘రాజకీయ’ ఆదేశాలు
అధికార పార్టీ వైద్యుడికి స్వామిభక్తిని చాటుతున్న వైద్యసిబ్బంది
ఆర్థిక భారాన్ని మోస్తున్న రోగులు


రొంపిచర్లకు చెందిన సుబ్బారావుకు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఏరియా వైద్యశాలలో చేరాడు.  డాక్టర్‌ గాయాలకు కట్టుగట్టి ఇక మిగిలిన వైద్యం ప్రైవేటు వైద్యశాలలో చేస్తారంటూ ఉచిత సలహా ఇచ్చేశాడు. అదీ ఏ వైద్యశాల్లో చేస్తారో కూడా ఈయనే సెలవిచ్చారు.  రోగి బంధువులు  నివ్వెరబోయి అంత స్తోమత తమకెక్కడ ఉందని వాపోయారు.  

పల్నాడుకు ఏ చిన్న జబ్బు చేసినా వెంటనే గుర్తొచ్చేది నరసరావుపేట ఏరియా ప్రభుత్వ వైద్యశాలే. రొప్పొచ్చినా రోగమొచ్చినా గంపెడంత ఆశతో అడుగుపెట్టే పేదోడిని గుమ్మంలో నుంచే బయటికి తోసేస్తున్నారు ప్రభుత్వ వైద్యులు.

నరసరావుపేట టౌన్‌: ఇందులేదు అందులేదు ఎందెందు వెతికినా అందందే గలదు అన్న చందంగా మారింది అధికార పార్టీ నాయకుల వసూళ్ల పర్వం. కొద్ది రోజులుగా నరసరావుపేట ఏరియా వైద్యశాలకు ప్రతి రోజూ ఒక ప్రైవేటు అంబులెన్స్‌ రావడం కొందరు రోగులకు తీసుకెళ్లడం ఆనవాయితీగా మారింది. ఇదేంటబ్బా ప్రభుత్వ ఏరియా వైద్యశాల నుంచి  వెళితే గుంటూరు జీజీహెచ్‌కు కేసులు వెళ్లాలి కదా అనుకుని ఆరా తీస్తే అసలు బాగోతం బయట పడింది. దీనికి ఊతమిస్తూ గురువారం నరసరావుపేట మండలం దొండపాడుకు చెందిన ఆత్మకూరు అంజిబాబు కాలు విరగడం..ఆయన ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు రావడం..వైద్యులు రోజు మాదిరిగానే వారు ఎంపిక చేసిన ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లమని చెప్పడం చకచకా జరిగిపోయాయి. క్షతగాత్రుణ్ణి పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి బాధితుడి బందువులు విషయాన్ని చెప్పి వాపోయారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోమారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని వైద్యులు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే జోక్యంతో అంజిబాబును  ప్రైవేటు వైద్యశాలకు పంపించే ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

రాజకీయ ఒత్తిళ్లతోనే..
అధికార పార్టీకి చెందిన ఓ వైద్యుడు ప్రకాష్‌నగర్‌లో నిర్వహిస్తున్న తన ప్రైవేటు ఆసుపత్రికి కొన్ని నెలల క్రితం ఆరోగ్యశ్రీ పథకం అమల్లోకి వచ్చింది. దీంతో ఏరియా వైద్యశాలకు వచ్చే కేసులను తమ ఆసుçపత్రికి పంపాలని వైద్యులపై రాజకీయ పరమైన ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. దీంతో ఏరియా వైద్యశాలకు ఓíపీ కోసం వచ్చి శస్త్రచికిత్సలు అవసరమైన రోగులను ఆ ప్రైవేటు వైద్యశాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే ప్రతి కేసునూ అదే వైద్యశాలకు పంపేలా చూడాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించినట్లు తెలిసింది. ఒకవేళ పొరపాటున ఇతర వైద్యశాలలకు కేసు వెళితే సిబ్బందిని, వైద్యులను ఫోన్‌ చేసి నోటికి ఇష్టం వచ్చిన పరుష పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఏరియా వైద్యశాల సమీపంలో అధునాతన హంగులతో మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలు ఉన్నప్పటికీ అధికార పార్టీకి చెందిన వైద్యుడిì ప్రైవేటు ఆస్పత్రికే రోగులను పంపుతూ స్వామిభక్తిని చాటుకుంటున్నారు వైద్యులు. ముఖ్యంగా ఆర్థోపెడిక్‌ కేసులు ఎక్కువ భాగం పంపిస్తున్నారు.

కమీషన్‌ కోసం పోటీ ..
శస్త్రచికిత్సలు అవసరమైన కేసును ప్రకాష్‌నగర్‌లోని ప్రైవేటు వైద్యశాలకు పంపితే ఒక్కో కేసుకు రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకు కమీషన్‌న్‌రూపంలో ముట్ట చెబుతున్నారు. దీంతో వైద్యులు, సిబ్బంది పోటీపడి ప్రథమ చికిత్స అందించిన మరుక్షణమే ప్రైవేటు వైద్యశాలకు ఫోన్‌ వెళుతుంది. అక్కడ నుంచి వెంటనే అంబులెన్స్‌ వచ్చి వాలిపోతుంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సేవలు అందిస్తారంటూ చెబుతూ రోగులను మాయ చేసి తీసుకెళుతున్నారు. తీరా శస్త్రచికిత్స అనంతరం ఇతర సేవల పేరిట ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్తున్నారు.

దిగజారుతున్న ప్రతిష్ట....
పల్నాడు ప్రాంతానికి పెద్దాస్పత్రిగా పేరొందిన ఏరియా వైద్యశాలకు నియోజకవర్గ ప్రజలతోపాటు పల్నాడు, ప్రకాశం జిల్లా నుంచి నిత్యం సుమారుగా 600 మందికిపై వస్తుంటారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సేవల పరంగా వెనుక పడింది. ప్రతి అంశంలోనూ అధిర పార్టీకి కప్పం కడుతుండాల్సి రావడంతో వైద్యులు కూడా డీలా పడిపోయారు. ఏరియా వైద్యశాలకు ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ నామమాత్రంగానే సేవలు అందిస్తున్నారు. ఏరియా వైద్యశాలకు వచ్చిన రోగుల వివరాలు ఆ ప్రైవేటు వైద్యశాలలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా శస్త్రచికిత్సలు చేయించుకున్న వారి కేసులు పరిశీలిస్తే అక్రమాలు వెలుగుచూస్తాయి. ఈ వ్యవహారంపై వైద్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌ దృష్టి సారించకుంటే భవిష్యత్తులో రోగులకు మరింత ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement