'కోడి పందేలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఏదీ' | Harirama jogaiah takes on political leaders in west godavari | Sakshi
Sakshi News home page

'కోడి పందేలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఏదీ'

Published Wed, Jan 20 2016 11:44 AM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM

చేగొండి వెంకట హరరామజోగయ్య - Sakshi

చేగొండి వెంకట హరరామజోగయ్య

జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు మాజీ ఎంపీ జోగయ్య లేఖాస్త్రం
 
 
పాలకొల్లు : ‘హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో కోడిపందేలు జరగనివ్వం. పందేలను ప్రోత్సహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరికలు చేశారు. తెరచాటున అనుమతులిచ్చి కోడిపందేలు ఆడించడం చాలా దారుణం’ అని మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామజోగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులపై సంధించిన లేఖాస్త్రాన్ని మంగళవారం పత్రికలకు విడుదల చేశారు.

కోడి పందేల విషయంలో పోలీస్ ఉన్నతాధికారుల చేతులు కట్టేయడానికి చినబాబు (లోకేష్) కారణమని కొందరు, లక్షలాది రూపాయలు చేతులు మారడం వల్లేనని మరికొందరు గుసగుసలాడుకోవడాన్ని గమనిస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ స్థాయికి దిగజారిపోయిందో, అవినీతి ఎంత పెరిగిపోయిందో అవగతం అవుతోందని జోగయ్య తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధులకు కోడిపందేలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయాక జిల్లాలోని ప్రజాప్రతి నిధులు చెప్పుకోదగిన అభివృద్ధి కార్యక్రమం గాని, సంక్షేమ పథకాన్ని గాని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒప్పించి తీసుకువచ్చిన జాడలేదని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు, మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాత్రం తన సొంత పలుకుబడితో కేంద్రాన్ని ఒప్పించి నిట్ విద్యాసంస్థను తీసుకురాగలిగారని, జిల్లాలో ఆ ఒక్కటి తప్ప చెప్పుకోదగిన అభివృద్ధి కార్యక్రమం ఏమీ లేదని అభిప్రాయపడ్డారు.

కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత చేస్తున్న అభివృద్ధి అంతా చంద్రబాబునాయుడు సామాజిక వర్గం అధికంగా ఉన్న గుంటూరు జిల్లాకు మాత్రమే పరిమితమైందని చెప్పక తప్పడం లేదన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరిలో నిల్వ ఉన్న కొద్దిపాటి నీటిని కృష్ణా, గుంటూరు జిల్లాలకు తరలించి ఉభయ గోదావరి జిల్లాల రైతులకు సాగునీరు లేకుండా చేసిన ఘనత చంద్రబాబునాయుడుదేనన్నారు.

టీడీపీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడటానికి ‘పశ్చిమ’ ప్రజలే కారకులయ్యారని, అటువంటి జిల్లాలో కనీస అభివృద్ధి కార్యక్రమాలైనా చేపట్టకపోవడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. డెల్టా ప్రాంత ప్రజలు రక్షిత మంచి నీరు అందక రోగాల పాలవుతున్నారని చెప్పారు. డెల్టాప్రాంత ప్రజలకు పంట కాలువల ద్వారా మంచినీరు అందించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం కాకుండా.. ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేయడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేసిన ప్రతిపాదనలను కార్యరూపంలోకి తీసుకురావాలని కోరారు. దీనికి సుమారు రూ.1,500 కోట్లు వ్యయం అవుతుందని ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేశారన్నారు.

జిల్లాలో పేద ప్రజలకు ప్రభుత్వపరంగా ఆధునిక వైద్యం లభించడం లేదని, ప్రతిచిన్న వైద్యానికి హైదరాబాద్ పరుగెత్తాల్సిన దుస్థితి ఉందన్నారు. జిల్లాలో నిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాల్సిన అవసరం ఉందని లేఖలో జోగయ్య పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగాలు అమరావతి రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాల వారికే పరిమితమయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్‌గా ప్రకటిస్తే తప్ప రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారికి ఉద్యోగ అవకాశాలు ఉండవన్నారు.

గోదావరి పుష్కరాలకు రూ.1,500 కోట్లు, రాజధాని శంకుస్థాపనకు రూ.400 కోట్లు, ప్రతిరోజు చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరగడానికి కోట్లాది రూపాయలు వెచ్చించగలిగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పశ్చిమగోదావరి జిల్లాను అభివృద్ధి చేయడానికి అయ్యే ఖర్చు పెద్ద సమస్య కాదన్నారు. కోడిపందేలను ప్రోత్సహించడంలో ప్రజాప్రతినిధులు చూపిన చొరవను జిల్లాలోని సమస్యల పరిష్కారం, అభివృద్ధిపైనా చూపాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కోడిపందేల వంటి చిల్లర చేష్టలతో పబ్బం గడిపే ప్రజాప్రతినిధులకు ఏవిధంగా బుద్ధి చెప్పాలో ప్రజలే నిర్ణయించుకోవాలని జోగయ్య ఆ లేఖలో సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement