అనంతపురం సెంట్రల్ : ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతన్న అంతర్ రాష్ట్ర దొంగ ఎట్టకేలకు పోలీసుల వలకు చిక్కాడు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు రూరల్ ఆల్పనహళ్లికి చెందిన రియాజ్ అనే దొంగను శనివారం అరెస్టు చేసినట్లు అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ, సీఐ రాఘవన్ విలేకరులకు తెలిపారు. అనంతపురం వేణుగోపాల్‌నగర్‌లో జయచంద్రాచారి అనే వ్యక్తి ఇంట్లో గత ఫిబ్రవరి 21న చోరీ జరిగిందన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా.. చోరీ చేసింది పైన పేర్కొన్న రియాజ్‌గా తేలిందన్నారు. అతని నుంచి 30 తులాల బంగారు, రెండు కిలోల వెండి ఆభరణాలతో పాటు ఒక టీవీనీ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వాటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని చెప్పారు. ఇదే కేసులో మరో నిందితుడు నల్లబోతుల నాగప్ప పరారీలో ఉన్నాడన్నారు.