మల్లన్న సాగర్ ప్రాజెక్టు సాధ్యమా?
సంగారెడ్డి మున్సిపాలిటీ: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి సాధించిందని ప్రభుత్వ మాజీ విప్ టి.జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఎన్నో ప్రాజెక్టులు వచ్చాయన్నారు. టీఆర్‌ఎస్ నేతల విమర్శలను ఆదివారం ఆయన సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ తిప్పికొట్టారు. వైఎస్ హయాంలో మెదక్ జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టుతోపాటు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు తొమ్మిది చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు వచ్చాయన్నారు.
వరంగల్ జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు, కరీంనగర్‌లో ఎల్లంపల్లి, నెట్టెంపాడ్, దిండి ప్రాజెక్టులతోపాటు మెదక్ జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టు ద్వారా 40 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు రూ.300 కోట్లతో వరద కాలువ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఘనపూర్ ఆయకట్టు అభివృద్ధికి నాటి చిన్ననీటిపారుదల శాఖ మంత్రి సునీతా రెడ్డి కోరిక మేరకు రూ.75 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ఈ ప్రాజెక్టులు టీఆర్‌ఎస్ నేతలకు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో ఎన్నడూ అధికారులతో కలిసి గ్రామాలకు వెళ్లలేని దుస్థితికి టీఆర్‌ఎస్ సర్కార్ చేరుకున్నదన్నారు.
అరవై ఏళ్లలో ఏం చేశామో తెలుసుకోండి..
అరవై ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఎంతో చేసిందని జగ్గారెడ్డి అన్నారు. 30 టీఎంసీల సామర్థ్యం గల సింగూర్ ప్రాజెక్టును 1974లో నాటి సీఎం జలగం వెంకళరావు, 1961లో సంగారెడ్డి సమీపంలోని మంజీర డ్యాంను అప్పటి సీఎం దామోదర సంజీవయ్య శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుచేశారు. 1959లో లాల్‌బహదూర్ శాస్త్రి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు బీహెచ్‌ఈఎల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. ఓడీఎఫ్‌లో 6 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత నాటి ప్రధాని ఇందిరా గాంధీకి దక్కుతుందన్నారు. బీడీఎల్‌ను సైతం కాంగ్రెస్ హయాంలోనే తీసుకొచ్చారని గుర్తు చేశారు. కంది సమీపంలో ఐఐటీని కాంగ్రెస్ హయాంలోనే మంజూరైందన్నారు.
ఇలా అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కేవలం తాగు, సాగు నీరే కాకుండా ఉద్యోగ అవకాశాలను కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పరిశ్రమలను జిల్లాకు తీసుకురావడం జరిగిందన్నారు.
టీఆర్‌ఎస్‌కు రాజకీయ భిక్ష పెట్టింది సోనియానే..
సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే సీఎంగా కేసీఆర్, మంత్రిగా హరీశ్‌రావు, ఎమ్మెల్యేగా చింతా ప్రభాకర్‌తోపాటు కేసీఆర్ కూతురు కవిత ఎంపీ అయ్యారని జగ్గారెడ్డి తెలిపారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమా..
టీఆర్‌ఎస్ నాయకులకు దమ్ముంటే మల్లన్న సాగర్‌పై చర్చకు రావాలని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. గోదావరి నది ప్రవహిస్తే ఎత్తిపోతల ద్వారా మల్లన్న సాగర్ ప్రాజెక్టును నింపుతామని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రకటించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టులను నింపడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కేవలం ప్రాజెక్టుల పేరుతో డబ్బులను దండుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజి అనంత కిషన్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ సాబేర్ తదితరులు పాల్గొన్నారు.