కష్టాల్లో ‘ఒప్పందం’ | junior contract lecturers problems | Sakshi
Sakshi News home page

కష్టాల్లో ‘ఒప్పందం’

Published Fri, Aug 18 2017 1:14 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

కష్టాల్లో ‘ఒప్పందం’ - Sakshi

కష్టాల్లో ‘ఒప్పందం’

రెన్యూవల్‌కు నోచుకోని ‘జూనియర్‌’ కాంట్రాక్ట్‌ లెక్చరర్లు
జీతాలు రాక అధ్యాపకుల అవస్థలు


అనంతపురం ఎడ్యుకేషన్‌: సమాజంలో గౌరవంగా చెప్పుకోవడానికే వారు అధ్యాపకులు. కానీ చాలా దుర్భర జీవితాలు గడుపుతున్నారు. చాలీచాలని జీతం... దీనికితోడు మూన్నెళ్లకోసారి జీతం.. ఇవీ  ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకుల ఇక్కట్లు.  జిల్లాలో 42 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 406 మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులు పని చేస్తున్నారు. జూన్‌ 1 నుంచి కళాశాలలకు వెళ్తున్నారు. కానీ ఇప్పటిదాకా వారిని రెన్యూవల్‌ చేయలేదు. 2016–17 విద్యా సంవత్సరం ఏప్రిల్‌తో ముగిసింది. ఇంతటితోనే వీరి ఒప్పందమూ రద్దయింది. తర్వాత 2017–18 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ప్రభుత్వం రెన్యూవల్‌ చేయకపోయినా స్థానిక అవసరం దృష్ట్యా కాంట్రాక్ట్‌ లెక్చరర్లందరూ వారివారి పాత కళాశాలల్లోనే పని చేస్తున్నారు.

జీతాలేవీ..?
రెన్యూవల్‌ చేయలేదంటే అధికారికంగా పని చేయడం లేదనే లెక్క. ఫలితంగా వారికి జీతాలు రావడం లేదు.  జూన్, జూలై నెలల జీతాలు రావాల్సి ఉంది. అయితే పని చేయని కారణంగా ఏప్రిల్, మే రెండు నెలలు కూడా వారు జీతాలకు నోచుకోలేదు. ఆ రెన్నెళ్లు కుటుంబాలు నెట్టుకొచ్చేందుకు అష్టకష్టాలు పడ్డ కాంట్రాక్ట్‌ అధ్యాపకులు విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ఊపిరి పీల్చుకున్నారు. అయితే రెన్యూవల్‌ కాని కారణంగా జీతాలు కూడా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అప్పులు పుట్టక ఇబ్బందులు
జీతాలు రాక ఓవైపు.. అప్పులు పుట్టక మరోవైపు కాంట్రాక్టు లెక్చరర్లు అల్లాడుతున్నారు. చాలామంది జిల్లా కేంద్రంలోనే నివసిస్తూ విధులకు వెళ్లి వస్తున్నారు. ముఖ్యంగా హిందూపురం, మడకశిర, పెనుకొండ, కళ్యాణదుర్గం, తాడిపత్రి, ఉరవకొండ, రాయదుర్గం, కదిరి, గుంతకల్లు తదితర ›ప్రాంతాల్లో పని చేస్తున్న అధ్యాపకుల్లో చాలామంది చార్జీలకు కూడా దిక్కులు చూసే పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు ఉన్న బంగారం బ్యాంకుల్లో కుదవ పెట్టి కుటుంబాలు పోషిస్తుంటే.. మరికొందరు వడ్డీలు  తెచ్కుకుంటున్నారు.

కనీస వేతనం ఏదీ?
మన రాష్ట్రంలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులు కనీస వేతనాలకు కూడా నోచుకోవడం లేదు. తెలంగాణలో కాంట్రాక్ట్‌ అధ్యాపకుల జీతం రూ. 37,100 ఇస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం రూ. 18 వేలు ఇస్తున్నారు. దీన్ని రూ. 27 వేలుకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా...ఇప్పటిదాకా అమలు చేయలేదు.

చాలా ఇబ్బంది పడుతున్నాం
రెన్యూవల్‌ కాని కారణంగానే జీతాలు రాలేదు. కుటుంబ పోషణకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. బంగారు కుదవ పెట్టి అప్పులు తెచ్చుకున్నా. పొరుగు రాష్ట్రంలో అమలు చేసినట్లు వేతనాలు పెంచి మమ్మల్ని ఆదుకోవాలి.
- సత్యనారాయణమ్మ, కాంట్రాక్ట్‌ లెక్చరర్‌

రెన్యూవల్‌ ఉత్తర్వులు రాలేదు
కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెన్యూవల్‌ చేస్తూ ఉత్తర్వులు ఈ పాటికే రావాల్సి ఉంది. ఎందుకో ఆలస్యమైంది. రెన్యూవల్‌ చేసిన తర్వాత బడ్జెట్‌ రాగానే జీతాల మంజూరుకు చర్యలు తీసుకుంటాం.
 – చంద్రశేఖర్‌రావు, డీవీఈఓ

జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు : 42
కాంట్రాక్ట్‌ అధ్యాపకులు             : 406
రెగ్యులర్‌ అధ్యాపకులు             : 206
మొదటి సంవత్సరం విద్యార్థులు        : 9100
ద్వితీయ సంవత్సరం విద్యార్థులు        : 12995

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement